TOP 10 Tips For Better Sleep: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆహారం, వ్యాయామంపై చూపే శ్రద్ధ నిద్రపై చూపించడం లేదు. దీనికి కారణం పని ఒత్తిడి వల్ల లేదా అర్థరాత్రి వరకు స్మార్ట్ఫోన్లలో మునిగిపోవడంతో చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తున్నాయి. అయితే డాక్టర్లు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం సరైన సమయంలో నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సరైన నిద్ర చాలా అవసరం. అయితే ఏ వయసు వారు ఎన్ని గంటల పాటు నిద్రపోవాలి? ప్రశాంతమైన నిద్రను ఎలా పెంచుకోవాలి? అనే విషయాలపై ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం !
వయస్సును బట్టి నిద్ర అవసరం:
నేషనల్ స్లీప్ ఫౌండేషన్ నిపుణుల ప్రకారం వయస్సు పెరిగేకొద్దీ మన శరీరానికి అవసరమయ్యే స్లీపింగ్ టైమింగ్స్ లో మార్పులు వస్తాయి. దీని వల్ల శరీరానికి తగినంత నిద్రలేకపోవడం వల్ల అలసట, నీరసం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఎంత సమయం నిద్రపోవాలో ఇక్కడు తెలుసుకుందాం.
శిశువులు (0-2 ఏళ్లు): పుట్టిన పిల్లలకు అత్యధికంగా 14 నుంచి 17 గంటల పాటు నిద్ర అవసరం. వారు ఎదుగుతున్న కొద్దీ ఇది 11 నుంచి 14 గంటలకు తగ్గుతుంది. కాబట్టి శిశువుల శారీరక, మానసిక వికాసానికి నిద్రే ప్రధాన ఆధారం.
స్కూళ్లకు వెళ్ళే పిల్లలు (3-13 ఏళ్లు): పెరుగుతున్న పిల్లలకు రోజుకు 9 నుంచి 11 గంటల నిద్ర అవసరం. ఇది వారిలో ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
టీనేజర్లు (14-17 ఏళ్లు): ఈ వయస్సులో శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి వీరికి కనీసం 8 నుంచి 10 గంటల గాఢ నిద్ర అవసరం. దీని వల్ల వారి మెదడు చురుకుగా పని చేస్తుంది.
వయోజనులు (18-64 ఏళ్లు): ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ ఒత్తిడి ఉండే ఈ వయస్సు వారు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. చాలామంది 5 నుంచి 6 గంటల పాటు పడుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ దీని వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడుతారు.
వృద్ధులు (65 ఏళ్ల పైబడిన వారు): వీరికి 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది. వయస్సు రీత్యా నిద్ర త్వరగా రాకపోయినా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో శరీరాన్నికి కావాల్సిన నిద్ర లేకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్యసమస్యలు కలుగుతాయి.
నిద్ర లేకపోవడం వల్ల కలిగే నష్టాలు:
సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కేవలం అలసట మాత్రమే కాదు అంతకంటే తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి మందగించడం, త్వరగా చిరాకు పడటం, బరువు పెరగడం, గుండె సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి బారిన పడుతారు.
మంచి నిద్ర కోసం చిట్కాలు:
కేవలం ఎక్కువ సేపు పడుకోవడం మాత్రమే కాదు ఆ నిద్ర నాణ్యంగా ఉండటం కూడా ముఖ్యం. దీని కోసం మీరు ఈ కింద ఇచ్చిన టిప్స్‌ను ఫాలో అవ్వండి:
సమయం: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. వారాంతాల్లో కూడా దీనిని పాటిస్తే శరీరం ఒక క్రమపద్ధతికి అలవాటు పడుతుంది.
డిజిటల్ డిటాక్స్: పడుకోవడానికి గంట ముందే మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లను ఆపేయాలి. ఎందుకంటే వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ మన నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్‌ను అడ్డుకుంటుంది.
వాతావరణం: బెడ్రూమ్ ప్రశాంతంగా, చీకటిగా ఉండాలి. గది ఉష్ణోగ్రత మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి. దీని వల్ల శరీరాన్నికి తగినంత నిద్ర కలుగుతుంది.
ఆహారపు అలవాట్లు: పడుకునే ముందు కాఫీ, టీ వంటి కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. అలాగే రాత్రి భోజనం కూడా తేలికగా ఉండాలి.
ఒత్తిడి తగ్గించుకోవడం: పడుకునే ముందు పుస్తకాలు చదవడం లేదా మెడిటేషన్ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి త్వరగా నిద్ర పడుతుంది.
నిద్ర అనేది విలాసం కాదు అది మన ప్రాథమిక అవసరం. మన శరీరం తనని తాను రీపేర్ చేసుకునే సమయం ఇదే. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనం కోసం ఈరోజు నుంచే సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి.