Viv Richards History: The Uncrowned Monarch of the Cricketing World.. ఎవరంటే సర్ ఐజాక్ వివియన్ అలెగ్జాండర్ రిచర్డ్స్. ఈ తరం వారికి ఈ పేరు అంతగా తెలిసి ఉండకపోవచ్చు. క్రికెట్ ఫ్యాన్స్‌కు అరకొర తెలిసే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. ముందు తరం వారికి రిచర్డ్స్ అంటే గౌరవంతో కూడిన అభిమానం. చూడ్డానికి పెద్ద అహంకారిలా అనిపిస్తాడు కానీ చాలా మృదు స్వభావి. సిగ్గరి. ఆయన బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వస్తుంటే కత్తిపట్టుకుని కదనరంగాన దూకే రాజకుమారుడిలా కనిపిస్తాడు. తను మాత్రం ఎప్పుడూ క్రమశిక్షణ కలిగిన సైనికుడిలానే భావించేవాడు! గతాన్ని గౌరవిస్తూనే, వర్తమానంలో జీవించే మనిషి రిచర్డ్స్.
రిచర్డ్స్‌ను చాలా మంది మేధావి అని అంటుంటారు. కానీ కాదు. ఎందుకంటే మేధావిలో తార్కిక ఆలోచన, విశ్లేషణ ఉంటాయి. రిచర్డ్స్ ఆటలో అవేమీ ఉండేవి కావు. ఆయనో సహజసిద్ధమైన ఆటగాడు. విధ్వంసకర ప్రదర్శన చేయగల పోరాట యోధుడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనో గ్లాడియేటర్! ఈ వరం ఆయనకు ఎవరిచ్చారో తెలియదు. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైన ఇమ్రాన్‌ఖాన్ తరచూ ఈ మాట అంటుండేవారు. సీజర్, బిస్మార్క్ వంటి పాలకులకున్నట్టుగానే రిచర్డ్స్‌లో కూడా అణచివేయలేని అధికార కాంక్ష ఉండేది. గ్రౌండ్లో రిచర్డ్స్ చూపించే అధిపత్యం వెనుక శతాబ్దాల పాటు తమకు జరిగిన అన్యాయాల పట్ల ఉన్న ప్రతీకార జ్వాల దాగి ఉండేది.
వెస్టిండీస్‌ను వలస రాజ్యంగా మార్చుకుని, తమను బానిసల కంటే హీనంగా చూసిన ఇంగ్లాండ్‌పై ఓ కసి ఉండేది. అలాగే 1975-76 వేసవిలో తమ క్రికెటర్లను అవమానించిన ఆస్ట్రేలియాపై అంతకు మించిన ఆగ్రహం ఉండేది. అణచివేతకు, వివక్షతకు, అవహేళనకు, అగౌరవానికి ..ఇలా ప్రతి ఒక్కదానికి తన బ్యాట్‌తో బదులిచ్చాడు రిచర్డ్స్.
అత్యంత వేగవంతమైన, ప్రమాదకరమైన బౌలర్లు రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో రిచర్డ్స్ ఒక్కసారి కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. నిజంగానే ఒక్కసారి కూడా! ఆశ్చర్యం వేస్తున్నది కదూ! డెన్నిస్ లిల్లీ, జెఫ్ థామ్సన్, ఇమ్రాన్‌ఖాన్, కపిల్‌దేవ్, చివరికి తన సొంత జట్టులోని భయంకరమైన బౌలర్లు మైకేల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్, జుయెల్ గార్నర్, మల్కం మార్షల్ విసిరే నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొనేటప్పుడు కూడా రిచర్డ్స్ హెల్మెట్ పెట్టుకోలేదు.
తన తోటి క్రికెటర్లందరూ అధునాతన రక్షణ కవచాలను ధరిస్తుంటే, రిచర్డ్స్ మాత్రం కేవలం తన చూపును, తన నిబ్బరాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ఆయనది తీక్షణమైన చూపు. వేగంగా వస్తున్న బంతిని తగినట్టుగా కాళ్లను కదలించడానికి సునిశితమైన చూపు ఉండాలి. ఇది రిచర్డ్స్కు ఎక్కువగానే ఉంది.
