
సెన్సార్ బోర్డు కరప్ట్ అయ్యిందనీ, లంచం లేనిదే పని చేయడం లేదని ప్రముఖ హీరో విశాల్ ఆరోపించారు. తాను నటించిన మార్క్ ఆంటోని మూవీ హిందీ వర్షన్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీసు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తన మూవీ చూడడానికి మూడు లక్షలు, సర్టిఫికేషన్‌కు మరో మూడున్నర లక్షలు లంచం చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అంతేకాక ఒక వీడియో చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అవినీతి నిర్మూలన అనేది సినిమాల్లో మాత్రమే కనిపిస్తోందన్నారు. నిజ జీవితంలో మాత్రం అది అడుగడుగునా ఉందని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితి తాను మొదటిసారి ఎదుర్కొన్నానన్నారు. దీనిపై మహారాష్ట్ర సీఎంతోపాటు, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని ఆయన వివరించారు. తాను డబ్బులు ఎలా చెల్లించాననే విషయాన్ని ఆయన అకౌంట్ వివరాలతో సహా చెప్పారు. ప్రతీ ఒక్కరికీ ఈ విషయం తెలియాలని తానలా చేస్తున్నానని విశాల్ చెప్పారు.