
ముఖ్యమంత్రి గారికి నమస్కారం.
విషయం: తెలంగాణ రాష్ట్రంలో గత 15 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న రెండవ ఎఎన్‌ఎమ్‌ల ఉద్యోగాలు క్రమబద్దీకరించాలి. చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న వారికి అక్రమంగా ఇస్తున్న నోటీసులను ఉపసంహరింస్తూ చర్చలకు ఆహ్వానించి వారి డిమాండ్స్‌ను పరిష్కరించుట గురించి.
తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీంను దాదాపు ఐదున్నర వేల మంది రెండవ ఎఎన్ఎమ్లు గత 16 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిని ఉద్యోగంలోకి తీసుకునే సమయంలో డిస్ట్రిక్ సెలెక్షన్ కమిటీ (డిఎస్సి) ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోష్టర్, మెరిట్ ఆధారంగా చేసుకొని ఎన్నిక చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికంటే ముందు రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందినందరిని క్రమబద్దీకరిస్తామని తమరు హామీ ఇచ్చారు. కానీ, అనంతరం డిపార్టుమెంట్లలో ఉన్నటువంటి కొర్రీలను ఆధారంగా చేసుకొని కొద్ధిమందిని మాత్రమే క్రమబద్ధీకరించి మిగతా సిబ్బందిని క్రమబద్దీకరించకపోవడం అన్యాయం. ఇతర రాష్ట్రాలలో రెండవ ఎఎన్ఎమ్లను డిపార్టుమెంటల్ ఎగ్జామ్ ద్వారా క్రమబద్దీకరించిన విషయం తమరికి గుర్తుచేస్తున్నాము.
తమ సమస్యల పరిష్కారానికై సమ్మె నోటీసు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు అడిగినా సమస్య పరిష్కారం కానందున చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నటువంటి రెండవ ఎఎన్‌ఎమ్‌లకు షోకాజ్ నోటీస్‌లు ఇవ్వడం అక్రమం, కార్మిక హక్కులను హరించడమే అవుతుంది.
కావున రెండవ ఎఎన్ఎమ్లందరి ఉద్యోగాలను క్రమబద్దీకరించి, షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకొని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను.
అభివందనములతో,
చాడ వెంకటరెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు
