
Mlc kavitha Hot Comments On Harish Rao: అమెరికా నుంచి తిరిగి వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి బాంబు పేల్చారు. తనపై తన బంధువులు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులు కుట్ర పన్నారని అన్నారు. తన తండ్రి మంచి వారనీ, ఆయన చుట్టు కొన్ని దయ్యాలు చేరాయనీ, వాళ్ల వల్లనే పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తింటోందని అన్న కవిత ఈ సారి ఏకంగా వారి పేర్లు చెప్పారు. సోమవారం జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్కు అవినీతి మరక ఎట్లా వచ్చిందో బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ల వల్లనే అవినీతి మరక అంటిందని హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణలు చేశారు. ‘‘కేసీఆర్కు అవినీతి మరక అంటించడంతో హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి పాత్ర ఉంద’’న్నారు. ఈ అవినీతి అనకొండలు కేసీఆర్ను బద్నా చేస్తున్నారని కవిత ఆరోపించారు. కేసీఆర్ లాంటి మహా నేతపై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చిందనీ, ఇలాంటి స్థితి తెచ్చిన నేతలు పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని తీవ్ర స్థాయిలో స్పందించారు. వీళ్ల వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉండి కథ నడిపిస్తున్నారన్నారు. తాను నేరుగా పేర్లు చెప్పిన వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘నా వెనుక బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నాది కేసీఆర్ బ్లడ్. నేను ఇండిపెండెంట్గా ఉంటాను.
ALSO READ:
ఎవరికీ లొంగేది లేదు. నాపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తాన’’ని హెచ్చరించారు. కాళేశ్వరం లాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న పార్ట్ అనీ, కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడం కోసం ఆరు,ఏడు నెలలు రీసెర్చ్ చేశారని చెప్పారు. ‘‘కేసీఆర్కు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఉండదు. తెలంగాణ కోసం అట్లా పని చేశారాయన. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ళు ప్రజలు గుర్తు ఉంచుకుంటారని కవిత అన్నారు. ఆయనపై అనవసరంగా అబాంఢాలు వేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోందనీ, రేవంత్ రెడ్డికి కేసీఆర్ పెరు చెప్పకపోతే పేపర్ లో ఫోటో రాదన్నారు. వరదలు వస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. తాము ఎంపీలుగా ఉన్నప్పుడు ఆరు నెలల ముందు యూరియా కోసం కేసీఆర్ తమని అలెర్ట్ చేసేవారని గుర్తు చేశారు.