
ఇన్‌స్టాలో డీపీ (డిస్ప్లే పిక్చర్స్) పెట్టొద్దని సోషల్ మీడియా బాధితురాలు శివాని తన ఫ్రెండ్స్‌ను హెచ్చరించింది. ఫ్రెండ్స్‌కు జాగ్రత్తలు చెప్పిన ఆమె మృత్యువాత పడుతుందని ఊహించుకోలేకపోయారు. శివాని మరణాన్ని తట్టుకోలేక వాళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నల్గొండ జిల్లా నార్గట్పల్లి మండలం నక్కలపల్లికి చెందిన డిగ్రీ స్టూడెంట్ శివాని తన స్నేహితురాలు మనీషాతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గడ్డి మందు తాగి వీరిద్దరు నల్లొండ జిల్లా కేంద్రంలో మృత్యువాత పడ్డారు. వీరి మరణానికి సోషల్ మీడియానే కారణమని వారు తెలిపారు. చనిపోయే ముందు శివానీ తన అన్నకు ఫోన్ చేసింది. డీపీలను తీసుకొని కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఏడుస్తూ అన్నకు తెలిపింది. డీపీలతో అశ్లీల చిత్రాలు తయారుచేసి గుర్తు తెలియని వ్యక్తులు శివానీ, మనీషలను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వాళ్ల నుంచి పదిహేను లక్షల సొమ్మును కూడా డిమాండ్ చేసినట్లు తెలిసింది. కాగా వీళ్లద్దరు తమ ఫోన్లలోని డేటాను డిలీట్ చేశారు. దాంతో పోలీసులు శివానీ, మనీషల ఫోన్లను డేటా రికవరి కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డేటా రికవరీ అయ్యేందుకు వారం రోజులు పడుతుంది. అపుడు కానీ నిందితులు ఎవరన్నది ఖచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు.
డీపీలు అవాయిడ్ చేయండి

తాజా పరిస్థితుల నేపథ్యంలో అమ్మాయిలు వాట్సప్, ఫేస్ బుక్, ఇన్‌స్టా, ఇతర సోషల్ మీడియాలో డీపీలు అవాయిడ్ చేయడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలిగే అమ్మాయిలయితే ఓకే గానీ బ్లాక్ మెయిలర్ల బెదిరింపులకు డిస్ట్రర్బ్ అయ్యే పరిస్థితి ఉంటే మాత్రం డీపీలను పెట్టకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్, అల్గరిథం లాంటి టెక్నాలజీలు డెవలప్ అయిన తర్వాత ఎవరి డీపీలనైనా తీసుకొని వాటిని ఇష్టం వచ్చిన రీతిలో మార్ఫింగ్ చేసే పరిస్థితి వచ్చిందని ఐటీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు బాగా పెరుగుతున్నాయనీ, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారని చెబుతున్నారు. నిజానికి అబ్బాయిలైనా, అమ్మాయిలైనా తమకు తోచిన విధంగా ఉండే హక్కు ఉన్నప్పటికీ సున్నితత్వం దృష్ట్యా డీపీలను అవాయిడ్ చేయమని చెప్పాల్సి వస్తోందని అంటున్నారు.