మమ్ముట్టి లేటెస్ట్ మూవీ కాలంకావల్ సినిమాను ఓటీటీ లవర్స్ చూసే ఉంటారు. అందులో మమ్మట్టి పోషించిన స్టాన్లీ దాస్ భార్యగా నటించిందెవరన్న ఆసక్తి చాలా మందికి కలిగే ఉంటుంది. ఆమె పేరు సీమ సింధు కృష్ణన్. కేరళ యూనివర్సిటీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కోవిడ్ లాక్డౌన్ టైమ్‌లో అందరిలాగే ఆమె కూడా కొన్ని టిక్ టాక్ వీడియోలు చేసింది. అవే ఆమెను సినిమాల్లోకి వచ్చేలా చేశాయి. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఆడిషన్లలో పాల్గొంటూ సినిమాల్లో అవకాశాలు సంపాదించారు.తిరువనంతపురం యాసపై సీమ సింధుకృష్ణన్కు మంచి పట్టు ఉంది. అదే ఆమెకు ప్లస్ పాయింట్ అయ్యింది. ఆమె నటించిన ప్రతి సినిమాలోనూ ఈ యాసతోనే మాట్లాడతారు. కాలంకావల్ సినిమా కోసం మాత్రం ఆమె తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రత్యేకమైన యాసతో మాట్లాడారు. మమ్మట్టి వంటి సూపర్‌స్టార్‌తో నటించినప్పటికీ బయట ఆమెను ఎవరూ గుర్తుపట్టడం లేదు. అందుకు కారణం ఆ సినిమాలో ఆమె కాసింత వయసు మళ్లిన పాత్రలో, నూలు చీరలు కట్టుకుని కనిపించడం. ఇది తనకు ఒకందుకు మంచిదేనంటారు సీమ. మమ్ముట్టి సినిమాలో ఛాన్స్ రాగానే అదేదో చిన్న పాత్ర అనుకున్నారట! మమ్మట్టి భార్యగా నటించాలని తెలిసి ఆశ్చర్యము, ఆనందమూ కలిగాయట! సెట్స్‌లో సీమను మమ్ముట్టి ఎంతో గౌరవంగా చూసుకున్నారు. ఆమె యూనివర్సిటీలో పని చేస్తున్న విషయం కూడా మమ్ముట్టికి తెలుసు. టివినో థామస్, కీర్తి సురేశ్ కాంబోలో వచ్చిన వాశి సినిమాతో సీమ కెమెరా ముందుకు వచ్చింది. మౌరా సినిమాలో నటిస్తున్నప్పుడే మమ్ముట్టి కంపెనీ నుంచి పిలుపు వచ్చింది.