రిచర్డ్స్‌ను ‘బ్లాక్ బ్రాడ్‌మన్’ అని పిలిచేవారు. అది కేవలం ఆయన చేసే భారీ స్కోర్ల వల్ల మాత్రమే కాదు, బంతి విసరకముందే దానిని పసిగట్టే ఆయన అసాధారణమైన సామర్థ్యం వల్ల. ఆయన దెబ్బకు ఎంతటి ఫాస్ట్ బౌలర్లయినా గజగజలాడిపోయేవారు. రిచర్డ్స్ దెబ్బకు కొంతమంది బౌలర్లను తమ కాన్ఫిడెన్స్నే కోల్పోయారు. ఇంకొందరు తన కెరీర్‌నే ముగించేశారు. అంత క్రూరంగా రిచర్డ్స్ దాడులు ఉండేవి. అది టెస్ట్ మ్యాచే అవ్వనీ, లేదా వన్డే మ్యాచే అవ్వని రిచర్డ్స్ ఒకే ఒక్క సూత్రాన్ని నమ్ముకున్నారు.
It was either he or they. అంటే నేనా లేక వాళ్లా? రిచర్డ్స్లోని ఈ పట్టుదల 1975-76 ఆస్ట్రేలియా పర్యటనలో మొదలైంది. అప్పట్లో డెన్నిస్ లిల్లీ, జెఫ్ థాంప్సన్ వేగం ఊహాతీతం. బంతి అసలు కనిపించేదే కాదు. ముఖ్యంగా థాంప్సన్ విసిరే బాల్స్‌కు రియాక్టవ్వడం మానవమాత్రులకు అసాధ్యం. ఈ విషయాన్ని సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. 1975-76 ఆస్ట్రేలియా పర్యటనలో రిచర్డ్స్ దూకుడుకు పట్టాపగ్గాలు లేకుండాపోయాయి.
ఆ సిరీస్‌లో రిచర్డ్స్ విజృంభించారు. బంతి ఎంత వేగంగా వచ్చినా, ఎంతటి బౌన్సర్నైనా ఏ మాత్రం బెదరకుండా ఫ్రంట్ఫుట్లోకి వచ్చి బౌండరీలను దాటించాడు రిచర్డ్స్. రిచర్డ్స్ తరహా టైమింగ్, భీకరమైన శారీరక దారుఢ్యం, ప్రత్యర్థిని చిత్తు చేసే శక్తి ఆనాటి ఆటగాళ్లకే కాదు, ఇప్పటి వాళ్లకు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. నమ్మి తీరాల్సిన విషయం. లిల్లీ, థాంప్సన్ వంటి ఫాస్ట్ బౌలర్లు కూడా తమ వేగవంతమైన బంతులు స్టేడియం వెలుపల వెళ్లి పడుతుంటే నోరెళ్లబెట్టి నిస్సహాయంగా చూసేవారు. రిచర్డ్స్ మొహంపై మాత్రం ఓ మందహాసం కనిపించేది. మరింత ఫాస్ట్‌గా బాల్స్ విసరండి అనే వేటకారపు సవాల్ విసిరేవారు.
రిచర్డ్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలో కొంచెం కంగారు పడతారన్నది కొందరి భావన. పిసరంత ఉన్నా తన రాజసం, గాంభీర్యాలతో ఎవరికీ ఆ విషయం తెలియనిచ్చేవారు కాదు! ప్రత్యర్థులు తన బలహీనతను పసిగట్టేలోపే వారిని ఊచకోత కోసి ఆందోళనను పోగొట్టుకునేవారు. రెండు రోజులుగా డామినేట్ చేస్తూ వస్తున్న ప్రత్యర్థి ఆధిపత్యాన్ని కేవలం అరగంటలో నాశనం చేసేవాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో రిచర్డ్స్ అంతటి ప్రమాదకరమైన ఆటగాడు మరొకరు కనిపించరు.
