
Telangana Jagruthu President Kalvakuntla Kavitha
Now the only discussion is about her future step : ఇపుడంతా ఇదే చర్చ.. కవిత కొత్త పార్టీ పెడతారా, ఇతర పార్టీల్లో చేరుతారా అన్నదే! అమెరికా నుంచి రాగానే హరీష్, సంతోష్‌లపై తీవ్రంగా విరుచుకు పడ్డ ఆమె మరుసటి రోజే పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇపుడు చర్చంతా ఆమె చుట్టే తిరుగుతోంది. బీఆర్ఎస్లోనే కాకుండా అన్ని పార్టీలు ఆమె తదుపరి నిర్ణయం ఏమై ఉంటుందా అని అంచనాలు వేస్తున్నారు. కవిత ఏదైనా జాతీయ పార్టీలో చేరే అవకాశం ఉందా అని ఆరా తీస్తున్నారు. ఆమె సన్నిహితులు మాత్రం కొత్త పార్టీ వైపే మొగ్గు చూపుతారని అంటున్నారు.
మారిన ఆలోచనలు
బీఆర్ఎస్లో చడీచప్పుడు లేకుండా ఉండీ తన ఉనికిని కాపాడుకుంటూ కవిత తనదైన శైలిలో రాజకీయ ప్రయాణం చేస్తూ వచ్చారు. పార్టీలో కొన్ని సార్లు పదవి దక్కకపోయినా బాధ పడని, బయట పడని కవిత ‘ఇంటి పోరు’ ద్వారానే తగిన ప్రాధాన్యత పొందుతూ వచ్చారు. కానీ బయట ఎలాంటి విమర్శలు చేయకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. కానీ లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కవిత వైఖరిలో చాలా మార్పు వచ్చిందని ఆమెను సన్నిహితంగా గమనిస్తూ వస్తున్నవాళ్లు చెబుతున్నారు. ఐదు నెలల పాటు తిహార్ జైలులో గడిపిన ఆమె తన అరెస్టు మొదలు, విడుదల, తర్వాతి పరిణామాల నేపథ్యంలో తీవ్రమైన నిర్ణయాలే తీసుకున్నట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న కాలంలో తండ్రి ఒత్తిడితో కుటుంబ సభ్యులు ఆమె విడుదలకు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ తాను ఆశించిన కాలం కన్నా ఎక్కువే జైలులో గడపాల్సి వచ్చిందనే వేదన ఆమెలో ఉన్నట్లు తెలుస్తోంది. అంత సుదీర్ఘ కాలం తాను జైల్లో ఉండాల్సింది కాదనీ, ఎక్కడో ఏదో జరిగినట్లు ఆమె మనసులో ఉండిపోయినట్లు సన్నిహితుల సమాచారం.
జైలు జీవితంతో మార్పులు
జైలులో ఉన్న కాలంలోనూ, బయటకు వచ్చిన తర్వాతా తనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసినట్లు, దాని వెనక తమ పార్టీ, నేతలే ఉన్నారనే విషయం అమెను మరింత సంఘర్షణకు లోను చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కొందరి వద్ద ఈ బాధ వ్యక్తం చేశారు. తర్వాత బహిరంగంగానే ఆమె ఆ విషయం బయటకు వ్యక్తం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన అరెస్టు వెనక రాజకీయం ఉందనీ, బీజేపీ తనపై కక్ష్య కట్టిందనీ చెబుతూ డ్యామేజీ అయిన ఇమేజీని తిరిగి నిలుపుకోవాలని భావించిన ఆమె ప్రయత్నాలకు పార్టీ నుంచి ఆమోదం లభించలేదు. కొంత కాలం మౌనంగా ఉండాలని పార్టీ ‘పెద్దల’ సూచన మేరకు కవిత సైలెంట్‌గా ఉన్నారు. తర్వాత బయటకు వచ్చిన ఆమె తనదైన శైలిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్‌పై పోరాటం మొదలు పెట్టారు. బీసీ ఎజెండాతో రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు.
రజతోత్సవాలతో మొదలు
ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల అనంతరం కవిత దూకుడు పెరిగింది. రజతోత్సవ వేడుకలపై తాను తన తండ్రికి రాసిన లేఖ మీడియాకు లీక్ అయ్యింది. సభ జరిగిన తీరుపై ఆ లేఖలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లోపాలను ఎత్తి చూపారు. అయితే లేఖను కవిత లీక్ చేశారని తొలుత ప్రచారం జరిగినా ఆమె తర్వాత దాన్ని ఖండించారు. పెద్ద కుమారుని గ్రాడ్యుయేషన్ సెరిమనీకి అమెరికా వెళ్లిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. అమెరికా నుంచి రాగానే తన లేఖ లీక్ విషయంలో తీవ్రంగా స్పందించారు. తన తండ్రి కేసీఆర్ పట్ల అభిమానం చాటుతూనే ఆయన చుట్టు కొన్ని దయ్యాలున్నాయనీ, వాళ్ల ద్వారానే లేఖ లీక్ అయ్యిందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఎవరు కుట్ర పన్నుతున్నారో తెలుసునని అన్నారు. తాను బీఆర్ఎస్ కార్యకర్తననీ, పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు.
