Smartphone Addiction: నేటి కాలంలో స్మార్ట్ఫోన్ అనేది మన శరీరంలో ఒక భాగమైపోయింది. అది కేవలం ఒక గ్యాడ్జెట్స్ కాదు. మన శరీరంలో అంతర్భాగమైపోయిన ఒక డిజిటల్ అవయవం. ఉదయం కళ్లు తెరవకముందే ప్రపంచాన్ని చూడటం కంటే ఫోన్ నోటిఫికేషన్లు చూడటమే మనకు మొదటి గోల్ అయిపోయింది. ముఖ్యంగా యువతకు ఈ కెమెరా పిచ్చి ఓ రేంజ్లో ఉంది. కడుపు నిండకముందే గ్యాలరీ నిండాలి. ఆవిర్లు కక్కుతున్న బిర్యానీని చూసి ఎంజాయ్ చేసే లోపే ఓ పది యాంగిల్స్ లో ఫోటోలు తీసి స్టోరీ పెట్టాల్సిందే. బాస్ పక్కనే ఉన్నా సరే Hard Work అంటూ ఒక స్నాప్ పడాల్సిందే. ఇక పరాకాష్ట ఏంటంటే చివరికి బాత్రూమ్లోకి కూడా స్మార్ట్ఫోన్ వెళ్లాల్సిందే. ఒకప్పుడు అక్కడ పేపర్లు చదివేవారు ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తున్నారు. బయట ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన ఆ ఐదు నిమిషాలు కూడా డిజిటల్ ప్రపంచంలోనే గడిచిపోతున్నాయి. దీని ట్రెండ్ అని మనుషులు అంటుంటే.. ఆరోగ్యనిపుణులు, శాస్త్రవేత్తలు మాత్రం నరకానికి డైరెక్ట్ దారి అంటున్నారు. వైద్యుల ప్రకారం రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ వాడటం వల్ల మన మెదడు చురుకుదనం మారుతోందని హెచ్చరిస్తున్నారు.
అయితే ఎక్కువ సమయం పాటు ఫోన్ను ఉపయోగించడం వల్ల మెడుదు పై ఎలాంటి ప్రభావం కలుగుతుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం.
1. న్యూరోప్లాస్టిసిటీ: మన మెదడు ప్లాస్టిక్ లాంటిది. మనం చేసే పనులను బట్టి అది తనను తాను మార్చుకుంటుంది. నిరంతరం ఫోన్ స్క్రోలింగ్ చేయడం వల్ల మెదడు ఏకాగ్రతను కోల్పోతోంది.
2. రివార్డ్ సిస్టమ్: ఫోన్ నోటిఫికేషన్లు మెదడులో ‘డోపమైన్’ విడుదల చేస్తాయి. దీనివల్ల మనం ఫోన్కు బానిసలవుతాం.
3. బ్లూ లైట్ ప్రమాదం: స్క్రీన్ నుంచి వచ్చే నీలి రంగు కాంతి జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగాలను దెబ్బతీస్తుంది, నిద్రలేమికి కారణమవుతుంది.
4. మెదడులోని నిర్ణయాలు తీసుకునే భాగం (Prefrontal Cortex) బలహీనపడి అనవసరంగా ఫోన్ చెక్ చేయడం పెరుగుతుంది.
ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలు:
డిజిటల్ హైల్త్: ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే కనీసం ఒక గంట పాటు ఫోన్కు దూరంగా ఉండండి. అలాగే మీ ఫోన్లోని అనవసరమైన నోటిఫికేషన్లను ఆపివేయండి.
క్రమంగా తగ్గించడం: ఒకేసారి ఫోన్ మానేయడం కష్టం కాబట్టి నెమ్మదిగా సోషల్ మీడియా, ఇతర యాప్ల వాడకాన్ని తగ్గించండి.
శారీరక వ్యాయామం: వ్యాయామం చేయడం వల్ల మెదడులో సహజంగానే ఉల్లాసాన్ని ఇచ్చే రసాయనాలు విడుదలవుతాయి. ఇది ఫోన్ ద్వారా వచ్చే తాత్కాలిక ఆనందం కంటే మెరుగైనది.
4-వారాల ప్లాన్:
మొదటి 2 వారాలు: మీరు రోజులో ఎంత సమయం ఫోన్ వాడుతున్నారో కేవలం గమనించండి.
3వ, 4వ వారం: రాత్రి పూట నిద్రపోయేటప్పుడు ఫోన్ను మీ పక్కన కాకుండా వేరే గదిలో ఉంచండి.
చిన్న మార్పులు ఫోన్ వాడాలనిపించినప్పుడు మూడు నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవడం లేదా నీళ్లు తాగడం వంటివి చేయండి.