
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు డాక్టర్ రూత్ జాన్ పాల్. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో తొలి ట్రాన్స్ జండర్ వైద్యురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. తర్వాత ట్రాన్స్ జండర్ కేటగిరిలో పిజికి దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఆమె అప్లై చేసిన సమయంలో తెలంగాణాలో ట్రాన్స్ జండర్లకు రిజర్వేషన్ లేకపోవడంతో ఆమె సీటు సంక్షోభంలో పడింది. 2023, జూన్ లో తెలంగాణా హైకోర్టు కలగజేసుకుని ఇంటీరిమ్ ఆర్డర్ ను జారీచేసింది. ట్రాన్స్ జండర్ కేటగిరిలో రూత్ ను దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అనుమతించింది. అలా ఇఎస్ ఐ లో పిజీ కోర్సు ప్రవేశం పొంది ఎందరో ట్రాన్స్ జండర్లకు స్ఫూర్తిగా నిలిచారు. తన ఈ సక్సెస్ పై స్పందిస్తూ గైనకాలజిస్టు కావాలనేది తన కల అని డాక్టర్ రూత్ అన్నారు.
‘నేను డాక్టర్ అయింది కూడా నా కమ్యూనిటీ వారికి అండగా నిలబడదామని. అలాగే గైనకాలజిస్టును అవాలనుకుంటున్నది కూడా నా కమ్యూనిటీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే. ముఖ్యంగా వారి జండర్ ట్రాన్సిషన్ సమయంలో, ఆ తర్వాత వారికి వైద్య సేవల అవసరం ఎంతో ఉంటోంద’ని రూత్ ఈ సందర్భంగా తన మనసులోని ఆలోచనలను వివరించారు. రూత్ రెండవ రౌండ్ కౌన్సిలింగ్ లో పాల్గొన్నారు. ఎలాగైనా గైనకాలజిస్టు అవాలనే తన కోరికను నెరవేర్చుకోవాలనే తపన డాక్టర్ రూత్ అణువణువునా ప్రతిఫలించింది. రూత్ తన మొదటి రౌండ్ కౌన్సిలింగ్ లో 35 ఛాయిస్ లు పేర్కొన్నారు. చివరిగా ఆమెకు 16వ ఆప్షన్ అయిన ఎమర్జన్సీ మెడిసెన్ ఇచ్చారు. తన ఈ విజయం సమిష్టి కృషితో సాధ్యమైందని రూత్ అభిప్రాయపడ్డారు. తనకు ఈ విషయంలో ఎంతో అండదండలు ఇచ్చిన ప్రతిఒక్కరినీ మరవలేనని, వారందరికీ తన ధన్యవాదాలని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సీనియర్ ట్రాన్స్ యాక్టివిస్టు వైజయంతి వసంతా మోగ్లి, ఆమె న్యాయ బృందం, తోటి సిబ్బంది అందించిన సహకారాన్ని తను ఎన్నటికీ మర్చిపోలేనని డాక్టర్ రూత్ తెలిపారు.
ఇఎస్ ఐ లో డాక్టర్ రూత్ కు సీటు కేటాయించారు. మొదటి సంవత్సరం ఫీజు కట్టడం డాక్టర్ రూత్ కు సవాలుగా నిలిచింది. కానీ హాస్పిటల్ సూపరెంటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అభ్యర్థనతో ఎందరో తోటి ఉద్యోగులు తన ఫీజు కోసం లక్ష రూపాయల వరకూ డబ్బును సేకరించి ఇచ్చారని డాక్టర్ రూత్ చెప్పారు. రెండున్నర లక్షల ఫీజులో మిగతా ఒకటిన్నర లక్ష రూపాయలు హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అందించిందని తెలిపారు.
