
సెప్టెంబరు 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ సభకు సోనియా గాంధీని ఆహ్వానించామని చెప్పారు. ఆరోజే పార్టీ మేనిఫెస్టోను ఆమె చేతుల మీదుగానే విడుదల చేస్తామన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన మీడియా చిట్‌చాట్‌లో ఈ విషయం వెల్లడించారు. మేనిఫెస్టో రిలీజ్ చేసే దాకా డిక్లరేషన్లు ప్రకటిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. గద్దర్ తెలంగాణ లెజెండ్ గద్దర్ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ”గద్దర్ అవార్డ్స్” పేరిట కవులు, కళాకారులకు ఇచ్చే అవార్డులు ఇస్తామన్నారు. 55 ఏండ్లు గద్దర్ తెలంగాణ కోసం కొట్లాడారని, ఆయనకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే పొత్తులపై చర్చ ఉంటుందన్నారు. షర్మిల చేరికపై పార్టీలో చర్చ లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 18న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఖర్గేతో భారీ బహిరంగ సభను నిర్వహించి డిక్లరేషన్ వెల్లడిస్తామని రేవంత్ చెప్పారు. సీట్ల ప్రకటన అంతా అధిష్టానం చేతిలో ఉన్నదన్నారు. సోమవారం నిర్వహించే ఎన్నికల కమిటీ సమావేశంలో అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. ఎన్నికల అబ్జర్వర్లు, సెలెక్షన్ కమిటీలు అభ్యర్థులను ఎంపిక చేస్తాయన్నారు. కేసీఆర్ సెంటిమెంట్ పేరిట రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడని, ఆయనను ఉరి తీయాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో పిండం పెడతామన్నారు.