కేరళ అరీకోడ్ టౌన్లో ముస్తాఫా అంటే తెలియనివారు తక్కువగానే ఉంటారు. బాబుగా సుపరిరిచితుడైన ముస్తాఫా మొన్నటి వరకు తన సెలూన్‌ను నడుపుకుంటూ హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉండేవారు. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన అతని భార్య షిమ్జితా చుట్టూ ముసురుకున్న వివాదం ముస్తాఫా జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఇప్పుడు ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నాడు.
బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ షిమ్జితా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కారణంగా దీపక్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనలో షిమ్జితాను పోలీసులు అరెస్ట్ చేసి మంజేరి సబ్‌జైలులో పెట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా, ముస్తఫా మాత్రం ఓ రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నాడు. షిమ్జితా చేసిన తప్పుకు ముస్తఫాను బాధ్యుడిని చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ దాడి ఆయనను కుంగదీస్తోంది. దుబాయ్‌లో చాన్నాళ్లపాటు ఉద్యోగం చేసిన ముస్తఫా కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చేశాడు. అరీకోడ్‌లో ఓ సెలూన్ ప్రారంభించాడు. ఇప్పుడా షాపు తెరిచే ఉన్నా.. ముస్తఫా లేని లోటు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముస్తఫా చాలా అమాయకుడని, ఎవరితోనూ గొడవపడే వ్యక్తి కాదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. భార్య చేసిన తప్పుకు అతడిని వేధించడం మంచిది కాదని అంటున్నారు. నిజానికి ముస్తఫా, షిమ్జితాకు మధ్య సంబంధాలు బాగోలేవు. కొన్ని నెలలుగా వారు విడివిడిగానే ఉంటున్నారు. ఆమె వ్యవహారశైలిని ముస్తఫా వ్యతిరేకించినా, ఓ వ్యక్తిగా ఆమె స్వేచ్ఛను ఎప్పుడూ గౌరవించాడు.
గతంలో ఆమె పంచాయతీ సభ్యురాలిగా ఉన్నప్పుడు వచ్చిన వివాదాలను కూడా ఆయన తన భుజాన వేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కొందరు వ్లాగర్లు, యూట్యూబర్లు వ్యూస్ కోసం అతడి ఇంటి చుట్టూ తిరుగుతూ ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. స్థానిక నేతలు, స్నేహితులు అతడికి అండగా నిలుస్తున్నప్పటికీ, సోషల్ మీడియా చేస్తున్న దాడి ముస్తఫాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆవేదన ముస్తఫా కళ్లలో కనిపిస్తోంది.