వ్యూహాత్మకంగానే జాగృతి బలోపేతం
బీఆర్ఎస్లో ఉంటూనే కవిత తన సొంత సంస్థ జాగృతిని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి కవిత తలపెట్టిన కార్యక్రమాలకు బీఆర్ఎస్ నుంచి మద్దతు రాకపోగా, ఆమె కార్యక్రమాలకు వెళ్లవద్దని పార్టీ నేతల ఆదేశాలతో ఆమె ఈ పని చేయాల్సి వచ్చింది. తెలంగాణ జాగృతికి నూతన కమిటీలు ఏర్పాటు చేసి దాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు ఆరంభించారు. కవిత మొన్నటికి మొన్న చిన్న కొడుకు డిగ్రీ అడ్మీషన్ కోసం అమెరికా వెళ్లే ముందు కొన్ని కమిటీలు ప్రకటించారు. ప్రవాసీ కమిటీలను కూడా అమె అనౌన్స్ చేశారు. అమెరికా వెళ్లే కొద్ది రోజుల ముందు పార్టీ కీలక నేత జగదీష్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. కొందరు పార్టీని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. తర్వాత అమెరికా నుంచి రాగానే ఆమె హరీష్, సంతోష్‌లపై తారా స్థాయిలో విమర్శలకు తెగబడ్డారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలు సార్లు డిమాండ్లు వచ్చినా అధినేత కేసీఆర్ వారిస్తూ వచ్చారని సమాచారం. ఒకానొక సందర్భంలో కవిత సస్పెన్షన్ గురించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పట్టుబడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇవేవి కవితను పార్టీ నుంచి తప్పించేందుకు కారణం కాలేదు. కాగా సోమవారం నాటి కవిత వ్యాఖ్యలు మాత్రం ఆమెపై వేటు వేసేందుకు కారణం కావడం గమనార్హం.
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం
ఈ నేపథ్యంలో మరి కవిత పార్టీ పెడతారా అని చర్చ ఊపందుకుంది. తాను జైల్లో ఉండగానే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగిందనీ, దాన్ని తాను అడ్డుకున్నానని గతంలో చెప్పిన కవిత తనపై కేసు ఉన్నప్పటికీ ఆమె బీజేపీలోకి వెళ్లే ఆస్కారం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇక అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్పై పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌లోకి కూడా వెళ్లే అవకాశం లేదంటున్నారు. స్వతంత్రంగా రాజకీయాలు నడిపే నాయకురాలిగా ఉన్న కవిత తనకంటూ ప్రత్యేక ఉనికిని కోరుకుంటారు. కాంగ్రెస్‌లో ఆమెకు ప్రత్యేక స్థానం లభిస్తుందన్నది అనుమానమే. విజయశాంతి లాంటి నేతలే పార్టీలో అప్రాధాన్య పరిస్థితిలో ఉన్నారు. జాతీయ పార్టీలో స్థానిక నేతలు వ్యక్తిగత ఎజెండాలతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. తోచిన కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదు. దూకుడుగా ఉండే కవిత కాంగ్రెస్ ఆదేశించిన ప్రోగ్రామ్‌లలో మాత్రమే పాల్గొంటూ మౌనంగా ఉంటారని భావించలేం. బయట నుంచి వచ్చిన నేతల్ని అంత తొందరగా ఇముడ్చుకునే తత్వం కూడా కాంగ్రెస్ నేతల్లో ఉండదు. అందుకే కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేదని సన్నిహితులు చెబుతున్నారు. కొత్త పార్టీ దిశగానే ఆమె మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జాగృతిని అందుకు అనుగుణంగా సిద్ధం చేసి పెట్టుకున్నారనీ, తదుపరి అడుగులు వేయడమే ఆలస్యం అంటున్నారు. బీఆర్ఎస్లోకి కొందరు నేతలు కవిత వెంట నడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీళ్లలో కొందరిని పిలిచి కేటీఆర్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత పార్టీ పెడితే మాత్రం వీళ్లతో పాటు మరికొంత మంది ఆమెతో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నింటికన్నా ముఖ్య విషయం కవితను పార్టీ పెట్టమని సొంత పార్టీ నేతలతోపాటు బయట పార్టీల నేతలు కూడా కొందరు ప్రోత్సహిస్తున్నారనీ, వాళ్ల ‘సహాయ సహకారాల’తోనే కవిత రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యయానికి తెర లేపుతారని ప్రస్తుతమున్న సమచారం.
