
భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దేశాన్నంతా ఏకతాటిపైకి తెచ్చిన మహోన్నత ఉద్యమమది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజలందరినీ ఏకం చేసింది. 1942 ఆగస్టు 9 ఈ ఉద్యమానికి గాంధీ పిలుపునిచ్చారు. ముంబైలో జరుగుతున్న అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. ‘చావో, బతుకో’ (డూ ఆర్ డై) అంటూ ఆయన ఆ రోజు ఇచ్చిన ప్రసంగం ప్రజలను ఉత్తేజితులను చేసింది.
ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో నాడు సభ జరిగింది. దీన్నే తర్వాత ‘ఆగస్ట్ క్రాంతి మైదాన్’ అనే పేరుతో పిలుస్తున్నారు. నాటి సభలో క్విట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుడుతూ అరుణా అసఫ్ అలీ భారత పతాకాన్ని ఎగురవేశారు. ‘క్విట్ ఇండియా’ అనే పదాన్ని నాటి ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు, సోషలిస్టు అయిన యూసుఫ్ మెహరల్లీ దేశానికి అందించారు. ‘సైమన్ గో బ్యాక్’ అనే నినాదం కూడా ఆయన ఇచ్చినదే.
ఉద్యమ ప్రభావం
క్విట్ ఇండియా ఉద్యమ ప్రభావంతో దేశంలోని చిన్న చిన్న ఉద్యమాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ముఖ్యంగా దేశంలో బయలుదేరుతున్న అతివాద ఉద్యమాలన్నీ గాంధీ పిలుపుతో క్విట్ ఇండియాలో కలిసిపోయాయి. బ్రిటీష్ వ్యతిరేకతను ఈ ఉద్యమం తారా స్థాయికి తీసుకుపోయింది. ఎలాగైనా బ్రిటీష్ వాళ్లను వెళ్లగొట్టాలనే కాంక్ష దేశ ప్రజల్లో ప్రబలంగా నాటుకుంది. క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన కాలంలోనే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధానికి భారత్ మద్దతు ఉంటుందని బ్రిటీషర్ల భావన తప్పని తేలిపోయింది. భారత జాతీయ కాంగ్రెస్‌తో సంప్రదించకుండానే బ్రిటీషర్లు రెండో ప్రపంచ యుద్ధానికి భారత్ మద్దతు ఉంటుందని ఊహించుకున్నారు. కానీ తప్పని ఈ ఉద్యమంతో తేలిపోయింది. భారత దేశం కోరుతున్న స్వయం పాలన, కొత్త రాజ్యాంగం ప్రతిపాదనలను ముందకు తీసుకొని వచ్చి క్రిప్స్ మిషన్ విఫలమైంది.
క్విట్ ఇండియా డిమాండ్లు
భారత దేశం నుంచి బ్రిటీషర్లు వెంటనే ఉపసంహరించుకోవాలి. వాళ్ల పరిపాలన పూర్తిగా అంతం కావాలి. ఈ ప్రతిపాతనకు అంగీకరించిన పక్షంలోనే ఫాసిజాన్ని అంతం చేయడానికి తలపెట్టిన రెండో ప్రపంచ యుద్ధానికి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అదేవిధంగా తక్షణం భారత దేశంలో స్వయం పాలన కోసం ఒక ప్రొవిజినల్ గవర్నర్మెంట్ను ఏర్పాటు చేయాలని నాడు ప్రధాన డిమాండ్లుగా ముందుంచారు.
దశల వారిగా సాగిన ఉద్యమం
ఉద్యమం మొదటి దశలో పట్టణ ప్రాంతాల్లో అందోళనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు. దేశవ్యాప్తంగా సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి. ఫ్యాక్టరీలలో పనులు ఆపేసి కార్మికులు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఈ ఉద్యమాన్ని చూసి దడిసిన బ్రిటీష్ పాలకులు గాంధీని పూనేలోని ఆగా ఖాన్ ప్యాలెస్‌లో బంధించారు. ఇతర నాయకులందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి జైళ్లో పెట్టారు.
రెండో దశలో ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించారు. రైతాంగం పెద్ద ఎత్తున స్థానిక పాలకులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్లు, ట్రాకులు, టెలిగ్రాఫ్ వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. ప్రభుత్వ భవనాపై దాడులకు పాల్పడ్డారు. వలస పాలనకు చిహ్నంగా ఉన్న ప్రతిదాన్ని కూలదోశారు.
మూడో దశలో ప్రజలు స్థానిక ప్రభుత్వాలను స్థానికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు ఏర్పడ్డారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పాలన కొద్దికాలం పాటు కొనసాగింది.
ఉద్యమ ప్రయోజనం
క్విట్ ఇండియా ఉద్యమం కారణంగా స్వయం పాలన చేసుకోగలమనే నమ్మకం దేశ ప్రజల్లో వచ్చింది. కొత్త నాయకత్వం పుట్టుకొచ్చింది. జాతీయతా భావన ప్రజల్లో మరింత విస్తృతంగా వ్యాపించింది. జాతీయోద్యమంలో మహిళల భాగస్వామ్యం పెరిగింద.
అయితే బ్రిటీషర్ల విపరీతమైన నిర్బంధం, అరెస్టులు, హింస కారణంగా ఉద్యమం కొంత కాలానికే అంతమైంది. ఆందోళన సమయాల్లో బ్రిటీషర్లు విపరీతమైన లాఠీ ఛార్జి చేసి ప్రజల్ని గాయపరిచారు. గ్రామాలను తగులబెట్టారు. జనాలపై విపరీతమైన ఫైన్లు వేశారు. అనేక చోట్ల కాల్పులు కూడా జరిపి ప్రజల ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు. ఉద్యమ సమయంలో దాదాపు లక్ష మందిని అరెస్టు చేశారు.