
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లి గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్ కింద పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. చంటయ్యపల్లి గ్రామానికి చెందిన దండబోయిన మమత- శరత్ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శాన్విక్ గట్ల నర్సింగపూర్ లోని గుండవరపు సత్యవతి శ్రీనివాస్ రావు స్మారక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. ఆ స్కూల్ కి బస్సు సౌకర్యం ఉండగా.. మంగళవారం ఉదయం శాన్విక్ ను బస్సు ఎక్కించేందుకు తల్లి మమత వెళ్లింది. ఆమె వెంటే వెళ్లిన చిన్న కొడుకు శివాన్షు(3) స్కూల్ బస్సు కదిలే క్రమంలో ప్రమాదవశాత్తు దాని కింద పడ్డాడు. వెనుక టైర్ కింద తల పడటంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా.. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.