
అమరాంత్ గురించి విన్నారా? సూపర్ ఫుడ్‌గా చాలా దేశాల్లో దీని పేరు నేడు మారుమోగిపోతోంది. దీనిని మనదేశంలో రాజ్గిరా లేదా రామ్దానాఅంటారు. రాజ్గిరా అంటే రాయల్ గ్రైయిన్ అని అర్థం. రాముడు చెప్తారు. అమరాంత్ అంటే ఎన్నటికీ వాడనిది. శాశ్వతమైంది అని అర్థం.
ఎంతో పురాతనమైన ఈ అమరాంత్ సూపర్ ఫుడ్ గా ఖ్యాతి పొందింది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు అపారంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇది గ్లూటన్ ఫ్ఱీ కూడా. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇది ప్రొటీన్ల నిధి. ఇందులో ఉండే పోషకాలు కూడా ఎంతో విశేషమైనవి, మరెంతో ప్రాధాన్యం కలిగినవి.

కాలం మాటున కనుమరుగైన అమరాంత్ సూపర్ ఫుడ్ గా నేడు తిరిగి ఎన్నో ఇళ్లల్లో వంటింటి రాణిగా ఘుమఘుమలను చిందిస్తోంది. ఆరోగ్య నిధిగా ప్రశంసలను అందుకుంటోంది. అమరాంత్ ని చులాయ్ అని కూడా పిలుస్తారు. వాడని పుష్పంగా పేర్కొనే దీని ఆకులు, గింజలు ప్రొటీన్లతో నిండివుండడమే కాదు సూక్ష్మపోషకాలకు కూడా అమరాంత్ నెలవు. బరువు తగ్గాలనుకునే వాళ్లు, బ్లడ్ షుగర్‌ని నియంత్రణలో పెట్టాలనుకునే వాళ్లు నిత్యం తమ డైట్లో అమరాంత్ ని చేరిస్తే మంచి ఫలితాలు పొందగలరు.
అమరాంత్ మూలాలు మెక్సికో, సెంట్రల్ అమెరికాల్లో ఉన్నట్టు చెప్తారు. మనదేశంలో దీన్ని ప్రధానంగా కొండ ప్రాంతాల్లో పండిస్తారు. అయితే గత కొద్ది దశాబ్దాల నుంచి మధ్య, పశ్చిమ మైదానప్రాంతాల్లో కూడా దీన్ని పండిస్తున్నారు. అమెరికాలో కూడా అమరాంత్ పేరు మారుమోగిపోతోంది. ఇందుకు కారణం ఈ సూపర్ ఫుడ్‌లో ఉన్న ప్రత్యేకతలేనట.

సిలియాక్ జబ్బు ఉన్నవారు అంటే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్న వారికి ఇది మంచి ఫుడ్ ఛాయస్. దీని ఆకులతో రుచికరమైన కూర వండుకోవచ్చు. అమరాంత్ గింజలను ధాన్యంగా ఉపయోగిస్తారు. ఈ గింజలతో రోటీ చేసుకోవచ్చు. లడ్డూలు చేసుకోవచ్చు. సూప్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ప్లాంట్ ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఎంతో సులభంగా కూడా ఇది జీర్ణం అవుతుందిట. అత్యవసర ప్రొటీన్లను కూడా ఇది శరీరానికి అందిస్తుంది.
పలు స్టడీల్లో తేలినదాన్ని బట్టి అమరాంత్లో అన్ని రకాల అమినోయాసిడ్లు ఉన్నాయిట. ఇందులో లభించే ప్రొటీన్లు యానిమల్ ప్రొటీన్లతో సమానమైన శక్తినిస్తాయిట. అందుకే శాకాహారులకు ఈ ప్రొటీన్ ఫుడ్‌ను తినవలసిందిగా పోషకాహారనిపుణులు ప్రత్యేకంగా సూచిస్తున్నారుట. ఇందులో డైటరీ ఫైబర్ సైతం అధికంగా ఉంది. అమరాంత్ ఆకులు, గింజల్లోని పోషకాలు శరీరానికి కావలసినంత ఎనర్జీని అందిస్తాయని వైద్యులు చెపుతున్నారు.