ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారని, ఒకరు జుట్టున్నవారు , రెండు తెలివైనవారని బట్టతల ఉన్నవారు చెప్పుకుని సంతృప్తిపడుతుంటారు. బట్టతల పెద్ద సమస్య కాదు కానీ కొందరు ఓ రకమైన కాంప్లెక్స్‌తో బాధపడుతుంటారు. తలపై జుట్టు మొలిపించుకోవడానికి అన్న రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బున్నవారు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటారు. లేనివారు రకరకాల నూనెలు, మందులు వాడుతుంటారు. బట్టతల మీద జట్టు మొలవడం అసాధ్యమన్న సత్యాన్ని కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటారు. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇకపై బట్టతల ఉన్నవారు అంతగా దిగులుపడాల్సిన పని లేదు. వారికి సైంటిస్టులు ఓ స్వీట్ న్యూస్ చెప్పారు. జస్ట్ కొన్ని వారాల్లోనే తలపై సహజ సిద్దంగా జట్టు మొలిపించే సామర్థ్యం ఉన్న సరికొత్త ప్లాంట్ బేస్డ్ సీరమ్‌ను సైంటిస్టులు కనిపెట్టారు. తైవాన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఈ ఎక్స్పర్మెంట్ బట్టతల కొత్త వెంట్రుకలు, సారీ కొత్త ఆశలు చిగురింపచేస్తున్నాయి. రసాయనిక మందుల కంటే సహజ సిద్ధమైన కొవ్వు ఆమ్లాలతో మంచి ఫలితాలు వచ్చినట్టు వైద్య నిపుణులు ఒత్తైన జట్టు మీద ఒట్టేసి మరీ చెబుతున్నారు. ఎప్పటిలాగే ముందు ఎలుకలపై చేసిన ప్రయోగంలో కేవలం 20 రోజుల్లోనే దట్టమైన జట్టు పెరగడం గమనించారు. ఇప్పుడు అందరూ వాడుతున్న మినాక్సిడిల్ వంటి మందులతో పోలిస్తే ఈ ప్లాంట్ సీరమ్ వల్ల ఎలాంటి స్కిన్ ఇరిటేషన్ గానీ, హార్మోన్ల మార్పులు జరగలేదని రుజువయ్యింది. ఈ సీరమ్ జుట్టు మూలాల్లోని స్టెమ్ సెల్స్‌ను వేగంగా మార్చడం ద్వారా సహజ పద్దతిలో జట్టు పెరిగేలా చేస్తుందట! మనుషులపై పూర్తి స్థాయి క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తర్వాత ఇది మార్కెట్లలోకి అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంచేత బట్టతల ఉన్నవారు చింత చెందాల్సిన పనిలేదు. కొన్నాళ్ల తర్వాత ఎంచక్కా జేబులో దువ్వెన పెట్టుకుని తిరగొచ్చు.