శబరిమల ఆలయం తలుపులు మంగళవారం ఉదయం మూతబడ్డాయి. మండల మకరవిళక్కు ఉత్సవాలు ముగియడంతో ఆలయాన్ని మూసేశారు. ఉదయం పందళం రాజకుటుంబ ప్రతినిధి తిరునాళ్ నారాయణ వర్మ అయ్యప్పస్వామిని దర్శనం చేసుకున్నారు. తర్వాతం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు.
అయ్యప్ప స్వామికి అలంకరించే పవిత్ర ఆభరణాలను ఊరేగింపుగా పందళం శ్రాంపికల్ రాజభవంతికి తీసుకెళుతున్నారు. పెరియ స్వామి మరుతువన్ శివన్కుట్టి సారథ్యంలో ౩౦ మంది సభ్యుల బృందం తిరువాభరణాలను తీసుకెళుతోంది. 23 నాటికి ఈ బృందం ప్యాలెస్‌కు చేరుకుంటుంది. ఆలయాన్ని ఉదయం అయిదు గంటలకే తెరిచారు. తూర్పు మండపంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ఈ.డి. ప్రసాద్ నంబూద్రి అయ్యప్ప స్వామి మూర్తికి విభూతి అభిషేకం నిర్వహించారు. రుద్రాక్ష మాలలు, యోగ దండాన్ని అలంకరించారు. తర్వాత హరివరాసనం పాటతో స్వామిని నిద్రపుచ్చి గర్భాలయాన్ని మూసివేశారు. ఆలయ తాళం చెవులను పందళం రాజప్రతినిధికి అందజేశారు.