Which Drinks To Avoid Summer Season: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. బయట అడుగుపెడితే చాలు సూర్యుడు సెగలు గక్కుతున్నాడు. ఈ వేడికి శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి విపరీతమైన దాహం వేయడం సహజం. గొంతు ఆరిపోతుంటే వెంటనే మనం చేసే పని.. ఫ్రిజ్‌లో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్‌ను గటగటా తాగేయడం లేదా రోడ్డు పక్కన దొరికే రంగు రంగుల డ్రింక్స్‌లను, పండ్ల రసాలను తాగుతాము. అయితే ఇవి తక్షణ ఉపశమనం ఇస్తాయి కానీ ఇవి మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? ఆరోగ్య నిపుణుల ప్రకారం వేసవిలో ఇలాంటి డ్రింక్‌లకు దూరంగా ఉండటమే మంచిది.
1. శీతల పానీయాలు:
వేసవిలో చాలా మంది ఎక్కువగా తాగేవి కార్బోనేటెడ్ డ్రింక్స్. వీటిలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తాగడం వల్ల ఇందులో ఉండే ‘కెఫీన్’ శరీరాన్ని మరింత డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచి ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ కాకుండా మజ్జిగా లాంటివి తీసుకోవడం మంచిది.
2. టెట్రా ప్యాక్ జ్యూస్‌లు:
చాలామంది తాజా పండ్ల రసాలకు బదులుగా మార్కెట్లో దొరికే టెట్రా ప్యాక్ జ్యూస్‌లను తాగుతుంటారు. వీటిలో పండ్ల శాతం కంటే ప్రిజర్వేటివ్స్ (నిల్వ ఉంచే రసాయనాలు), కృత్రిమ రంగులు (Artificial Flavours) ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ లేకపోవడం వల్ల ఇవి కేవలం “ఖాళీ కేలరీల”ను మాత్రమే శరీరానికి అందిస్తాయి. అంతేకాకుండా ఇవి షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది.
3. కెఫీన్ అధికంగా ఉండే డ్రింక్స్:
మనలో చాలా మంది వేసవిలో టీ, కాఫీలు తాగుతుంటారు. వీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం టీ, కాఫీల్లో ఉండే డయ్యూరిటిక్ గుణాలు మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతాయి. దీని కారణంగా శరీరంలో ఉండే నీరు త్వరగా తగ్గుతుంది. ఫలితంగా తలనొప్పి, అలసట వచ్చే అవకాశం ఉంది.
4. అధిక ఐస్ :
వేసవిలో మనం ఎక్కువగా ఐస్ కలిపిన డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు తినడానికి ఇష్టపడుతుంటాము. అయితే అతి చల్లగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. మన శరీర ఉష్ణోగ్రత సుమారు 37°C ఉంటుంది. మనం ఒక్కసారిగా ఐస్ లాంటి చల్లని డ్రింక్స్, ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం ఆ ఉష్ణోగ్రతను సమానం చేయడానికి శక్తిని వృథా చేయాల్సి వస్తుంది. దీనివల్ల గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
వీటికి బదులుగా తీసుకోవాల్సినవి:
ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి కొబ్బరి నీళ్లు చాలా మంచిది. ఇది శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది. అలాగే శరీర వేడిని తగ్గిస్తుంది. వేసవిలో శరీరానికి చలువ చేయడానికి మజ్జిగను మించిన పానీయం లేదు. ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, అల్లం కలిపితే జీర్ణశక్తి పెరుగుతుంది. దీంతోపాటు ప్రతిరోజు ఉదయం రాగి అంబలి తీసుకోవడం ఎంతో మేలు. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం శరీరానికి శక్తి కలుగుతుంది.
దాహం వేసినప్పుడు మార్కెట్లో దొరికే పానీయాలు కాకుండా మట్టి కుండలోని నీరు, ఇంట్లో తయారు చేసుకున్న సహజ డ్రింక్స్ తీసుకోవడం మంచిది.