బంగారం ధరలు ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగులు పెడతున్నాయి. తులం బంగారం లక్షా 61 వేలకు చేరుకుంది. పసిడి రేటు ఇంతలా పెరుగుతుందని ఎవరూ అనుకోలేదు. అన్నట్టు ఎప్పుడూ లేనిది గోల్డ్ రేటు ఇంతగా పెరిగిపోవడానికి కారణమేమిటన్న డౌటు వచ్చే ఉంటుంది. అందుకు కారణం అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంపే!
నిజమే. ఆయన వల్లే బంగారం ధరలు కొండెక్కాయి. రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేసి సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో బంగారం ధర ఏకంగా 70 శాతం పెరిగింది. వెండి రేటు అయితే చెప్పనే అక్కర్లేదు. ఒక్కసారిగా 207 శాతం పెరిగింది. సపోజ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేసిన రోజున బంగారంలోనో, వెండిలోనో ఓ 50 లక్షలు పెట్టుబడి పెట్టామనుకోండి..ఇప్పుడు అది ఎంత అయి ఉండేదో ఊహించుకోండి. కోట్లాది రూపాయలు వచ్చి పడేవి.
బంగారం రేటు పెరుగుతుందంటే ట్రంప్ తీసుకుంటున్న చర్యలే కారణం. సుంకాలను అలా పెంచారో లేదో గోల్డ్ రేటు పరుగులుపెట్టడం మొదలయ్యింది. ఇరాన్‌పై యుద్ధం అనగానే బంగారం రేటుకు రెక్కలొచ్చేశాయి. ట్రంప్ సుంకాల గురించి మాట్లాడిన ప్రతిసారి బంగారం ధర పెరిగింది. వెనుజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అమెరికాకు పట్టుకు రావడం, గ్రీన్‌ల్యాండ్‌ను లాగేసుకుంటానని బెదిరిండచం వంటి చర్యలు కూడా బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి.
ట్రంప్ ఏం మాట్లాడతాడోనని మార్కెట్లు గజగజలాడుతున్నాయి. కాబట్టి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బంగారం, వెండి ధరలు ఇలాగే పెరుగుతుంటాయి. రేపో మాపో తులం మేలిమి బంగారం లక్షా 75 వేల రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే వెండి ధర కిలో మూడున్నర లక్షల రూపాయలు కావొచ్చు.