వెంటాడిన దురదృష్టం.. అడ్డంగా దొరికిన అన్నదమ్ములు
ఇద్దరు అన్నదమ్ములు ఓ దుర్ముహూర్తాన ఓ జ్యువెలరీ షాపులో దొంగతనానికి వెళ్లారు. షాపులో ఒంటరిగా ఉన్న మహిళా ఓనర్‌పై పెప్పర్ స్ప్రే చల్లారు. చేతికందిన గొలుసులను తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ బ్యాడ్‌లక్ బంకలా తమను అంటుకుందని వారికి తెలియదు. స్ట్రయిట్‌గా వీవీఐపీ పర్యటన బందోబస్తులో ఉన్న పోలీసులకే దొరికారు. వారి దురదృష్టం ఎలా తగలడిందంటే దొంగిలించిన ఆ బంగారు గొలుసులు రోల్డ్ గోల్డ్‌వి కావడం! కేరళలోని మలప్పురం నిలంబూరుకు చెందిన అన్నదమ్ములు థామస్, మాధ్యు చోరీకి ప్లాన్ చేశారు. ఇందుకోసం ఎడపల్లి-పూక్కాట్టుపడి రోడ్డులో ఉన్న జారా గోల్డ్ అండ్ డైమండ్స్ షాపును ఎంచుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు షాపు ఓనర్ సంతోష్ జాన్ లంచ్‌కు వెళ్లాడు. ఇదే తగిన సమయం అనుకుని హెల్మెట్, మాస్క్ పెట్టుకుని షాపులో చొరబడ్డారు అన్నదమ్ములు. అప్పుడు సంతోష్ జాన్ భార్య బిందుమోల్ మాత్రమే షాపులో ఉంది. కుర్చీలో కూర్చున్న ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లారు. గొలుసులు లాక్కొని పారిపోయారు. థామస్ రెండు గొలుసులతో బయటకు వచ్చి స్కూటర్‌పై రెడీగా ఉన్న మాధ్యుతో కలిసి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ ఆ స్కూటర్ నేరుగా మరో వాహనానికి డాష్ ఇచ్చింది. దాంతో ఇద్దరూ కిందపడ్డారు. అప్పటికే బిందుమోల్ కేకలు విన్న ఓ వ్యక్తి దొంగలను ఆపే ప్రయత్నం చేశాడు. వారు అతడిపై కూడా పెప్పర్ స్ప్రే కొట్టి వేరు వేరు దిశల్లో పరుగులు తీశారు. మాథ్యూ ఓవైపు పారిపోతే, థామస్ మళ్లీ స్కూటర్ ఎక్కి ఎడపల్లి మెయిన్ రోడ్డు వైపు వెళ్లాడు. అయితే అక్కడ థామస్ మరో ప్రమాదానికి గురై మళ్లీ కింద పడ్డాడు. ఈసారి స్కూటర్‌ను అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ నేరుగా నేషనల్ హైవే పైకి వెళ్లాడు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో అక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అప్పటికే స్థానికులు థామస్ వెంటపడసాగారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నేరుగా పోలీసులకే చిక్కాడు. తర్వాత మాథ్యూను కూడా పట్టుకున్నారు. విచారణలో అన్నదమ్ములకు మరో షాకింగ్ విషయం తెలిసింది. ప్రాణాలకు తెగించి దొంగిలించిన ఆ గొలుసులు బంగారానికి కావు. కస్టమర్లకు డిజైన్లు చూపించడానికి వాడే రోల్డ్ గోల్డ్ డిస్ప్లె మోడల్స్ అవి. వాటి ధర జస్ట్ 15 వేలు మాత్రమే. అన్నట్టు దొంగలు వాడిన స్కూటర్ కూడా కాక్కనాడ్ నుంచి దొంగిలించినదే!