1983 వరల్డ్‌కప్ ఫైనల్లో రిచర్డ్స్ ఆడిన రెండు షాట్లను ఇప్పటికీ కపిల్‌దేవ్ గుర్తు చేసుకుంటారు. ఆఫ్‌స్టంప్‌కు చాలా దూరంగా వేసే బంతులను కూడా రిచర్డ్స్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీలను దాటించాడు. ‘అవుట్‌స్వింగర్‌తో అతడిని అవుట్ చేయాలనుకున్నాను, ఎడ్జ్ దొరుకుతుందని చేతులు పైకెత్తాను. కానీ అంపైర్ అప్పటికే బౌండరీ సిగ్నల్ ఇచ్చారు’ అని కపిల్ చెబుతుంటారు. ఇలా చెబుతున్నప్పుడు కపిల్ మొహంలో రిచర్డ్స్ పట్ల ఉన్న ఆరాధన కనిపిస్తుంటుంది. అలాగే, ఇమ్రాన్‌ఖాన్ కూడా ఒక మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ, ‘కొత్త బంతితో జెఫ్ థాంప్సన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని రిచర్డ్స్ ముందుకు వచ్చి మిడాన్ మీదుగా బౌండరీకి తరలించాడు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిన రిచర్డ్స్ 189 రన్స్ (నాటౌట్) 1984లో ఇంగ్లాండ్‌పై చేసినదే. విస్డెన్ మ్యాగజైన్ దీనిని అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌గా గుర్తించింది. అప్పట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ టోనీ గ్రేగ్ ‘వెస్టిండీస్‌ను మోకాళ్ల మీద నిలబెడతాం’ అని బీరాలు పలికాడు. తనకు అప్పుడు తెలియదు నిప్పుతో చెలగాటమాడుతున్నానని. రిచర్డ్స్‌తో ఎవరూ అలా మాట్లాడకూడదని తర్వాత తెలిసొచ్చింది అతడికి.
రిచర్డ్స్ 16 ఏళ్లప్పుడు డక్ అవుట్ అయినప్పుడు వెనుతిరగడానికి నిరాకరించినందుకు అతడిపై రెండేళ్ల నిషేధం పడింది. చిన్నప్పటి నుండే రిచర్డ్స్ ఆత్మగౌరవం కోసం పోరాడేవారనడానికి ఇదో ఉదాహరణ. 1976లో ఇంగ్లాండ్‌పై నాలుగు టెస్టుల్లోనే 829 పరుగులు చేశారు. 1979-80లో ఆస్ట్రేలియా బౌలర్ రాడ్నీ హాగ్ బౌన్సర్ విసిరినందుకుప్రతీకారంగా రిచర్డ్స్ అతడి తర్వాతి ఆరు ఓవర్లను చీల్చి చెండాడారు. ఆ దెబ్బకు హాగ్ కెరీర్ కోలుకోవడానికి ఏడాది పట్టింది. ఇంగ్లాండ్ బౌలర్ బాబ్ విల్లీస్కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. వర్ణ వివక్షతో కూడిన అనుకూడని మాట అన్నందుకు అతడి బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు రిచర్డ్స్. ఆ దెబ్బకు బాబ్ విల్లీస్ రిటైరవ్వాల్సి వచ్చింది.
రిచర్డ్స్ ఆధిపత్యం ఎంతలా ఉండేదంటే, పొరపాటున ఆయన త్వరగా అవుట్ అయితే మొత్తం వెస్టిండీస్ టీమ్ కుప్పకూలే ప్రమాదం ఉండేది. 1983 ప్రపంచకప్ ఫైనల్లో ఇండియాతో ఓడిపోవడానికి రీజన్ ఇదే! రిచర్డ్స్ కనక తన దూకుడును అదుపులో పెట్టుకుని అవుట్ కాకుండా ఉండి ఉంటే ఇండియా గెలిచేదే కాదు. ఎనిమిదో దశకంలో అటు ఇంగ్లాండ్‌ను, ఇటు ఆస్ట్రేలియాను తన కాలికింద తొక్కి పెట్టాడు రిచర్డ్స్. క్రికెట్ చరిత్రలో రిచర్డ్స్ ఓ మకుటం లేని మహారాజు. రిచర్డ్స్ వంటి ఆటగాడు మళ్లీ రాడు.