
చంద్రయాన్ 3 విజయంలో భారత మహిళా సైంటిస్టుల పాత్ర ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ మిషన్ విజయంలో పాలుపంచుకున్న ఇస్రోకి చెందిన ప్రముఖ మహిళా సైంటిస్టుల్లో నందిని హరినాథ్ ఒకరు. ఇన్నేళ్లల్లో తానెన్నడూ స్త్రీగా వివక్షను ఎదుర్కోలేదని అంటున్న రాకెట్ సైంటిస్టు నందిని గురించి మరికొన్ని విశేషాలు..
బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్ లో రాకెట్ సైంటిస్టుగా భారత అంతరిక్ష పరిశోధనల్లో సేవలను అందిస్తున్నారు నందిని హరినాథ్. గత 20 ఏళ్ల కాలంలో ఇస్రోకి చెందిన దాదాపు 14 మిషన్లలో ఆమె పాలుపంచుకున్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్, మంగళ్యాన్ లో డిప్యూటీ ఆపరేటర్ డైరక్టర్ గా నందిని పనిచేశారు. టెలివిజన్ లో వచ్చే స్టార్ ట్రెక్ అనే సీరియల్ బాల్యంలో నందినిని విపరీతంగా ఆకర్షించింది. అదే ఆమెను సైన్స్ రంగంవైపు అడుగులు వేసేలా చేసిందంటారామె. నందిని తల్లి లెక్కల టీచర్, తండ్రి ఇంజనీర్. విచిత్రం ఏమిటంటే ఆ కుటుంబం మొత్తానికి సైన్స్ అన్నా, సైన్స్ ఫిక్షన్ అన్నా విపరీతమైన ఇష్టం. అందుకే వారంతా కలిసి తప్పకుండా స్టార్ ట్రెక్ సీరీస్ ను తప్పకుండా కలిసి చూసేవారట.
ఇస్రోలోనే ఆమె తొలి ఉద్యోగం రావడం మరో విశేషం. అలా మొదలైన ఆమె విధులు ఇప్పటికి అంటే 20 ఏళ్లుగా నిరంతరాయంగా అందులోనే కొనసాగుతున్నారామె. ముందరే చెప్పినట్టు 20 సంవత్సరాల్లో ఇస్రోలో 14 మిషన్లలో నందిని క్రియాశీలకంగా పాల్గొన్నారు. మిషన్ డిజైనర్ ప్రాజక్టు మేనేజర్ గా నందిని పనిచేశారు. తర్వాత మంగళ్యాన్ మిషన్ లో పాలుపంచుకున్న విషయం తెలిసిందే. కృత్రిమ ఉపగ్రహాలు (ఆర్టిఫీషియల్ శాటిలైట్స్), స్పేస్ వెహికల్స్, సన్, ఏరోస్పేస్ ఇన్ స్ట్రుమెంటేషన్, ఎయిర్ క్రాఫ్ట్ పవర్ సిస్టమ్స్ , ఆస్ట్రనామికల్ పవర్ ఇమేజ్ ప్రొసెసింగ్, అట్మాస్ఫియరిక్ టెక్నిక్స్, యాటిట్యూడ్ కంట్రోల్ , జియోఫిజిక్స్ కంప్యూటింగ్ , రాడార్ ఆంటినాస్, రిమోట్ సెన్సింగ్ వంటి పలు అంశాలపై నందిని అధ్యయన పత్రాలు రాశారు. ఇక ఆమెకు వచ్చిన అవార్డులు ఎన్నో. రిశాట్ 1 ఇస్రో టీమ్ ఎక్సెలెన్స్ అవార్డు వచ్చింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ కు ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది. ఇలా ఎన్నో ఉన్నాయి.
