పాముతో పరాచికాలాడకూడదు. కాటేస్తే కాటికే వెళ్లాల్సి వస్తుంది కాబట్టి పాముకు కాసింత దూరంగా ఉండటమే బెటర్! పామే కదా అని గేమ్స్ ఆడకూడదు. ఈ విషయం తెలియక ఓ వ్యక్తి నాగుపామును పట్టుకుని, అటూ ఇటూ తిప్పుతూ ఓవర్ చేశాడు. పాముకు కోపం వచ్చేసింది. మూడు సార్లు కాటేసింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లారు కానీ అప్పటికే టపీమన్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో జరిగింది. పొలం పనులు చేసుకుంటున్న 50 ఏళ్ల రాజ్సింగ్కు ఓ నాగుపాము కనిపించింది.
ఆరు అడుగులున్న ఆ పామును చూసి అతడేం భయపడలేదు. పైగా దాన్ని పట్టుకుని మెడలో వేసుకున్నాడు. పైగా తనలాంటి వీరుడిని ఎప్పుడైనా చూశారా అంటూ వచ్చిపోయే వారితో అంటూ హీరో లెవల్లో పోజులు కొట్టాడు. అది చూసి జనం భయపడి పారిపోయారు. పామును వదిలేయమని సలహా ఇచ్చారు. కాటేస్తే చస్తావంటూ బెదిరించారు. అయినా రాజ్‌సింగ్ పామును మాత్రం వదల్లేదు. దాన్ని ఇంకా ఇబ్బంది పెట్టాడు. దాంతో పాముకు సర్రుమని కాలింది. మూడుసార్లు కాటేసింది. దెబ్బకు అతడు ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే ప్రాణాలు పోయాయి. రాజ్‌సింగ్ పాముతో ఆటలాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసిన వారు తలోరకంగా కామెంట్ చేస్తున్నారు.