బాలీవుడ్లో భారీ కలెక్షన్లను వసూలు చేస్తున్న ధురంధర్ సినిమాను ఆరు గల్ఫ్ దేశాలు నిషేధించాయి. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సినిమా ఉన్నదన్నది ఆయా దేశాల అభియోగం. ఇప్పటికే వేల కోట్లను సంపాదించిన ఈ సినిమా ఆ దేశాల్లో విడుదల అయితే మరింతగా సంపాదించుకోవచ్చన్నది నిర్మాతల కోరిక. అందుకే నిషేధంపై జోక్యం చేసుకోవాలని విన్నవించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిర్మాతల మండలి ఓ లేఖ రాసింది. అతి పెద్ద ఇండస్ట్రీ హిట్లలో ధురంధర్ కూడా ఒకటని ఆ లేఖలో పేర్కొంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ ధురంధర్‌పై నిషేధం విధించారని, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని నిర్మాతల మండలి తెలిపింది. ఎలాంటి అభ్యంతరకర, అసభ్యకర సన్నివేశాలు లేవని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని, సినిమాను ఎక్కడైనా విడుదల చేసుకోవచ్చని నిర్మాతల మండలి అధ్యక్షుడు అభయ్ సిన్హా వాదన. గల్ఫ్ దేశాలలో సినిమాపై నిషేధం విధించడమంటే తమ భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడమేనని, భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్‌గా నిలిచిందని అభయ్ సిన్హా చెప్పుకొచ్చాడు. ధురంధర్ సినిమాను బ్యాన్ చేసిన ఆరు దేశాలు మనకు మిత్ర దేశాలే కాబట్టి సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని నిర్మాతల మండలి వేడుకుంది. నిషేధాన్ని వీలైనంత త్వరగా ఎత్తివేయడానికి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన కోరారు. ఈ చిన్ని సాయం చేసిపెడితే మీకు రుణపడి ఉంటామని ప్రధానికి వినమ్రంగా విన్నవించుకుంది నిర్మాతల మండలి. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా 1,220 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మన దేశంలోనే 831.40 కోట్ల రూపాయలు సాధించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో సింగిల్ లాంగ్వేజ్‌లో మాత్రమే విడుదలై ఈ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం.