
వానా కాలం పంట చేతికొస్తుండడంతో టమాట రేట్ తగ్గుతున్నది. నిన్న మొన్నటి దాకా 150 నుంచి 200 రూపాయల దాకా పలికిన టమాట ఇపుడు కిలో 80 రూపాయలకు తగ్గింది. రెండు కిలోలు 100 నుంచి 150 రూపాయలకే అమ్మతున్నరు. హైదరాబాద్లో రోడ్డు పక్కన ఆటో ట్రాలీల్లో మాల్ తీసుకొచ్చి ఈ రేటుకు అమ్ముతున్నారు. కాగా ఓపెన్ మార్కెట్లో ఇంకా అర కిలో 50 రూపాయలు అమ్ముతున్నరు. రెండు మూడు రోజుల్లో బయట మార్కెట్లలో కూడా రేట్ తగ్గించక తప్పదని రైతులు అంటున్నారు. హైదరాబాద్ శివారు జిల్లాలైన రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ నుంచి టమాట సప్లై మెరుగుపడ్డాయి. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా రేట్లు బాగానే తగ్గాయి. పాలమూరు హోల్సేల్ మార్కెట్లో బాక్సు ధర (20 కిలోలు) 1,500 నుంచి 1,700 రూపాయలు పడుతోంది. నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బాక్సు ధర 1,700 నుంచి 1,800 రూపాయలు పలుకుతోంది. మొత్తం మీద టమాట ధర కిలోకి 100 రూపాయల లోపునే పలుకుతుండడంతో వినియోగదారులు ఊపరి పీల్చుకుంటున్నారు.