Election Analysis: కేరళ రాజకీయాలు బహు చిత్రంగా ఉంటాయి. ప్రతీ అయిదేళ్లకోమారు ప్రభుత్వం మారుతూ వస్తున్నది. కొన్ని దశాబ్దాలుగా ఈ ఒరవడి కొనసాగుతోంది. ఎల్డిఎఫ్ -యూడీఎఫ్ మధ్య అధికారం మారుతుండటం మనం చూశాం! దీన్ని బ్రేక్ చేస్తూ గత ఎన్నికల్లో కూడా ఎల్డీఎఫ్ విజయం సాధించింది. అయితే అయిదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతుండటం ఓ విధంగా మంచిదే. ఈ రివాల్వింగ్ డోర్ పద్దతి ఓ ప్రజాస్వామ్య దిద్దుబాటు చర్యలా పని చేసేది. రాజకీయ పార్టీలలో జవాబుదారీతనాన్ని పెంచేది. ప్రజలను తక్కువ అంచనా వేయకుండా అడ్డుకునేది. 1977 అత్యవసర పరిస్థితి అనంతర పరిణామాలు, 2021 నాటి కోవిడ్ మహమ్మారి వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రోటేషన్ పద్దతికి బ్రేక్ పడింది. ఆ అసాధారణ పరిణామాలే మొదట యు.డి.ఎఫ్, ఆ తర్వాత ఎల్.డి.ఎఫ్ వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సహయపడ్డాయి.
ప్రస్తుతం కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మూడు ప్రధాన పక్షాలకు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరాటం. ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ కొట్టడానికి సమాయత్తమవుతోంది. అదే సమయంలో ఇది యూడీఎఫ్‌కు మనుగడ సమస్య. వరుసగా మూడోసారి పరాజయం పాలైతే మాత్రం అర్ధ శతాబ్ద కాలపు ఆ కూటమి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ చిన్నపాటి ఆశతో ఉంది. తిరువనంతపురం కార్పొరేషన్లో సాధించిన విజయం బీజేపీకి కొంత బూస్ట్ ఇచ్చినప్పటికీ అతిగా ఆశపడుతున్నదేమోనని అనిపిస్తోంది.
ఈ ఎన్నికల్లో అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే.. ఏ పక్షానికీ అనుకూలంగా స్పష్టమైన వేవ్ కనిపించకపోవడం. పదేళ్ల సుదీర్ఘ పాలన తర్వాత సహజంగానే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండాలి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో, గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది కూడా! స్వయంగా వామపక్ష మద్దతుదారులు, మేధావులు కూడా ఈసారి ఎల్డీఎఫ్ ఓడిపోతే బాగుండని అనుకుంటున్నారు. ఎల్డీఎఫ్ తన ఉనికిని కాపాడుకోవాలంటే విపక్షంలో ఉండటమే మంచిదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటం వల్ల పార్టీలో పేరుకుపోయిన అవినీతిని, అహంకారాన్ని వదిలించుకోవాలంటే ప్రతిపక్షంలో కూర్చోవడమే మేలని వారి వాదన. ఇందుకు పశ్చిమ బెంగాల్‌ను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. ఎన్నికలకు జస్ట్ వారం రోజులే ఉంది. ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. అయినప్పటికీ ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకతగానీ, అనుకూలతగానీ బయటపడటం లేదు. దాదాపు అన్ని సర్వేలు యూడీఎఫ్ స్వల్ప ఆధిక్యంలో ఉందని చెబుతున్నాయే తప్ప, క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని చెప్పడం లేదు. ముస్లిం, క్రైస్తవ ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో తప్ప, మిగిలిన చోట్ల ఎల్డీఎఫ్ గట్టి పోటీనిస్తోంది. కొన్ని సర్వేలు అయితే హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అంటున్నాయి.
పదేళ్ల పాలన తర్వాత, మీడియా, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, వామపక్షాల ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం. గత ప్రకృతి వైపరీత్యాలు, కేంద్రం నుండి ఎదురైన ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఎల్డీఎఫ్ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ ప్రచారానికి కేంద్ర బిందువు ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఆయనను కొందరు నిరంకుశుడని విమర్శించినా, సమర్థవంతమైన పాలకుడు అనే ఇమేజ్ ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. బలమైన నాయకత్వాన్ని కోరుకునే ధోరణి విజయన్‌కు కలిసి వస్తోంది. దీనికి భిన్నంగా, యుడీఎఫ్ లో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. కె. కరుణాకరన్, ఎ.కె. ఆంటోనీ, ఊమెన్ చాందీ వంటి ఉద్దండుల కాలం ముగిసింది. ప్రస్తుత నాయకులైన కె.సి. వేణుగోపాల్, రమేష్ చెన్నితాల, వి.డి. సతీశన్ వంటి వారు ఆ స్థాయికి చేరుకోలేకపోయారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కాంగ్రెస్‌లో సాగుతున్న అంతర్గత పోరు ఓటర్లలో అయోమయాన్ని సృష్టిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం మైనారిటీ ఓటర్లను ఆకర్షించినప్పటికీ, ముస్లిం లీగ్ ప్రాబల్యం పెరగడంపై క్రైస్తవ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది.
మారుతున్న సమీకరణాలు – ఎన్డీఏ పాత్ర!
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ క్రమంగా తన ఓటు శాతాన్ని పెంచుకుంటోంది. ఇప్పటి వరకు కేరళలో ద్విముఖ పోటీలే జరిగేవి. ఎన్డీఏ దాన్ని త్రిముఖ పోటీగా మార్చేసింది. శబరిమల వివాదం, మైనారిటీ బుజ్జగింపు వంటి అంశాలపై హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎల్డీఎఫ్ పడుతున్న ఆరాటం, మైనారిటీలను దూరం చేస్తోంది. మరోవైపు క్రైస్తవ సంస్థలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఎఫ్సిఆర్ఏ (FCRA) బిల్లు ఎన్డీఏకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.
ఈ ఎన్నికలు కేరళలో సిద్ధాంతాల కాలం ముగిసిందని చెబుతున్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ లేదా కాంగ్రెస్ నాయకులు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతల వారసులు పద్మజ వేణుగోపాల్, అనిల్ ఆంటోనీలతో పాటు కొందరు వామపక్ష మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడం చూస్తుంటే రాజకీయం ఎంతగా దిగజారాయో అర్థమవుతోంది. ఓటరు మాత్రం గుంభనంగా ఉన్నాడు. ఎవరికి ఓటు వేయాలన్నదానిపై ఓటరుకు స్పష్టత ఉంది.