Portrait of a Royal Bengal Tiger alert and Staring at the Camera. National Animal of Bangladesh
దడుసుకుంటున్న ప్రజలు, హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు
హైదరాబాద్‌కు చాలా దగ్గరలో పులి తిరుగుతుండటం భయం పుట్టిస్తోంది. మహానగరానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి అడుగు జాడలు కనిపించాయి. అటవీశాఖ అధికారులు ఉలిక్కిపడితే, గ్రామస్తులు భయంభయంగా గడుపుతున్నారు. గత 50 ఏళ్లలో ఓ పులి హైదరాబాద్‌కు ఇంత దగ్గరగా రావడం ఇదే మొదలు. ప్రస్తుతం ఇబ్రహీంపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సంచరిస్తున్నది. పులి అడుగుజాడలు పసికట్టిన అధికారులు అక్కడ కెమెరా, ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు వాటికి పులి ఇంకా చిక్కలేదు.
తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ దగ్గర శనివారం ఓ నాలుగు నెల దూడను చంపేసింది పులి. మరో దూడను గాయపరిచింది. అలాగే 18 రోజుల ఇంకో దూడను అడవిలోకి లాక్కెళ్లింది. మహారాష్ట్రలోని తాడోబా అంధారి టైగర్ రిజర్వ్ నుంచి పులి దారి తప్పి వచ్చి ఉండవచ్చని బీట్ ఆఫీసర్ కె.నర్మద అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం తనకు అనుకూలంగా ఉందో లేదో పులి పరిశీలిస్తోందని, అయితే, ఆ పులి ఇక్కడ స్థిరపడే అవకాశం తక్కువన్నది అధికారులు భావన. ఈ అడవిలో పులికి సరిపడా ఆహారం లేదు కాబట్టి, త్వరలోనే సురక్షితమైన వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే అవకాశం ఉందని నర్మద చెబుతున్నారు. పులి ఒక్కసారి వేటాడి తిన్న తర్వాత కనీసం అయిదారు రోజుల వరకు మళ్లీ వేటాడదు. కాబట్టి ప్రస్తుతానికి పులి గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం తక్కువ.
పులి జీవించడానికి కనీసం అయిదు వేల హెక్టార్ల విస్తీర్ణం కావాలి. కానీ ఇబ్రహీంపూర్ అడవి చాలా చిన్నది. ఈ పులి గత కొన్ని వారాలుగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్ధిపేట, కరీంనగర్, పెద్దపల్లి మరియు నర్సాపూర్ మీదుగా ప్రయాణించి ఇక్కడికి చేరుకుంది. పులి తనకంటూ ఓ టెరటరీ కోసమో, జత కోసమో వెతుకుతూ ఇంత దూరం వచ్చి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారుల అభిప్రాయం. ఈ పులి రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తోంది. పైగా జనావాసాలకు దూరంగా ఉంటోంది. ఇప్పటి వరకు మనుషులపై దాడి చేయలేదు. కాబట్టి ఇది మ్యాన్ఈటర్ కాదు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండటం మంచిదని అధికారులు అంటున్నారు. పులి తిరుగుతున్నది కాబట్టి ఇబ్రహీంపూర్ పరిసర గ్రామాల్లో జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అడవి ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు.