SPB Statue Inauguration Kerala: గాన గంధర్వుడు, సినీ సంగీతం శిఖరం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేడంటే నమ్మడం కష్టం. ఎందుకంటే ఆయన పాటలు అజరామరం కాబట్టి! తెలుగువారు ఆయన పట్ల ఎలాంటి అభిమానం చూపిస్తారో తెలియదు కానీ దక్షిణాదిన ఆయనకు మన కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. కన్నడ ప్రజలకు ఆయనంటే విపరీతమైన భక్తి. తమిళనాడు, కేరళలో కూడా అభిమానులు ఎక్కువే! ఆయన జ్ఞాపకార్థం కేరళలోని పాలక్కాడ్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించారు.
దాంతో పాటు మెమోరియల్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన తండ్రికి దక్కిన అరుదైన గౌరవంపై ఆయన కుమారుడు, గాయకుడు ఎస్.పి. చరణ్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగానికి గురయ్యాడు. ఆయన సందేశం అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న చరణ్ “ఒక లెజెండ్ కోసం లెజెండ్లంతా ఒక్కటయ్యారు.
పాలక్కాడ్‌లో నాన్నగారి విగ్రహావిష్కరణ, మెమోరియల్ ప్రారంభోత్సవం మా కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకునే క్షణం. కొన్ని గళాలు ఎప్పటికీ మూగబోవు.. అవి శాశ్వతంగా నిలిచిపోతాయి” అంటూ ఓ మెసేజ్ పెట్టారు. వేలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఈ వేడుకను చూస్తుంటే నాన్నగారు ఇంకా మన మధ్యే ఉన్నట్లు అనిపిస్తోందని అన్నాడు.
పాలక్కాడ్ జిల్లాలోని యాక్కరలో ఉన్న వి.టి. భట్టాతిరిపాడ్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాయనీగాయకులంతా హాజరయ్యారు. ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి బాలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రసిద్ధ గాయకులు కె.ఎస్. చిత్ర, హరిహరన్ కలిసి ఎస్పీబీ మెమోరియల్ పార్కును ప్రారంభించారు. ఈ వేడుకలో మనో, సుజాత మోహన్, శ్రీనివాస్, ఉన్ని మీనన్, మధు బాలకృష్ణన్ వంటి ప్రముఖ గాయకులు పాల్గొని దివంగత గాయకుడికి నివాళులర్పించారు.
మలయాళ మూవీ సింగర్స్ అసోసియేషన్ (SAMAM) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గాయకుడు విజయ్ ఏసుదాస్ (కె.జె. ఏసుదాస్ కుమారుడు)కు చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో విజయ్ కృషి ఎంతో ఉందన్నారు. బాలు విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి ఉన్ని కనాయినిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘మేము ప్రతిరోజూ నాన్నను మిస్ అవుతున్నాము. కానీ పాలక్కాడ్‌లో కనిపించిన అభిమానం, గౌరవం చూస్తుంటే ఆయన ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి అని మరోసారి రుజువైంది” అని చరణ్ తన సందేశాన్ని ముగించారు.