
ఆనంద్. సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఎప్పుడూ పని ఒత్తిడితో ఉండేవాడు. రిలాక్సేషన్ అనేదే అతనికి ఉండేది కాదు. స్నేహితులతో మాటలు కరువయ్యాయి. ఎప్పుడూ ఒంటరితనం కమ్ముకున్నట్టు ఉండేది అతనికి. ఒకవిధమైన డిప్రషన్ అతనిలో ఎప్పుడూ కనిపించేది. అతని పేరు ఆనందే గాని అతని ముఖంలో ఎన్నడూ ఆనందం చూసినవాళ్లు లేరు. అనుక్షణం ఏదో దిగులు, యాంగ్జయిటీ అతన్ని వెంటాడుతుండేవి. ఒకరోజు కిడల్టింగ్ గురించి ఇంటర్నెట్ లో చూశాడు. అది అతని జీవితాన్ని ఆనందపు మలుపు తిప్పిందంటాడు ఆనంద్ ఈరోజు…

ఇలాంటి ఆనంద్ లు నేడు మన చుట్టూతా ఎందరో ఉన్నారు. వీళ్లంతా తినడం దగ్గర నుంచి పడుకోవడం వరకూ ప్రతీదీ ఒక పనిలా చేసే కొత్త తరానికి ప్రతిబింబాలు. పొద్దున్న లేచిన క్షణం నుంచి ప్రతి నిమిషం పరుగులమయం వీళ్ల జీవితం. చదువులు, ఉద్యోగాలు, ఏవో బాధ్యతలు, ఒత్తిళ్లు… ఇలా అనుక్షణం రిలాక్సేషన్ అనేదే లేకుండా నేటి కుర్రకారు తీవ్ర డిప్రషన్ తో రోజులు గడిపేస్తున్నారు. మానసిక సాంత్వన కరువై తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. దీంతో యాంగ్జయిటీ, డిప్రషన్లకు గురవుతూ మానసిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనిని అధిగమించడానికి, ఊరట పొందడానికి, రిలాక్సింగ్ కోసం వీళ్లు చేయని ప్రయత్నం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిందే ‘కిడల్టింగ్’ అనే ట్రెండ్.

వయసుతో సంబంధం లేకుండా నేటి యువత ఎందరో తమ బాల్యపు ఆటపాటలు, అలవాట్ల పట్ల తిరిగి ఆకర్షితులవుతున్నారు. వాటి నుంచి ఆనందాన్ని, ప్రశాంతతలను వాళ్లు పొందుతున్నారు. అలా ‘కిడల్టింగ్’ అనే కొత్త ట్రెండు బాట పట్టారు నేటి ఎందరో యువతీయువకులు. వీళ్లు చిన్నారులు (కిడ్స్) ఆడే ఆటలవైపు, యాక్టివిటీల వైపు పెద్దఎత్తున మళ్లడం ప్రారంభించారు. ఇంటర్నెట్ లోని కిడల్టింగ్ కమ్యూనిటీ కూడా ఎందరో యువతీయువకులపై ప్రభావం చూపింది. నిజానికి కిడల్టింగ్ ట్రెండ్ కు కరోనా పాండమిక్ సమయంలో బీజం పడింది. కిడ్స్ (చిన్నారులు) కోసం చేసే ఫన్ కాస్తా ఇపుడు అడల్ట్స్ కు మానసిక ఉపశమనాన్ని ఇస్తూ ‘కిడల్టింగ్’ గా కుర్రాళ్లల్లో ఊపందుకుంది.

బాల్యానికి సంబంధించి ఉండే నోస్టాలిజియాను కిడల్టింగ్ ట్రెండ్ తిరిగి బయటకు తీస్తోంది. బ్లూంబెర్గ్ రిపోర్టు ప్రకారం కిడల్ట్ కన్స్యూమర్స్ అమెరికాలోని చిన్నపిల్లల బొమ్మల అమ్మకాలను రెండేళ్లల్లో 37 శాతం పెంచారట. దీన్ని బట్టి కిడల్ట్స్ మధ్య ఈ ట్రెండు ఎంతలా పాకిందో అర్థమవుతుంది. యుఎస్ ఇండస్ట్రీస్ టాయ్ అసోసియేషన్ సర్వేలో 58 శాతం మంది అడల్ట్స్ చిన్నారులకుద్దేశించిన బొమ్మలు, ఆటల సామగ్రిని కొన్నారని వెల్లడైంది. ఈమధ్యనే మనదేశంలో కూడా ఎంతోమంది కుర్రాళ్లు కిడల్టింగ్ బాట పట్టడం మొదలైంది. కిడల్టింగ్ ద్వారా బాల్యంలోని తమ అలవాట్లను పునరుద్ధరించుకునే ప్రయత్నాన్ని ఇక్కడి కుర్రాళ్లు మొదలెట్టారు. బాల్యంనాటి ఆటపాటలను తిరిగి షురూ చేసి బాల్యపు జ్జాపకాల్లో యువతీయువకులు విహరిస్తున్నారు. పసిపిల్లల్లా తమని తాము మరిచిపోయి ఆ ఆటలను ఆడుతున్నారు. ఆస్వాదిస్తున్నారు. ఇవి వారిని వెంటాడుతున్న యాంగ్జయిటీ, ఒత్తిడి, డిప్రషన్ ప్రమాణాలను అనూహ్యంగా తగ్గిస్తున్నాయి కూడా. ఉదాహరణకు మండాల బుక్ కలరింగ్ వంటి చిన్నపిల్లల హాబీలను యువతీయువకులు అనుసరిస్తూ వాటి నుంచి మానసిక ఉపశమనాన్ని పొందుతున్నారు.

