డెడ్ బాడీ తీసుకున్నారా?
లేదు, కడపటి స్నానానికి తీసుకెళుతున్నారు.
అయితే ఆమెకు చీర కట్టేది ఎవరు?
కేపీఏసీ లలిత
ఎవరు.. భరతన్ భార్య లలితనా?
అవును.. ఆమెనే!
ఏమిటో.. చిత్రం కాకపోతే తన పెళ్లికి ముందు, తర్వాత కూడా తన భర్తతో స్నేహంగా ఉన్న ఆమెకు లలిత చీర కట్టడమేమిటో, బొట్టు పెట్టడమేమిటో, ముత్తయిదువగా సాగనంపడమేమిటో..! చోద్యం కాకపోతే..!
ఆ నిశ్శబ్ద, గంభీరమైన వాతావరణంలో చెవులు కొరుక్కుంటున్నారు ఇద్దరు ముగ్గురు..
అనశ్వర కళాకారిణి శ్రీవిద్య
800 చిత్రాలు, అద్భుత నటన.. కానీ తెర వెనుక అంతా విషాదమే!ఆ సంప్రదాయవాదుల గుసగుసలు విన్న ఒకరు వస్తున్న కోపాన్ని అదిమిపెట్టుకుని, కాసింత మర్యాదగానే ‘అవునండి.. నాకు తెలియక అడుగుతున్నా.. కేపీఏసీ లలితకు లేని బాధ మీకెందుకు? ఈ సంభాషణలేవో మీ ఇంట్లో వెళ్లి చేసుకోండి’ అని సున్నితంగా క్లాస్ తీసుకున్నాడు. విషాదం అలుముకున్న అక్కడి నిశ్శబ్దం ప్రతి ఒక్కరి భావోద్వేగాలను రెట్టింపు చేసింది. అందరి కళ్లల్లో తడి! ఓ ఆత్మీయురాలిన కోల్పోయామన్న బాధ!
ఆ ముద్దు.. ఆఖరి వీడ్కోలు!
నిద్రపోతున్నట్టుగా ఉన్న ఆ భౌతికకాయం నుదిటిపై లలిత పెద్ద బొట్టు పెట్టింది. మౌనంగా రోదిస్తూ ఓ ముద్దు పెట్టింది. అలా అంతిమ వీడ్కోలు పలికింది లలిత.
‘నేను చనిపోతే ఓ పెద్ద బొట్టు పెట్టి నన్ను సాగనంపాలి’. బతికున్నప్పుడు శ్రీవిద్య కోరిక ఇది!
1953 నుండి 2006 వరకు బతికి ఉన్న ఆ సౌందర్య దేవతకు ఆమె కోరిక మేరకు ఆ విధమైన వీడ్కోలు దొరికింది.
జీవితంలో ఒక్కసారైనా తల్లి కావాలని కోరుకుని, చివరకు లోకమంతా ‘విద్యమ్మ’ అని ప్రేమగా పిలుచుకున్న అనశ్వర కళాకారిణి శ్రీవిద్య జీవిత ప్రయాణం ఇది.
1997వ సంవత్సరం.. అనియత్తిప్రావు సినిమా క్లైమాక్స్ సెట్.
‘ఏం చెప్పి నేను ఈమెను దీవించాలి? నా బిడ్డ కదా? ఇటు ఇచ్చేయ్, నేను చూసుకుంటాను.. ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాను’ లలితతో శ్రీవిద్య అన్న డైలాగ్ ఇది!
‘తీసుకో.. తీసుకెళ్లిపో.. అలాగే నీ కొడుకుని కూడా ఈమెకు ఇచ్చేయ్’ ఇదీ శ్రీవిద్యతో లలిత చెప్పిన సంభాషణ!
సినిమాలోని ఆ సన్నివేశంలో ఇద్దరూ పోటీ పడి నటించారు.