చంద్రయాన్ 3 శాటిలైట్ ప్రాజక్టు పై పనిచేసిన మహిళా శాస్త్రవేత్తల్లో నందిని మరో ప్రముఖ భారత సైంటిస్టు. చిన్నతనం నుంచీ అంతరిక్ష అధ్యయనంపై, అంతరిక్ష సైన్స్ పై నందినికి విపరీతమైన ఆసక్తి ఉండేది. స్టార్ ట్రెక్ చూడడంతో మొదలైన ఆమె సైన్స్ ఆసక్తి అంతరిక్షాన్ని శోధించాలన్న లక్ష్యంపై పడింది. నాసా, ఇస్రోలు సంయుక్తంగా కలిసి చేపట్టిన నిసార్ అనే శాటిలైట్ పై కూడా నందిని పనిచేశారు. భారత తొలి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రీశాట్ 1 ఆపరేషన్స్ డైరక్టరుగా పనిచేశారు. మంళ్యాన్ మిషన్ తో నందిని గౌరవం మరింత ఇనుమడించింది. ఈ మిషన్ సమయంలో రోజుకు పది గంటలు పనిచేసేవారమని, మిషన్ దగ్గరపడిన తర్వాత 14 గంటలు పనిచేశామని ఆ తర్వాత లాంచింగ్ టైములో ఇంటికి వెళ్లకుండా ఆఫీసులోనే ఉంటూ పనిచేశామని నందిని గుర్తుతెచ్చుకున్నారు. అలాగే ఇస్రోలో స్త్రీపురుష వివక్ష ఎన్నడూ చూడలేదని నందిని అంటారు. అక్కడ సిబ్బంది అంతా ఎప్పుడూ పనిలో మునిగితేలుతుంటారు కాబట్టి స్త్రీపురుష వివక్ష వంటి ఆలోచనలకే తావు ఉండదని చెప్పారు . ఎప్పుడూ పనిలో మునిగితేలే మహిళలకు తాము స్త్రీలమనే విషయం కూడా గుర్తుకురాదని వ్యాఖ్యానించారు.
రానున్న రోజుల్లో మీటింగులు హోటల్స్ లో కాకుండా అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లలో జరుగుతాయని రాకెట్ సైంటిస్టు నందిని అంటారు. అధ్యయనాలతో సంబంధం లేకుండా హాలిడే గడపడానికి అంతరిక్షానికి ప్రజలు వెళ్లే రోజులు ఎంతో దూరంలేవంటారామె. చిన్నతనం నుంచీ సైన్స్ ఫిక్షన్ ఫ్యాన్ అయిన నందిని మార్స్ మిషన్ తన జీవితంలో ఒక కీలక ఘట్టం అంటారు. ఆ విజయం ఇస్రోకే కాదు భారత్ కు కూడా చాలా ముఖ్యమైందని, ఎన్నో విదేశాల కన్ను భారత అంతరిక్ష రంగ పరిశోధనలపై పడిందప్పుడు అంటారామె. అంతరిక్ష రంగంలో బారత్ తో కలిసి పనిచేయాలన్న ఉద్దేశాన్ని పలు దేశాలు వ్యక్తంచేయడం గురించి పంచుకున్నారు. భారత్ అలా అంతరిక్ష అభివృద్ధి పరంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకోవడం మనం సాధించిన మరో గొప్ప ఘనత అని నందిని అంటారు. ఈ రంగంలో విజయం సాధించాలంటే స్త్రీపురుషులిద్దరూ సమానంగా శ్రమపడాల్సిందేనంటారు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే కాకుండా సంపన్న దేశాలలో కూడా సైన్స్, టెక్నాలజీ, కంప్యూటింగ్, మ్యాథ్స్ వంటి వాటిల్లో స్త్రీలు సౌకర్యవంతంగా పనిచేయలేరనే స్టిరియోటైప్ ఆలోచనలు కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. కుటుంబబాధ్యతలు, ఉద్యోగవిధుల మధ్య, పిల్లల బాధ్యతల పరంగా పలుమార్లు తీవ్ర ఇబ్బందులకు గురయిన పరిస్థితులను కూడా ఎదుర్కొన్నట్టు చెప్పారు. కూతురు తెల్లారకట్ట నాలుగు గంటలకు చదువుకునేటప్పుడు తాను కూడా బిడ్డకు తోడుగా ఉండి గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ‘ఇపుడు మా అమ్మాయి బాగా చదువుకుంటోంది. మెడికల్ స్కూల్ లో చదువుతోంది. అప్పుడు పడ్డ కష్టం ఊరికేపోలేదు’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. జాబిల్లిపై ఈ రాకెట్ సైంటిస్ట్ చేసిన సంతకం స్త్రీ ప్రతిభకు మరో నిదర్శనమని వేరే చెప్పాలా..