video viral : బస్సులో షిమ్జితా ఏడు వీడియోలు తీసిందట!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ బస్సు వేధింపు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ షిమ్జితా ముస్తఫా తీసిన వీడియో కారణంగా దీపక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలసిందే. నిందితురాలు షిమ్జితా ముస్తఫా బస్సులో దీపక్‌కు సంబంధించి సుమారు ఏడు వీడియోలను తీసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియోలు దీపక్‌ను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తాయని తెలిసి కూడా ఆమె వాటిని తీసినట్టు, ఫలితంగానే దీపక్ ఆత్మహత్య చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది.
లైంగిక వేధింపులు లేవు
బస్సులోంచి దీపక్, షిమ్జితా మామూలుగానే కిందకు దిగినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. బస్సు సిబ్బంది గానీ, ఇతర సాక్షులు గానీ అక్కడ ఎలాంటి లైంగిక వేధింపులు జరిగినట్లు చెప్పలేదు. లైంగిక దాడి ప్రయత్నం జరిగినట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు అంటున్నారు. ఒకవేళ దీపక్ అసభ్యంగా ప్రవర్తించి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కానీ నిందితురాలు ఆ పని చేయలేదు. బదులుగా, దీపక్‌ను అభ్యంతరకరంగా చిత్రీకరిస్తూ తీసిన వీడియోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసింది. ఈ అవమానం భరించలేకే దీపక్ సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.
రిమాండులో షిమ్జిత
దీపక్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత నెజిజన్లు షిమ్జితాపై విరుచుకుపడటం మొదలు పెట్టడంతో ఆ వీడియోలును ఆమె డిలీట్ చేసింది. ఆమె ఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. డిలీట్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. నిందితురాలికి బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నందున రిమాండ్‌లోనే ఉంచాలని కోరారు. ఇదిలా ఉంటే బుధవారం షిమ్జితా ముస్తఫా పోలీసులకు ఈమెయిల్ ద్వారా ఓ కంప్లయింట్ చేసింది. పయ్యన్నూర్ రైల్వే స్టేషన్ నుండి టౌన్‌కు వెళ్లే బస్సులో ఒక వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని, అందుకు సంబంధించిన వీడియో తన దగ్గర ఉందని షిమ్జితా చెబుతోంది.