కానీ నిజ జీవితంలో ‘తీసుకో, తీసుకెళ్లిపో’ అని తన ప్రేమికుడైన భరతన్‌ను లలితకు అప్పగించింది శ్రీవిద్య. ప్రేమ కోసం తన జీవితాన్ని, ప్రాణాన్ని అంకితం చేసింది. చివరకు ప్రేమ అనే బలిపీఠంపైనే తన జీవితాన్ని ముగించింది శ్రీవిద్య.అలా ఆమెకు రాసిపెట్టి ఉంది కాబోలు!

కమల్ హాసన్‌తో చిగురించిన ప్రేమ
దర్శకుడు రంజిత్ తీసిన ‘తిరక్కథ’ అనే సినిమాకు కమలహాసన్, శ్రీవిద్యల ప్రేమ కథే ఆధారం అని చెబుతారు. సినిమా కథ ఎలా ఉన్నా శ్రీవిద్య, కమలహాసన్ ప్రేమించుకున్నారన్నది వాస్తవం. శ్రీవిద్య ప్రేమ కేవలం కమలహాసన్‌తోనే ఆగిపోలేదు. ఆమెకు గాన గంధర్వుడు ఏసుదాసంటే ప్రేమతో కూడిన అభిమానం. కవి, రచయిత, నటుడు బాలచంద్రన్ చుళ్లిక్కాడ్ను ప్రేమించింది. ప్రముఖ చిత్రకారుడు కె.ఎం. వాసుదేవన్ నంబూద్రిని కూడా ప్రేమించింది.
కానీ మనసుతో, తనువుతో త్రికరణశుద్ధిగా ఆమె ఎవరినైనా ప్రేమించి ఉంటే అది కేవలం దర్శకుడు భరతన్‌ను మాత్రమే!
భరతన్ మాత్రం లలితను పెళ్లి చేసుకున్నాడు.
వీరికి పుట్టిన సిద్ధార్థ్‌ను అపురూపంగా పెంచుకుంటాను, ఇస్తారా అని శ్రీవిద్యలోని తల్లి మనసు అభ్యర్థించింది. తల్లి ప్రేమను పంచాలని ఆరాటపడింది. నిజంగానే శ్రీవిద్య మనసు సున్నితం. నవనీతం!
1953 జూలై 24న చెన్నైలో నటుడు కృష్ణమూర్తి, ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎం.ఎల్. వసంతకుమారి దంపతులకు శ్రీవిద్య జన్మించింది. చిన్నప్పటి నుంచే సంగీతం, నృత్యం పట్ల అభిరుచి పెంచుకుంది. అనారోగ్యం కారణంగా తండ్రి నటనకు దూరం కావడంతో వసంతకుమారి కచేరీలే ఆ కుటుంబానికి ఆధారమయ్యాయి. శ్రీవిద్య బాల్యమంతా ట్రావెన్కోర్ సిస్టర్స్‌గా సుప్రసిద్ధులైన లలిత, పద్మిని, రాగిణిల ఇంట్లోనే గడిచింది. ఆ వాతావరణం శ్రీవిద్యలో నటనపై ఆసక్తి పెరగడానికి కారణమయ్యింది.
పదమూడేళ్ల వయసులో తిరువరుచ్చెల్వర్ అనే తమిళ సినిమాతో బాలనటిగా పరిచయమయ్యింది శ్రీవిద్య. మలయాళంలో చట్టంబికవల (1969) సినిమాతో గుర్తింపు పొందింది. కానీ ఆమెకు గుర్తింపును తెచ్చింది మాత్రం కె. బాలచందర్ రూపొందించిన నూట్రుక్కు నూరు (1971) సినిమానే!
పెళ్లి పీటల వరకు వెళ్లని బంధం.. కమల్ తీసుకున్న నిర్ణయం శ్రీవిద్యను కలిచివేసింది.
