Thelastcolor
The last color movie review: ప్రస్తుత సమాజం మనుషులకు రకరకాల ముద్రలు (Labels) వేసి వారి అస్తిత్వాన్ని ఆ పేర్లకే పరిమితం చేస్తోంది. ఈ క్రమంలో ఎందరో మహిళలు బలిపశువులవుతున్నారు. ముఖ్యంగా మూఢనమ్మకాల కారణంగా చివరకు అత్యంత విలువైన మానవీయ సంబంధాలు కూడా కుప్పకూలుతున్నాయి. మనుషులు మేధావులైనప్పటికీ, కొన్నిసార్లు చీకటిలో, ముసుగులో జీవిస్తుంటారు. అలాంటి చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి 2019లో వచ్చిన ‘ది లాస్ట్ కలర్’( The last color).
నటీనటులు: నీనా గుప్తా, రుద్రాని ఛెత్రి, అశ్విన్ రిషి తదితరులు.
దర్శకత్వం: వికాస్ ఖన్నా.
కథ (The Plot):
వారణాసిలో సాగే కథ ఇది. వితంతువు అయిన ‘నూర్’ (నీనా గుప్తా) తన జీవితంలో రంగులను కోల్పోయి తెల్లని చీరకే పరిమితమై ఉంటుంది. ఆ సమయంలో ఆమె జీవితంలోకి ‘చోటి’ అనే ఒక చిన్నారి (తాడు మీద నడిచే అమ్మాయి) వస్తుంది. ఆ చిన్నారి నూర్ జీవితంలో మళ్ళీ రంగులు నింపాలని, ఆమెతో హోలీ ఆడాలని కోరుకుంటుంది. సమాజంలోని కట్టుబాట్లను ఎదురించి వారు తమ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారనేదే ఈ సినిమా కథ.
‘నూర్’ ప్రాత విశ్లేషణ:
నూర్ ఒక వితంతువు. చిన్న వయసులోనే ఒక వృద్ధుడితో ఆమెకు వివాహం జరుగుతుంది. విధివశాత్తూ భర్త మరణించడంతో, అతి చిన్న వయసులోనే వితంతు ఆశ్రమంలో చేరాల్సి వస్తుంది. ఈ సినిమాలో నూర్ ఆవేదనను దర్శకుడు వికాస్ ఖన్నా ఒక చిన్న సన్నివేశంలో ఎంతో అద్భుతంగా చూపించారు.
రోజూ తులసి కోట వద్ద పూజలు చేసి, గంగా ఘాట్ వద్ద జపం చేసే నూర్ జీవితంలోకి ‘చోటి’ ప్రవేశిస్తుంది. తన స్నేహితుడిని కలవలేక బాధపడుతున్న సమయంలో చోటికి ఒక చిన్న కుక్కపిల్ల దొరుకుతుంది. మొదట భయపడినప్పటికీ, చోటి దానిని దగ్గరకు తీసుకోగానే అది ఏడుస్తుంది. “అది ఎందుకు ఏడిచింది?” అని నూర్ అడిగితే, “బహుశా ఇప్పటివరకు దానిని ఎవరూ అంత ప్రేమగా చూసుకోలేదేమో” అని చోటి బదులిస్తుంది.
ఆ మాట వినగానే నూర్ తన గతాన్ని, తాను అనుభవించిన ఒంటరితనాన్ని గుర్తుచేసుకుంటుంది. బాల్యంలో తను పడ్డ కష్టాలను, ఆ చిన్న సన్నివేశం ద్వారా ప్రేక్షకులు అర్థం చేసుకునేలా దర్శకుడు మలిచారు. ఆ కుక్కపిల్లలాగే నూర్ కూడా తన జీవితంలో ప్రేమకు, ఆప్యాయతకు దూరమైందని మనకు అర్థమవుతుంది.
‘చోటి’ ప్రాత విశ్లేషణ:
చోటి తాడు మీద నడిచే గారడీ చేసే అమ్మాయి. గంగా ఘాట్‌లో అనాథగా బతుకుతున్న ఆమెకు అనార్కలీ (ఒక హిజ్రా) ప్రాణస్నేహితురాలు. అనార్కలీ తోడులో చోటి ఎంతో సంతోషంగా ఉంటుంది. చోటి చాలా చలాకి పిల్ల, అందరితో ప్రేమగా ఉంటూనే.. ఎవరైనా అతి చేస్తే ‘టపాకీ’లా తనదైన శైలిలో పంచ్‌లు వేస్తుంది. చోటి కూడా స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతల కోసం పరితపిస్తూ ఉంటుంది. నూర్‌తో పరిచయం అయ్యాక చోటి ఆమెలో ఒక తల్లిని, మంచి స్నేహితురాలిని చూసుకుంటుంది.
ఒకానొక సన్నివేశంలో… అనార్కలీ హత్య తర్వాత భయాందోళనతో దాక్కున్న చోటిని నూర్ దగ్గరకు తీసుకుని హత్తుకుంటుంది. ఆ సమయంలో నూర్ చూపిన మమకారాన్ని చూసి ‘నిన్ను అమ్మ అని పిలవచ్చా?’ అని అడుగుతుంది. ఆ ఒక్క మాటతోనే నూర్‌పై చోటికి ఉన్న ప్రేమ, గౌరవం ఎంతటివో మనకు అర్థమవుతాయి.
చివరిగా…
ఈ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. ముఖ్యంగా “వచ్చే హోలీ నాటికి నీపై రంగులు చల్లుతాను” అని చోటి నూర్‌కు ఇచ్చే మాట జీవితంలో మార్పు పట్ల ఉన్న ఆశకు సంకేతాని చూపిస్తుంది. ఒక అనాథ బాలిక (చోటి), ఒక విధవ (నూర్), ఒక హిజ్రా (అనార్కలీ) వీరి ముగ్గురి మధ్య ఉన్న బంధం సమాజం విస్మరించిన వ్యక్తుల మధ్య ఉండే ఆప్యాయతను చాటిచెబుతుంది. చోటి ఒక అనాథ అయినప్పటికీ చదువుకోవాలనే తపనను కలిగి ఉంటుంది. తాడు మీద నడిచే గారడీ పిల్ల నుంచి అడ్వకేట్ స్థాయికి ఎదగడం ద్వారా సామాజిక అన్యాయాలను ఎదిరించడానికి ‘విద్య’ ఒక గొప్ప ఆయుధమని ఈ సినిమా నిరూపిస్తుంది. అలాగే కులం, మతం, వయస్సు, సామాజిక హోదాలతో సంబంధం లేకుండా ఏర్పడే మానవీయ సంబంధాలే ఈ సినిమా ఆత్మ. సంప్రదాయాల పేరుతో ఆగిపోయిన జీవితాల్లోకి కొత్త రంగులను (సంతోషాన్ని) తీసుకురావడమే ఈ సినిమా సందేశం.