
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయవద్దని, ఆయనను ఓడించాలని ఆరిజిన్ డెయిరీ సిఏఓ శేజల్ కోరారు. ఆమె శుక్రవారం బెల్లంపల్లి బజార్ ఏరియాలో చిన్నయ్యకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు శేజల్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఆమెకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే చిన్నయ్య ఆరిజిన్ డెయిరిలో తన అనుచరులకు, బంధువులకు వాటాలు ఇప్పించాడని తెలిపారు. డెయిరీ ఏర్పాటు కోసం గవర్నమెంట్ భూమిని తన భూమిగా చెప్పి స్వయంగా భూమి పూజ కూడా చేశాడన్నారు. డెయిరీ డబ్బులు రూ.30 లక్షలు వాడుకొని తమపైనే అక్రమ కేసులు పెట్టించాడని ఆరోపించారు. అంతేకాకుండా తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేయడంతో ఆరు నెలలుగా న్యాయం కోసం పోరాడుతున్నానని పేర్కొన్నారు. పోలీసులు చిన్నయ్యపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.