కమలహాసన్, శ్రీవిద్యల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిపోయింది. శ్రీవిద్య తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుందా? పెళ్లి చేసుకుందామనుకునే టైమ్‌కు కమల్‌ను వసంతకుమారి ఇంటికి పిలిపించి మాట్లాడారు.
‘మీరు ఇంకా చిన్నవయసులో ఉన్నారు, కెరీర్ ఇప్పుడే మొదలైంది. ఓ అయిదేళ్లు ఆగండి, అప్పటికీ మీ ప్రేమ ఇలాగే ఉంటే నేనే పెళ్లి చేస్తాను’ అని చెప్పారు. ఆ మాట విని కమల్‌కు కోపం వచ్చింది. శ్రీవిద్య మొహం కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే వాణీ గణపతిని కమలహాసన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త విని శ్రీవిద్య కుప్పకూలిపోయింది. నాలో ఉన్న లోపం ఏమిటి?’ అని ఆమె తరచూ ప్రశ్నించుకునేది!

జార్జ్ థామస్‌తో చేదు అనుభవం
కమల్‌ను మర్చిపోవడానికి తీక్కనల్ సినిమా నిర్మాత జార్జ్ థామస్‌ను పెళ్లి చేసుకుంది శ్రీవిద్య. సన్నిహితులు, బంధువులు వద్దని ఎంత చెప్పినా ఆమె వినలేదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శ్రీవిద్య, జార్జ్ కోసం మతం కూడా మారి బాప్టిజం తీసుకుంది. కానీ పెళ్లయిన కొద్దిరోజులకే జార్జ్ ఎలాంటివాడో తెలిసిపోయింది. డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నాడని ఆమెకు అర్థమైంది. ఆమె సంపాదన అంతా కళ్ల ముందే కరిగిపోతుంటే, బలవంతంగా ఆమెకు మళ్లీ మేకప్ వేయించి సినిమాల్లో నటించమని బలవంతపెట్టాడు. గర్భం దాల్చిన ప్రతిసారి బలవంతంగా అబార్షన్ చేయించారు. చివరకు జార్జ్ హింసను భరించలేక తన తల్లి వసంతకుమారి దగ్గరకు వచ్చేసింది శ్రీవిద్య. 14 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత జార్జ్ నుంచి విడాకులు దొరికాయి. జార్జ్ నుండి విడిపోయాక ఆమె దర్శకుడు భరతన్కు దగ్గరయ్యారు. భరతన్కు ప్రేమికురాలిగా, స్నేహితురాలిగా మెలిగారు. భరతన్ లలితతో భరతన్ వివాహం జరిగితే శ్రీవిద్య ఆ బంధాన్ని గౌరవించారు.
విషాదంలో ముగిసిన ప్రయాణం
శ్రీవిద్య చివరి రోజులు చాలా విషాదకరంగా గడిచాయి. క్యాన్సర్ ఆమెను వేధించింది. తన ఆస్తులన్నీ పేద పిల్లల కళా విద్య కోసం అందజేయాలని వీలునామా రాశారు. మరణం దగ్గరపడుతున్నప్పుడు కమలహాసన్‌ను ఒక్కసారి చూడాలనే కోరికను తెలిపింది. పాతవన్నీ మర్చిపోయి కమల్ వచ్చాడు. ఆమెను పరామర్శించాడు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తన మాజీ ప్రియురాలిని చూసి కమల్ చలించిపోయాడు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. కమల్ చూసి వెళ్లిన కొద్దిరోజులకే విద్యమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
కన్నీళ్లతో వీడ్కోలు పలికిన లోకనాయకుడు
ఆమె మరణవార్త విన్నప్పుడు కమలహాసన్ కన్నీళ్లతో ఇలా అనుకుని ఉండవచ్చు
‘RIP… అంటే Return If Possible’
కమలహాసనే కాదు, చాలా మంది అదే కోరుకుంటారు..
శ్రీవిద్య.. వీలైతే ఒక్కసారి రా!