పుష్ప సినిమాతో నేషనల్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ కొత్త చిత్రంపై ఆసక్తి పెరిగింది. బన్నీ నటించే కొత్త సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఏ జోనర్లో ఉంటుందన్నదానిపై క్యూరియాసిటీ వచ్చింది. అయితే దీనికి సంబంధించి అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్లో కొన్ని కథనాలు వస్తున్నాయి. తమిళనాట ఎంతో పాపులర్ అయిన ఇరుంబు కై మాయావి అనే కామిక్ సీరియల్ ఆధారంగా సినిమా రూపొందబోతున్నదట! తెలుగులో చెప్పాలంటే ఉక్కు చేయి మాంత్రికుడు అన్న మాట! ఈ సూపర్ హీరోకు అసాధారణశక్తులు ఉంటాయి. అంటే ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉంటుందన్నమాట! పైపెచ్చు దీనికి ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కూడా తోడయ్యింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఓ నవల ఆధారంగా సినిమా చేయలేదు. చేస్తే ఇదే మొదటిది అవుతుంది. లోకేశ్ కనగరాజ్ కూడా ఇలాంటి సినిమా చేయలేదు. అంటే ఇద్దరి నుంచి ఓ ఫ్రెష్ సబ్జెక్ట్‌ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మ్యూజిక్ బాధ్యత అనిరుధ్ తీసుకున్నాడు. ఈ త్రయం నుంచి వస్తున్న సినిమా కాబట్టి బాక్సులు బద్దలయ్యే ఛాన్సుంది. ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వారెవరనేది త్వరలో ప్రకటిస్తారు.
ఇరుంబు కై మాయావి తమిళ కామిక్స్‌లో చాలా పాపులర్. బ్రిటిష్ కామిక్ సిరీస్ The Steel Claw ను తమిళంలో దించారు. ముత్తు కామిక్స్ పబ్లిష్ చేసిన ఈ పుస్తకం తెలుగులో కూడా ఉంది. ఇందులో హీరో పేరు లూయిస్ క్రాండెల్. ఓ సైంటిస్ట్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న అతడు ఓ యాక్సిడెంట్లో కుడి చేతిలో కోల్పోతాడు. ఆ ప్లేస్‌లో ఓ ఉక్కు చేతిని అమర్చుకుంటాడు. ఒకానొక సమయంలో లూయిస్ పని చేస్తున్న లాబ్‌లో పేలుడు జరుగుతుంది. ఆ సమయంలో లూయిస్ బాడీలో హై ఓల్టేజ్ ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుంది. దాంతో లూయిస్‌కి అసాధారణ శక్తులు వచ్చేస్తాయి. తన శరీరంలోకి విద్యుత్తును పంపినప్పుడు అదృశ్యమవుతానని తెలుసుకుంటాడు. శరీరం అదృశ్యమైనా ఇనుప చేయి మాత్రం కనిపిస్తుంటుంది. అందుకే అతడు ఇనుప చేయి మాయావిగా ప్రసిద్ధి చెందుతాడు. తనకు అద్భుత శక్తులు ఉన్నాయని తెలుసుకున్న లూయిస్ మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. కానీ తర్వాత పూర్తిగా మారిపోతాడు. బ్రిటిష్ సీక్రేట్ సర్వీస్ ఏజెన్సీలో చేరతాడు. సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ ఉంటాడు.