కిడల్టింగ్ వల్ల బ్రెయిన్ డొపొమైన్ అనే హ్యాపీ హార్మోన్ ను విడుదల చేస్తుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. చిన్నపిల్లల ఆటలు, అలవాట్లు యువతరానికి మానసిక ఊరటతో పాటు ఉల్లాసాన్ని ఇవ్వడం కిడల్టింగ్ లోని మరో విశేషం. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఇలాంటి సంఘటనలు చాలా బయటకు వచ్చాయి. యాంగ్జియిటీని, ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొందరు అడల్ట్స్ చిన్నతనంలోని తమ అలవాట్లను తిరిగి కొనసాగించడం ప్రారంభించారు. ఉదాహరణకు ఇలాంటి కిడల్ట్స్ ఎందరో తిరిగి సైకిల్ తొక్కడాన్ని ప్రారంభించారు. అది కాస్తా కొంతమందిలో పెద్ద ప్యాషన్ గా మారింది కూడా. దీంతో ఇతర సైకిలిస్టులతో కలిసి సైక్లింగ్ కు సంబంధించిన రకరకాల కార్యక్రమాలలో సైతం కిడల్ట్స్ పాలుపంచుకోవడం ప్రారంభించారు. ఉద్యోగం చేస్తున్నా కూడా వారాంతంలో సైకిల్ మీద దగ్గరలో ఉన్న గ్రామాలు, ఊళ్లకు వెళ్లి గడుపుతున్నారు. ఇది తమకు ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తోందని వారంటున్నారు.

బాల్యంలోని ఎన్నో మధుర ఊహలను ఈ అలవాట్లు తిరిగి తమకు గుర్తుకు తెస్తున్నాయని చెప్తున్నారు. ‘ నేను సైక్లింగ్ ను తిరిగి ప్రారంభిచినపుడు చిన్నతనంలో మా తాత సైకిల్ వెనక నన్ను కూర్చోబెట్టుకుని తీసుకువెళ్లిన రోజులు గుర్తుకువచ్చాయి’ అని యువ లాయర్ గా పనిచేస్తున్న ఒక కుర్రాడు అన్నాడు. తమ అంతరాంతరాల్లో దాగున్న బాల్యానికి తిరిగి కిడల్ట్స్ ఇలా ప్రాణం పోస్తున్నారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా తయారవుతున్నారు. కిడల్టింగ్ తమకు మూడ్ ఎన్ హాన్సర్ గా పనిచేస్తోందని కొందరు అంటే, మరికొందరు తమలోని ఒత్తిడిని ఈ అలవాటు తగ్గిస్తోందని చెప్తున్నారు. బాల్యంలోని క్రియేటివ్ అలవాట్లను కిడల్టింగ్ తిరిగి బయటకు తెస్తోందని మరికొందరు అడల్ట్స్ చెప్పుకొచ్చారు.

చిన్నతనం నాటి పనులు చేయడం మాలో మజాను రేపడంతో పాటు పసితనపు ఆనందాన్ని మొలకలేసేలా చేస్తోందని ఇంకొందరు చెప్తున్నారు. ఇలాంటి కిడ్ యాక్టివిటీస్ చేపట్టడం వల్ల కుర్రాళ్ల మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలయి వాళ్లు మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారని మానసికనిపుణులు చెప్తున్నారు. బాల్యంలో చేసిన కలరింగ్, బిల్డింగ్ బ్లాక్స్ నిర్మాణం వంటి ఆటలు, అలవాట్లు జీవితంలో ఎదరయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే దానిని నేర్పుతున్నాయంటున్నారు కిడల్ట్స్. కిడల్టింగ్ తమలో సృజనాత్మక ఆలోచనాధోరణిని కూడా పునరుద్ధరిస్తోందని మరికొందరు అన్నారు. తమ ఆలోచనా ధోరణిని సైతం ఇది వేగవంతం చేస్తోందని ఇంకొందరు చెప్తున్నారు. ఇలా మూడ్ బోర్డు యాక్టివిటీస్‌తో యువతీయువకులు బాల్యపు జ్ఘాపకాలలో తిరిగి ఎంతో ఆనందంగా విహరిస్తున్నామని కిడల్ట్స్ అంటున్నారు.
