Roasted Chickpeas For Constipation: మీరు రాత్రిపూట ఏదీ పడితే అది తింటున్నారా? అయితే జాగ్రత్తగా.. మనం రాత్రిపూట తినే ఆహారం నేరుగా మన జీర్ణవ్యవస్థ మీద దెబ్బపడుతుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ముఖ్యంగా మలబద్ధక సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. అయితే రాత్రిపూట ఎలాంటి స్నాక్ తినాలి? అసలు తినకుండా ఉంటే మంచిదా? ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారంటే .. రాత్రిపూట చిప్స్, కూల్‌డ్రింక్స్, పీజా వంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ఒక వేళ మీకు రాత్రిపూట ఆకలి కోరికలు కలుగుతే ఈ అద్భుతమైన స్నాక్‌ను తీసుకోవచ్చు. అది ఏంటో తెలుసా..? మరేదో కాదు.. వేయించిన శనగలు (Roasted Chickpeas).
శనగలు ఎందుకు మేలు చేస్తాయి?
శనగల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సజావుగా సాగడానికి అవసరమైన విటమిన్లు ఇందులో మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ రీచ్ కంటెంట్ ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఒక కప్పు శనగల్లో మన శరీరానికి రోజుకు కావాల్సిన ఫైబర్ లో దాదాపు 20% లభిస్తుంది. దీని వల్ల మలం ప్రేగుల ద్వారా సులభంగా ముందుకు కదిలేలా చేస్తుంది.
మంచి బ్యాక్టీరియాకు ఆహారం:
అంతేకాకుండా శనగల్లో ‘ప్రీబయోటిక్స్’ ఉంటాయి. ఇవి కడుపులో మేలు చేసే బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడతాయి. కడుపులో ఈ మంచి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంటే జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుందని వైద్యులు చెబుతుంటారు.
తక్కువ కేలరీలు:
రాత్రిపూట చిప్స్, సమోసాలు లేదా తీపి పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కానీ వేయించిన శనగలు తింటే కడుపు నిండినట్లు ఉంటుంది అంతేకాకుండా శరీరానికి మేలు చేసే ప్రోటీన్లు అందుతాయి.
ఎలా తీసుకోవాలి?
చాలామంది శనగలు అంటే నూనెలో వేయించినవి అనుకుంటారు. కానీ ఆరోగ్యం కోసం తీసుకునేటప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేయకుండా ఓవెన్లో లేదా బాణలిలో కొద్దిగా ఉప్పు, కారం లేదా మిరియాల పొడి చల్లి డ్రై రోస్ట్ చేసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి ఒక గంట లేదా రెండు గంటల ముందు ఒక చిన్న కప్పు (సుమారు 30-40 గ్రాములు) తీసుకోవడం సరిపోతుంది. బోర్ కొట్టకుండా ఉండటానికి దాల్చిన చెక్క పొడి లేదా కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు.
శనగలు తినేటప్పుడు ఒక విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు దానికి తగినట్లుగా నీరు కూడా ఎక్కువగా తాగాలి. నీరు తక్కువైతే ఆ ఫైబర్ కంటెంట్ ప్రేగుల్లో గట్టిపడి సమస్యను మరింత ఎక్కువ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి శనగలు తిన్న తర్వాత శరీరానికి తగినంత నీరు తాగడం మర్చిపోకూడదు.
బయట దొరికే జంక్ ఫుడ్ కంటే ఇంట్లో తయారుచేసుకునే వేయించిన శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇది కేవలం మలబద్దకాన్ని తగ్గించడమే కాకుండా అధిక బరువు తగ్గాలనుకునే వారికి, రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలోను సహాయపడుతుంది. కాబట్టి రాత్రిపూట స్నాక్స్‌లో శనగలను చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి!