
రాజకీయాల అర్థరాత్రే జరుగుతాయనీ, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ అర్థరాత్రే విధించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బుధవారం (సెప్టెంబర్ 6) అర్థరాత్రి వరకు ఆయన కాంగ్రెస్ ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రెటరీ కే.సీ.వేణుగోపాల్‌తో చర్చలు జరిపారు. సీడబ్ల్యూసీ వేదిక, ఇతర ఏర్పాట్లు పరిశీలించడానికి సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చిన వేణుగోపాల్‌తో నారాయణ భేటీ అయ్యారు. సిటీలోని ఒక హోటల్లో బస చేసిన వేణుగోపాల్‌ని కలిసి అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు. వారి చర్చల్లో ఎన్నికల్లో పొత్తు అంశం ప్రధానాంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణ మాత్రం ఇండియా కూటమిలో తాము జాతీయ స్థాయిలో భాగస్వాములుగా ఉన్నందున పలు విషయాలు మాట్లాడేందుకు కలిశామన్నారు. అయితే పొత్తుల విషయం కొట్టి పారేయలేదు.
నారాయణ మీడియాతో మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి వచ్చారని కలిసేందుకు వచ్చాను. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో వామ పక్షాలు కలిసి నడుస్తున్నాయి. ఇదే కాంబినేషన్ తెలంగాణ లో కూడా రిపేట్ చేయాలని భావిస్తున్నాం. దాని పై ప్రాథమికంగా చర్చలు జరిగాయి. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రాథమికంగా జరిగిన చర్చల వల్ల మేము, కాంగ్రెస్ హ్యాపీగా ఉన్నాం. ఇండియా కూటమిని బీజేపీ నాశనం చేయాలనీ చూస్తోంది. కెసిఆర్ ని నమ్మి వామ పక్షాలు మోసపోయాయి. రాజకీయాల్లో అన్ని అర్ధరాత్రే జరుగుతాయి. ఇందిరా గాంధీ కూడా అర్ధరాత్రే ఎమర్జన్సీ పెట్టింద’’ని ఆయన అన్నారు.