ట్రాన్స్ జండర్ వైద్యురాలిగా ఎదిగే క్రమంలో డాక్టర్ రూత్ కూడా ఎన్నో అవమానాలను, హేళలను, ఛీత్కారాలను తన తోటి ట్రాన్స్ జండర్లకు మల్లేనే సమాజం నుంచి ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని పట్టుదలతో ధైర్యంగా తనేంటో నిరూపించుకుని పిజిలో సీటును కూడా సాధించారు. ఇతర వైద్యులకు ఏమాత్రం తీసిపోని రీతిలో వైద్య సేవలు అందిస్తూ పేషంట్లెందరి చేతనో శభాష్ అనిపించుకున్నారు డాక్టర్ రూత్. ఎల్ జిబిటిక్యూ కమ్యూనిటీకి గొప్ప స్ఫూర్తిగా నిలిచారు.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రూత్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా డాక్టర్ అవాలనే ఏకైక లక్ష్యంతో అన్నింటినీ ఓర్చి, పరిస్థితులను ఎదిరించి నేడు విజేతగా నిలిచానని ఆమె అంటారు. ఏడేండ్ల వయసులోనే తాను అందరి అబ్బాయిల్లాంటి వాడిని కాదని అనిపించేదని, శారీరకంగా నాలో ఏదో తేడా ఉందని నాకు అనిపించేదని, కానీ ఎవ్వరికీ చెప్పే ధైర్యం లేక మౌనంగానే ఆ బాధను అనుభవించానని ఆమె చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ఆడపిల్లల మధ్యనే గడపాలని తనకు ఉండేదని, తోటి అబ్బాయిలతో అస్సలు ఆడుకోవాలని అనిపించేది కాదని కూడా డాక్టర్ రూత్ గుర్తుచేసుకున్నారు.
‘నా విషయం అమ్మతో కూడా చెప్పే సాహసం చేయలేదు. కానీ చివరకు ఒకరోజు చెప్పినపుడు అమ్మ ఎంతో ఆవేదనకు గురయింది. వెంటనే డాక్టర్లకు చూబించుకుని ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పింది. తర్వాత నా పరిస్థితి చూసి ఆమె మానసికంగా తీవ్ర డిప్రషన్ కు గురైంది’ అని రూత్ తన అమ్మ గురించి చెప్పారు. తాను డాక్టర్ అవాలనే ఆలోచన వెనుక కూడా ఒక సంఘటన ఉందని డాక్టర్ రూత్ చెప్పుకొచ్చారు. ‘‘నేను ఎనిమిదవ తరగతి చదివేటప్పుడు మా ఇంటికి దగ్గరలో ఒక రూములో కొందరు ట్రాన్స్ జండర్లు కలిసి ఉండేవారు. వారిలో ఒకరు అనారోగ్య సమస్యతో చనిపోవడం జరిగింది. చనిపోయిన వ్యక్తి ట్రాన్స్ జండర్ కావడం వల్ల ఆసుపత్రిలో చేర్చుకోలేదు. తగిన వైద్యసేవలు అందించలేదు. ఎంత దురదృష్టకర పరిస్థితి అంటే ఆ ట్రాన్స్ జండర్ చనిపోయినా కూడా ఎవ్వరు పట్టుంచుకున్న దిక్కు లేదు. ఈ సంఘటన విన్నప్పుడు ఎందుకో నాలో తీవ్ర అలజడి, సంఘర్షణ, అంతకుమించిన మానసిక వేదనలు ఉప్పొంగాయి.
