
హకీంపేట్ సిఐఎస్ఎఫ్, ఎన్ఐఎస్ఏ, అంతరిక్ష ఆడిటోరియంలో జరిగిన 8వ “రోజ్ గార్ మేళా” లో ముఖ్యఅతిథిగా పాల్గొని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి రంగాల్లో మొత్తం 4 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 323 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి
నేడు జరిగిన 8వ రోజ్గార్ మేళాతో కలుపుకుని మొత్తం ఇప్పటివరకు 5లక్షల 50వేలకు పైగా మంది ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు
28 ఆగస్టు, 2023, హైదరాబాద్
క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసి,దేశ సమగ్రత, సమైక్యతను కాపాడాలని, తద్వారా దేశ సేవలో భాగస్వామ్యులు కాబోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అన్నారు.
“దేశ రక్షణకు మీరు అంకితం కాబోతున్నారు. నేటి నుంచి మీరు అంకితభావంతో పని చేస్తూ ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హకీంపేట్ సిఐఎస్ఎఫ్, ఎన్ఐఎస్ఏ, అంతరిక్ష ఆడిటోరియంలో జరిగిన 8వ “రోజ్ గార్ మేళా” లో కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ రోజ్గార్ మేళాలో భాగంగా నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశానికి దిశా నిర్దేశం చేస్తూ, 1000-1200 సంవత్సరాల క్రితం నుంచే మన దేశంపై దాడులు జరిగాయని, ఎన్నో కుట్రలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. అయినప్పటికీ.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయన్నారు. ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. దేశ సమగ్రత చెక్కుచెదరలేదన్నారు. భారతీయుల్లో ఉన్న జాతీయ భావన, యువతలో ఉన్న దేశం అనే భావన, మన దేశ సమగ్రతను కాపాడేందుకు ఏదైనా చేయాలన్న సంకల్పమే ఇందుకు కారణం అని తెలిపారు.
దేశం ఈ రోజు శాస్త్రసాంకేతిక రంగాల్లో అమెరికాతో పాటు సమాన గౌరవాన్ని పొందుతున్నామని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. దానికి ఉదాహరణే ఇటీవల జాబిల్లిపై చంద్రాయాన్పై అడుగు పెట్టడమే అన్నారు. అందుకే యువతకు సాధికారత కల్పించడం ద్వారా నాటి వైభవాన్ని పున:ప్రతిష్టించుకునేందుకు ప్రధానమంత్రి మోదీ సంకల్పించారన్నారు.
మన దేశానికి ఉన్న ప్రత్యేకత మన యువబలం. యువత సామర్థ్యాన్ని దేశం కోసం సద్వినియోగం చేసుకోవాలనేది ప్రధానమంత్రి ఆలోచన అని మంత్రి తెలియజేశారు. ఇందుకోసం అవసరమైన నైపుణ్యాన్ని కల్పించడంతోపాటు, వారికి సరైన అవకాశాలు కల్పించడం ప్రధానమంత్రి ఆలోచన అని తెలిపారు. దీనికి తగ్గట్లుగానే 9 ఏళ్లుగా.. ఒక్కొక్కటిగా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు.
వచ్చే 25 ఏళ్ల కాలం ‘అమృత కాలం’. భారతదేశ చరిత్రలో ఇది అత్యంత కీలకమైన సమయమని కేంద్రమంత్రి ఈ సందర్భంగా యువతకు తెలిపారు. ఈ సమయంలో.. మనలోని బానిస ఆలోచనలను తొలగించుకుని కేవలం జాతీయవాద భావనను మదిలో నింపుకుని యువత ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం యువతకు ఓవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే.. మరోవైపు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని అందిస్తూ.. ఉద్యోగాల కోసం వేచి చూసే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ప్రధానమంత్రి యువతను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
“22 అక్టోబర్ 2022 నాడు దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రతి నెల 50 నుంచి 70వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తూ ఈ మేళాను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. నేడు జరిగిన రోజ్గార్ మేళా ఎనిమిదొవది. ఇవాళ్టి కార్యక్రమంతో కలుపుకుని మొత్తంగా 5.5 లక్షలకు పైగా మందికి నియామక పత్రాలు అందించాం. మిగిలిన లక్ష్యాన్ని కూడా నిర్దేశిత సమయంలో చేరుకుంటాం. గతంలో ఉద్యోగాలంటే సిఫారసు ఉంటేనే వచ్చేది.. కానీ నేడు ప్రతిభ ఆధారంగా, మీరు పడే కష్టం ఆధారంగా ఉద్యోగం మీదే అన్నట్లుగా ఉంది పరిస్థితి” ఉన్నట్లు కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అధునాతన సాంకేతికను విద్యావిధానంలోకి తీసుకొచ్చింది. అదే సమయంలో ఎన్.ఈ.పి-2020 ద్వారా విద్యావిధానంలో నైతికతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసింది. ఇలా ఈ తొమ్మిదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. వచ్చే 25 ఏళ్ల అమృతకాలంలో.. మీరు మరింతగా శ్రమించి పనిచేస్తే.. భారతదేశాన్ని మళ్లీ ‘విశ్వగురు’గా చూడడం మరింత సులువు అవుతుందని, ఈ దిశగా మీ సహకారం కావాలని కేంద్రం మంత్రి అన్నారు.
సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి రంగాల్లో మొత్తం 4 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 323 మంది అభ్యర్థులకు కేంద్ర మంత్రి నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సునీల్ ఇమ్మన్యూయల్ , డైరెక్టర్, ఎన్ఐఎస్ఏతో పాటు సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
**