హిట్ అండ్ రన్ కేసుల్లో నిందితులకు పదేళ్లు జైలు శిక్ష వేయాలని కేంద్రం ప్రతిపాదించింది. వివిధ రకాల క్రిమినల్ చట్టాల్లో మార్పుల్లో భాగంగా కేంద్రం ఈ ప్రతిపాదన రూపొందించింది. 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.54 మంది చనిపోయారని కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ పేర్కొంది. 3.84 లక్షల మంది గాయపడ్డారు. ఈ డేటా ఆధారంగా ఇలాంటి యాక్సిడెంట్లు అరికట్టేందుకు శిక్షలు కఠినతరం చేయడమే మార్గమని కేంద్రం భావిస్తోంది. యాక్సిడెంట్ చేసి సైలెండ్‌గా పారిపోతే పదేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించాలని ప్రతిపాదించింది. ఒకవేళ యాక్సిడెంట్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తే ఏడేళ్లు జైలు, ఫైన్ వేయాలని ప్రతిపాదించింది.
లైంగిక దోపిడీకి పదేళ్లు.. గ్యాంగ్ రేప్‌కు 20 ఏళ్లు..
వ్యక్తిగత గుర్తిపును దాచి మహిళలను పెళ్లి చేసుకున్నా, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొని మోసం చేసినా, పెళ్లి చేసుకుంటాననీ, ప్రమోషన్ ఇస్తాననీ, ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి లైంగికంగా లోబరుచుకొంటే పదేళ్లు జైలు శిక్ష విధించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. గ్యాంగ్ రేప్ కేసుల్లో 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష లేదా మరణి శిక్ష విధించేలా ప్రతిపాదనలు చేశామన్నారు.