
హైదరాబాద్ : ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో,ప్రతి హృదయంలో ఉంచుకోవాల్సిన పుస్తకం భగవద్గీత అని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు.
‘దైనందిన జీవితానికి భగవద్గీత’ పేరుతో సచిత్ర వ్యాఖ్యలతో ప్రచురించిన పుస్తకాన్ని శ్రీ వెంకయ్య నాయుడు శుక్రవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భగవద్గీతకు, మతానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. జీవిత సత్యాలను, అర్ధాలను ఇది బోధిస్తుందని చెప్పారు. సకల మానవాళి శ్రేయస్సుకు, వారి మార్గదర్శనం కోసం శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి బోధించిన మహా గ్రంథమే భగవద్గీత అని చెప్పారు. భగవద్గీతను రాజకీయాలతో ముడి పెట్టడం అవివేకమని స్పష్టం చేశారు. సంస్కృత శ్లోకాలకు సంక్షిప్తంగాచక్కటి తెలుగు అనువాదం చేయడంతో పాటు వాటికి తగిన విధంగా చక్కటి బొమ్మలు వేయడంతో పుస్తకం మనసుకు హత్తుకుంటుందని వెంకయ్య నాయుడు చెప్పారు.
ఆకట్టుకునే విధంగా, అర్థవంతంగా బొమ్మలు వేసిన కె.వి.భీమారావుగారికి, శ్లోకాలకు తెలుగులో,ఆంగ్లంలో వివరణాత్మక వ్యాఖ్యలు అందించిన కల్లూరి సత్య రామ ప్రసాద్ అభినందనలు తెలిపారు. ఇటువంటి ఉపయుక్తమైన పుస్తకాలకు ప్రభుత్వాలు గుర్తించి, పాఠశాల పుస్తకాల్లో భాగంగా చేస్తే పిల్లలకు మంచి నడవడిక అలవడి మంచి సమాజం,మంచి దేశం,మంచి మానవాళి రూపు దిద్దుకుంటుందనీ వెంకయ్య నాయుడు చెప్పారు.