
మంచి పనులు చేయాలంటే పెద్దాళ్లే కానక్కర్లేదు.. చిరుతప్రాయంలో కూడా అలాంటి అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది హైదరాబాదుకు చెందిన పదకొండేళ్ల చిన్నారి ఆకర్షణా సతీష్. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఏడవతరగతి చదువుతున్న ఆకర్షణ చేబట్టిన ఈ పని నిజానికి చిన్నదేమీ కాదు. పైగా ఇంత పిన్నవయసులోనే ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు గ్రంధాలయాలను హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేసింది. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ. కానీ ఇది అక్షరాలా నిజం. ఇన్ని గ్రంధాలయాలు ఏర్పాటు చేసిన 11 సంవత్సరాల అకర్షణకు ఈ ఆలోచన మెరిసిన సందర్భం కూడా ఎంతో గొప్పదని చెప్పాలి. ఈ దిశగా ఆకర్షణ ప్రయాణం 2021సంవత్సరంలో మొదలైంది.
ఒక రోజు తన తల్లిదండ్రులతో కలిసి సిటీలోని ఎంఎన్జె కాన్సర్ చిల్డ్రన్ హాస్పిటల్ కు ఆకర్షణ వెళ్లింది. అక్కడ చిన్నారి పేషంట్లకు ఆహారాన్ని పంచింది. ఆ సందర్భంలో అక్కడి పిల్లలు చాలామంది తమకు కలరింగ్ బుక్స్ కావాలని అడగడం ఆకర్షణ గమనించింది. అది ఆకర్షణలో ఒక అద్భుతమైన ఆలోచనకు బీజం వేసింది. పుస్తకాలు ఇష్టపడే పిల్లలకు వాటిని అందేలా చేస్తే ఎలా ఉంటుందన్న కోరిక ఆ చిన్నారిలో మెరిసింది. అంతే పిల్లల కోసం లైబ్రరీల ఏర్పాటుకు పట్టుదలతో నడుం కట్టింది. తనవారందరితో కలిసి ఆ ప్రయత్నానికి పూనుకుంది. ఇరుగుపొరుగువారి నుంచి, తన క్లాస్ మేట్స్ నుంచి, బంధువుల నుంచి పుస్తకాలు సేకరించడం ప్రారంభించింది. అలా 5,800 పుస్తకాలను ఆకర్షణ సేకరించింది. ఈ పుస్తకాలను వివిధ కమ్యూనిటీల చిన్నారులకు అందేలా గ్రంధాలయాలను ఏర్పాటుచేసింది.
ఆకర్షణ ఏర్పాటుచేసిన ఏడవ లైబ్రరీని సనత్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర మంత్రి తలసాన శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు. ఈ కొత్త లైబ్రరీలో మొత్తం 610 పుస్తకాలు ఉన్నాయి. విద్యార్థులు పుస్తకాలను చదివేలా ప్రోత్సహించేందుకు, వారిలో విజ్ఘానాన్ని పెంపొందించేందుకే తాను ఈ ప్రయత్నానికి పూనుకున్నట్టు చిన్నారి ఆకర్షణ చెప్తోంది. ఆకర్షణ ఏర్పాటు చేసిన లైబ్రరీల్లో విసృతస్థాయిలో పుస్తకాలు ఉన్నాయి. అంటే ఫిక్షన్ నుంచి నాన్ ఫిక్షన్, జనరల్ నాలెడ్జ్ పుస్తకాల దాకా అన్ని రకాలూ తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో మొత్తం ఏడు లైబ్రరీల్లోనూ అందుబాటులో ఉండడం విశేషం. మొదటి లైబ్రరీ ఎంఎన్జె చిల్డ్రన్ కాన్సర్ హాస్పిటల్ లో ఆకర్షణ ఏర్పాటుచేసింది. రెండవది సనత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసింది. మూడవది హైదరాబాదులోని జ్యువెనల్ అండ్ అబ్జర్వేషన్ హోమ్ ఫర్ గర్ల్స్ లో నెలకొల్పింది. నాల్గవది బోరబండలోని గాయత్రి నగర్ అసోసియేషన్ లో ఏర్పాటుచేసింది. ఐదవ లైబ్రరీని కోయంబత్తూర్ సిటీ పోలీస్ స్ట్రీట్ లైబ్రరీల వారితోకలిసి ఏర్పాటుచేస్తే, ఆరవది వచ్చి నొలాంబర్ పోలీస్ స్టేషన్ లోని చెన్నయ్ బాయిస్ క్లబ్ లో పెట్టింది. ఇంత చిన్న వయసులో ఇంత మంచి ఆలోచన ఆకర్షణకు రావడం ఎంతైనా అభినందిచాల్సిన విషయం అనడంలో సందేహం లేదు.
Wow..Good job
thank you