చలికాలం చంపుకుతింటోంది. వింటర్లో చలి ఉండటం కామనే కానీ, మరీ ఇంత చలి ఎప్పుడూ లేదు. అందుకే ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. వింటర్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. జలుబు వస్తే ఓ పట్టాన వదలదు. రోజువారి పనులు చేసుకోనివ్వదు. సరిగ్గా నిద్రపోనివ్వదు. వీటితో పాటు అలసట ఒకటి! జలుబు, దగ్గు రాగానే చాలా మంది మందులు వాడేస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. అలా మందులను వాడే బదులు కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి దగ్గు, జలుబు సమస్యల నుంచి దూరం కావచ్చు. దాదాపుగా అందరి ఇళ్లల్లోనూ అల్లం ఉంటుంది. అల్లానికి రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అల్లం తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. దగ్గుతో బాధపడే వారు అల్లాన్ని తీసుకోవడం మంచిది. అల్లం రసంలో కాసింత తేనె కలిపి తీసుకోవాలి. లేదా అల్లంతో టీ చేసుకుని తాగాలి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటి మైక్రోబియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తేనె తీసుకోవడం వల్ల దగ్గు దూరమవుతుంది. దగ్గుతో బాధపడుతున్నవారు తేనెలో కొన్ని చుక్కల అల్లం రసాన్ని కలిసి తీసుకోవాలి. లేకపోతే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి. నిమ్మరసంలో విటమిన్ సీ ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు సిట్రస్ పండ్లను తీసుకోవద్దని అంటారు కానీ ఇది అపోహ మాత్రమే. దగ్గు, జలుబుకు పసుపు దివ్యౌషధం. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గిస్తుంది. వంటల్లో ఎలాగూ పసుపు వాడతారు. దీంతో పాటు గోరు వెచ్చని పాలల్లో పసుపును తీసుకోవాలి. . గోరు వెచ్చని ఉప్పు నీటిని గొంతులో పోసుకుని బాగా పుక్కిలించాలి. ఇలా చేస్తే శ్వాసకోశ ఇన్పెక్షన్ లు రావు. వేడి వేడి సూప్‌లు కూడా జలుబు తీవ్రతను తగ్గిస్తాయి. ఇంట్లోనే ఈజీగా సూపులు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఈజీ చిట్కాలను పాటించి జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి దూరం కావచ్చు.