దివ్యాంగులను ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటున్న సమాజం ట్రాన్స్ జండర్ల విషయంలో ఇంత అమానవీయంగా ప్రవర్తించడం నా మనసును బాధించింది. ఆ క్షణమే నేను డాక్టర్ అవాలనే ఆలోచనకు బీజం పడింది. శారీరకమైన తేడాపాడాల కారణంగానే ట్రాన్స్ జండర్లు అలా ఉంటున్నారన్న అవగాహన చాలామందికి లేదనిపించింది. అందుకే కదా తోటివారి నుంచి ఈ ఛీత్కారాలు, అవమానాలు అని ఎన్నోసార్లు బాధపడ్డాను. ట్రాన్స్ జండర్ పిల్లల తల్లిదండ్రులు కూడా వారిని తమ బిడ్డలుగా చెప్పుకోవడానికి అవమానంగా ఫీలవడం నన్ను బాధించింది. అందుకే డాక్టరునయి ట్రాన్స్ జండర్లకు అండగా నిలబడాలని నిశ్చయించుకున్నా. అందుకే ఎన్ని ఆటుపోటులు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా వైద్య విద్యను ఆపలేదు’’ అని రూత్ గుర్తుచేసుకున్నారు.
సమాజంలో అందరికి మల్లేనే ట్రాన్స్ జండర్ల కమ్యూనిటీకి సమానహక్కులు ఉండాలని డాక్టర్ రూత్ తపనపడ్డారు. అందుకు సైతం పనిచేయడం ప్రారంభించారు. ట్నాన్స్ జండర్లను సమాజంలో ఎవ్వరూ కలుపుకుపోకపోవడం, వారికి ఎలాంటి పనులు ఇవ్వకపోవడం, వారు చదువును మధ్యలోనే ఆపేయడం వల్ల భిక్షాటన, సెక్సు వర్కు వంటి వాటిని చేయల్సి వచ్చి ఎంతో అమానవీయంగా శారీరక, మానసిక, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని, అనాథలుగా బతుకుతున్నారని డాక్టర్ రూత్ ఆవేదన వ్యక్తంచేశారు.‘‘ ఎంబిబిఎస్ అయిన తర్వాత ఉద్యోగం కోసం ఎన్నో ఆస్పత్రులకు కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగా. కానీ ఎక్కడా ఉద్యోగం ఇవ్వలేదు. చివరకు హైదరాబాదులోనే ట్రాన్సజండర్ల కోసం పనిచేస్తున్న మిత్ర అనే ఒక స్వచ్ఛంద సంస్థలో నన్ను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇచ్చారు. తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు పెట్టుకున్నా.
మిత్రలో పనిచేసేటప్పుడు నాకు మంచి వైద్యురాలిగా పేరు వచ్చింది. ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేసే అవకాశం రావడం, ఎంతోమంది పేదలకు వైద్యసేవలు అందించే అదృష్టం నాకు లభించింది. ఇది నా జీవితంలో ముఖ్యమైన మలుపు’’ అని రూత్ తెలిపారు. ఉస్మానియాకు వచ్చే పేషంట్లు కూడా మమ్మల్ని ఎలాంటి వివక్ష లేకుండా అందరు వైద్యులను చూసినట్టే చూస్తూ వారి బాధలను చెప్పుకున్నారు. తోటి వైద్యులు కూడా ఎంతో గౌరవంగా చూశారు. అయితే ఆస్పత్రిలో ఎంత మంచి వైద్యురాలిగా నేను గుర్తింపుపొందినా బయటకు వస్తే మటుకు అందరు నన్ను ఒక ట్రాన్స్ జండర్ లాగే చూస్తారు. అలా నిత్యం ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నా. ఎంత చదువుకున్నా ఒంటరిగా మేం ఏమీ చేయలేం. అందుకే పాఠశాల నుంచి జండర్ ఎడ్యుకేషన్ని పిల్లలకు అందించాలి. ఎల్ జి బి టిక్యూ కమ్యూనిటీ గురించిన అవగాహనను సమాజంలో అన్ని వయసుల వారికీ, వర్గాలు, కులాలు, మతాల వారికీ కల్పించాలి. అప్పుడే దీన్ని ఒక స్టిగ్మాగా చూడకుండా సాధారణ విషయంగా అందరూ చూడగలుగుతారు’’ అని డాక్టర్ రూత్ అభిప్రాయపడ్డారు.
నాకు అండగా నిలబడిన వారందరికీ థ్యాంక్స్..