
Election commission need to wait to cunduct Mlc election : బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఇప్పట్లో భర్తీ చేసే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల కోటాలో విజయం సాధించిన కవిత పూర్వ నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దల సభకు ఎన్నికయ్యారు. తాజాగా ఆమె చేసిన రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. అయితే ఇప్పట్లో అక్కడి నుంచి కొత్తగా ఎవరైనా ఎంపిక అయ్యేందుకు అనేక సాంకేతిక కారణాలు అడ్డం అవుతున్నాయి.
తాజా ఖాళీని భర్తీ చేసేందుకు స్థానిక సంస్థల కోటాలో ఓటు వేసేందుకు సభ్యులు లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఎన్నికల కమిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కొంత కాలం వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. స్థానిక సంస్థల కోటాలో ఎంపిక చేసే ఎమ్మెల్సీ స్థానానికి 75 శాతం మంది ప్రతినిధులు ఓటు వేయాలి. లేదా ఆయా సంస్థల్లో కలిపి మూడొంతుల సభ్యులు ఉండాలి. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు.
ప్రస్తుతం స్థానిక సంస్థల గడువు ముగిసినందున అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో పరిపాలన కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ లోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 596 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, 215 మున్సిపల్ వార్డులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 911 స్థానిక సంస్థల సీట్లలో 75 శాతానికి గానూ 606 స్థానాలు భర్తీ అయితేనే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుంది. ఒకవేళ గ్రామీణ ప్రాంత సంస్థల ఎన్నికలు పూర్తయినప్పటికీ పట్టణ ప్రాంత సంస్థల ఎన్నికలు కూడా పూర్తయ్యే వరకు నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరు పోటీ పడాలనుకున్నా ఈ నిరీక్షణ మాత్రం తప్పేలా లేదు.