Hum Mei Shahensha Kaun Hai: సుమారు 40 ఏళ్ల తర్వాత ఓ సినిమా విడుదల కాబోతున్నది. అది కూడా హిందీ సినిమా! పైగా రజనీకాంత్ నటించిన సినిమా! 1989లోనే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని ఆ సినిమా పేరు హమ్ మే షాహెన్షా కౌన్. ఇందులో ఒకప్పటి టాప్ స్టార్లంతా నటించారు. రజనీకాంత్‌తో పాటు శత్రుఘ్న సిన్హా, హేమామాలిని, అనితా రాజ్ , ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనాలే కాదు, ఇప్పుడు మన మధ్యలేని అమ్రిష్ పూరి, జగదీప్ కూడా సినిమాలో కనిపిస్తారు. నిర్మాత రాజా రాయ్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా దర్శకుడు హర్మేష్ మల్హోత్రా ఇప్పటికే కన్నుమూశారు. ఈ సినిమాలో భాగస్వాములైన నటులు, టెక్నిషియన్లలో కొందరు మరణించారు. సినిమాకు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతాన్ని అందించారు. సలీం ఫైజ్ మాటలు రాశారు. సరోజ్ ఖాన్ డాన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
లండన్ వెళ్లడం వల్లే..
ఈ సినిమా ప్రారంభించిన తర్వాత చాలా కష్టాలను ఎదుర్కొన్నామని నిర్మాత రాజా రాయ్ చెబుతూ ఇప్పటికైనా సినిమా విడుదలవుతుందంటే అది కేవలం విధి రాత అని అన్నారు. 1989లోనే షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల కాకపోవడానికి చాలా కారణాలున్నాయి. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నిర్మాత రాజా రాయ్ బిజినెస్ పని మీద లండన్ వెళ్లారు. అప్పుడే తన చిన్న కుమారుడు చనిపోయాడు. దాంతో రాజా రాయ్ డిప్రెషన్లోకి వెళ్లారు. చాలా ఏళ్ల తర్వాత కానీ మామూలు మనిషి కాలేకపోయాడు. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. కొన్నేళ్ల కిందట సినిమాను విడుదల చేద్దామని అనుకున్నారు. కాకపోతే దర్శకుడు హర్మేష్ మల్హోత్రా చనిపోవడంతో మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పటికీ ఆ సినిమాకు మోక్షం దొరికింది. పిక్చర్ క్వాలిటీ కోసం ఏఐను ఉపయోగించారు. 4K టెక్నాలజీతో హమ్ మే షాహెన్షా కౌన్ టైటిల్‌తోనే విడుదల కానుంది.