
Kalvakuntla Kavitha
Kavitha resigns to both party and Mlc posts: బీఆర్ఎస్ సస్పెండెడ్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారు. దానితోపాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పనున్నారు. బుధవారం ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ జాగృతి కార్యాలంలో కవిత రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమక్షంలో ప్రకటన చేయనున్నారు. తన రాజీనామా లేఖను ప్రదర్శించనున్నారు. బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు వీటిని పంపనున్నారు. అదే సమయంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తన సభ్యత్వ రాజీనామా లేఖ పంపుతారు.
కవిత మీడియా సమావేశంలో ఏం మాట్లాడబోతారోనన్న ఆసక్తి మొదలైంది. ఇప్పటికే హరీష్ రావు, సంతోష్ రావులతోపాటు జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసిన ఆమె బుధవారం ఎవరిపై తన బాణాలు ఎక్కుపెడతారోనని చర్చ జరుగుతోంది. తన అన్న కేటీఆర్‌ను సైతం ఆమె వదిలిపెట్టరని తెలుస్తోంది. తండ్రి వీళ్లందరి చేతిలో ఎట్లా ఇబ్బందులు పడ్డారోననే విషయం ఆమె ప్రకటించనున్నారు. తాను జైల్లో ఉన్న సందర్భంలో ఎవరు ఎలా ప్రవర్తించారోనన్న ఆవేదన వ్యక్తం చేయనున్నట్లు తెలిసింది. కాగా కొత్త పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్న కవిత ఆ నిర్ణయాన్ని కొద్ది రోజుల తర్వాత ప్రకటించనున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది.