పొద్దస్తమానం కష్టపడి ఉద్యోగాలు గట్రాలు చేయడం కంటే అడుక్కోవడం బెటర్! అదేంటీ పుసుక్కున అంతమాట అనేశారని అనుకుంటున్నారా? మంగీలాల్ స్టోరీ తెలిస్తే మీక్కూడా ఇలాగే అనిపిస్తుంది. ఏమిటాయన కథ అంటారా? మధ్యప్రదేశ్‌లో ఇండోర్ ఉంది కదా! మొన్నామధ్య గవర్నమెంట్ బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్ నిర్వహించింది. రోడ్లపై బిక్షాటన చేసే వారి జీవితాలు మార్చడం దీని ఉద్దేశం. అంటే భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడమన్నమాట! ఈ క్యాంపెయిన్‌లో అక్కడ అడుక్కుంటున్న మంగీలాల్ అనే వ్యక్తి గురించి కంప్లయింట్లు వచ్చాయి. దాంతో మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మంగీలాల్‌కు పునరావాసం కల్పించేందుకు ప్రయత్నించారు.
అప్పుడు వారికి బిత్తరపోయే విషయాలు తెలిశాయి. మంగీలాల్ ఆస్తిపాస్తులు చూసి అధికారులు అవాక్కయ్యారు. మూడు ఇళ్లు, కార్లు, ఆటోలు, లక్షలాది రూపాయలు.. ఇవన్నీ మంగీలాల్ సంపాదన! ఇదంతా కేవలం భిక్షాటన ద్వారానే సంపాదించాడు. అన్నట్టు అతడికి ఉన్న స్విఫ్ట్ డిజైర్ కారు కోసం ఓ డ్రైవర్‌ను కూడా పెట్టుకున్నాడు. భిక్షాటనకు కారులోనే వెళ్లేవాడు. ఇంటికి కారులోనే వచ్చేవాడు. ఖాళీ టైమ్‌లో కారును అద్దెకు తిప్పేవాడు. మరో విషయమేమిటంటే రాష్ట్ర ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఓ పథకం కింద మంగీలాల్‌కు ఓ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చింది. అయినా అతడు మాత్రం భిక్షాటన మానలేదు. దీంతో పాటు సరాఫా బజార్లో చిన్న చిన్న వ్యాపారులకు ఫైనాన్స్ ఇచ్చేవాడు. అలా రోజుకు అయిదు వందల వరకు సంపాదించేవాడు.