
సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ చిన్ని వీడియో ఓ యువకుడి ఉసురు తీసుకున్న సంగతి తెలిసిందే కదా! కేరళ మలప్పురానికి చెందిన 35 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ షింజియా ముస్తాఫా పోస్టు చేసిన వీడియో కారణంగా 41 ఏళ్ల దీపక్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడన్నది షింజియా ఆ వీడియోలో చేసిన అభియోగం. ఈ ఘటన తర్వాత ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. తనకు తాను ఎక్స్‌ప్లోరర్, కన్సల్టెంట్ సైకాలజిస్ట్ అని చెప్పుకునే షింజియా, దీపక్ మరణం తర్వాత వస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి సైకాలజీ సూత్రాలను వాడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది మరింత వ్యతిరేకతకు దారి తీసింది. అసలేం జరిగిందంటే, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు దీపక్ తనను ఉద్దేశపూర్వకంగా తాకాడని చెబుతూ షింజియా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే, ఆ వీడియో కారణంగా ఎదురైన అవమానాన్ని తట్టుకోలేక దీపక్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో షింజియాపై నెటిజన్లు విరుచుకుపడటం మొదలుపెట్టారు. వివాదం ముదరడంతో షింజియా ఆ వీడియోను తొలగించింది. వివరణ ఇచ్చుకుంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది.
వెలెరి గ్రామానికి చెందిన షింజియాది ఆసక్తికరమైన కథే! ఓ సాధారణ గృహిణి నుంచి ప్రజా ప్రతినిధి అయ్యింది. ఆపై సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ఎదిగింది. కోజికోడ్ జిల్లా వటకర ప్రాంతానికి చెందిన షింజియాకు 16 ఏళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి తర్వాత భర్త ఇచ్చిన తోడ్పాడుతో డిగ్రీ, పీజీ, బీఈడీ చదివింది. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించింది. మూడేళ్ల పాటు పంచాయతీ సభ్యురాలిగా చురుకుగా వ్యవహరించిన షింజియా తర్వాత దుబాయ్‌లో ఉంటున్న తన భర్త దగ్గరకు వెళ్లింది. అక్కడ ఉద్యోగంలో కూడా చేరింది. పంచాయతీ సభ్యురాలి పదవికి రాజీనామా చేయాలని పార్టీ కోరినప్పటికీ టెక్నికల్ రీజన్స్ కారణంగా అది కుదరలేదు. దుబాయ్‌కు వెళ్లిన తర్వాత ఆమె లైఫ్ స్టయిల్ పూర్తిగా మారింది. హిజాబ్ లేకుండా, బొట్టు పెట్టుకుని వీడియోలు చేయడంపై పార్టీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. ఆరు నెలల కిందట ఇండియాకు వచ్చిన ఆమె వటకరలో ఉంటోంది. సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయసాగింది. దీపక్ సూసైడ్ తర్వాత షింజియాపై వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందన్న విషయం పోలీసులకు మాత్రమే తెలుసు.