మనుషులకు భవిష్యత్ లో చేయడానికి ఏ పనీ ఉండదు. పని అనేది ఒక ఆప్షన్ గా మాత్రమే ఉంటుందని ఈ మధ్యే ఒక పాడ్ కాస్ట్ లో చెప్పాడు ఎలన్ మస్క్. ఆయన ఆ భవిష్య వాణికి కారణం ఏఐ. ఆర్కిటెక్చర్ నుంచి వైద్యంలోని ఆపరేషన్స్ దాకా అన్నిటినీ ఏఐ నడిపిస్తున్న క్రమంలో ఎలన్ మస్క్ అలా చెప్పడంలో ఆవ గించంతైనా ఆశ్చర్యం లేదు. అయితే ఎలన్ మస్క్ మాటలు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సంటే నిజమేమీ కాదు. అన్ని పనులను ఏఐ ప్రోగ్రామింగ్ చేయలేదు. రోబోస్ పెర్ఫార్మ్ చేయలేవు. అలాంటి మానవ నైపుణ్యానికి ఊహించని డిమాండ్ పెరిగే చాన్స్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సంట్ ఉంది.
అవేంటంటే..
కార్ రిపేర్ అయినా.. ఎలక్ట్రానిక్ గూడ్స్ రిపేర్ అయినా.. కుళాయిలు చెడిపోయినా.. సింక్ లీక్ అవుతున్నా.. తలుపు చెక్కలు చేయాలన్నా… ఫ్రేమ్ బిగించాలన్నా ఏఐ బిక్క మొహం వేస్తుంది. వీటిని మనుషులే చేయాలి. ఎందుకంటే అది మానవ మేధస్సును నకలు చేయగలదు కానీ మనిషి మజిల్ ను కాపీ కొట్టలేదు. మెదడు, కండరాల సమన్వయంతో జరగాల్సిన పనులను అది చేయలేదు. అందుకే భవిష్యత్ లో మెకానిక్స్, ప్లంబర్స్, కార్పెంటర్స్ లాంటి వాళ్లకు యమ గిరాకీ ఉంటుంది. చెప్పాలంటే ఐఐటీ చేసిన వాళ్లకు వర్క్ ఆప్షన్ అవుతుందేమో కానీ ఐటీఐ డిప్లమా వాళ్లకు మాత్రం చేతి నిండా పని. ఈ లెక్కన వడ్రంగి, దర్జీ లాంటి వృత్తి విద్యలకూ డిమాండ్ పెరగొచ్చు.