2023 సెప్టెంబర్ 21 నుండి 27 వరకు పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో, దృఢసంకల్పంతో నిర్వహిద్దాం!
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడించండి! అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ వర్గ పోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని సంఘటితం-విస్తృతం చేస్తూ పార్టీని బలోపేతం చేయండి!
పార్టీ సంఘటితీకరణ క్యాంపెయన్ ను విజయవంతం చేయండి!
పార్టీ 19వ వార్షికోత్సవాల సందర్భంగా పార్టీ శ్రేణులకు, విప్లవ ప్రజా నిర్మాణాలకు, విప్లవ ప్రజానీకానికి సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సందేశం!
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
2023 సెప్టెంబర్ 21 నుండి 27 వరకు పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో, దృఢసంకల్పంతో నిర్వహిద్దాం! బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడించండి! అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ వర్గ పోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని సంఘటితం-విస్తృతం చేస్తూ పార్టీని బలోపేతం చేయండి!
పార్టీ సంఘటితీకరణ క్యాంపెయన్ ను విజయవంతం చేయండి!
ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా!
భారతదేశ నూతన ప్రజాస్వామిక విప్లవానికి నాయకత్వం వహిస్తున్న కార్మికవర్గ అగ్రగామి దళమైన మన పార్టీ – భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ని స్థాపించి 2023 సెప్టెంబర్ 21 నాటికి 19 సంవత్సరాలు నిండుతాయి. ఈ సందర్భంగా మన పార్టీ కేంద్రకమిటీ, 19వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా అటవీ, మైదాన, పట్టణ ప్రాంతాల్లో విప్లవోత్సాహంతో, దృఢసంకల్పంతో నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులను, విప్లవ ప్రజా నిర్మాణాలను, విప్లవ ప్రజానీకానికి పిలుపునిస్తోంది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడించాల్సిందిగా, అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ వర్గ పోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని సంఘటితం, విస్తృతం చేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా, పార్టీ సంఘటితీకరణ క్యాంపెయిన్ ను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తోంది.
మార్క్సిజం-లెనినిజం-మావోయిజం వెలుగులో భారత విప్లవ నిర్మాతలు, మన పార్టీ సంస్థాపక నాయకులు, ఉపాధ్యాయులు కామ్రేడ్స్ చారుమజుందార్, కన్హాయ్ చటర్జీలు రూపొందించిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాలో మన దేశంలో కుళ్లిపోయిన అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేసే, ప్రపంచవ్యాప్తంగా సోషలిజం – కమ్యూనిజాన్ని స్థాపించే మహత్తర లక్ష్యాల సాధనకై దృఢసంకల్పంతో మన పార్టీ కృషి చేస్తోంది. దేశంలో సామ్రాజ్యవాదులకు, దాని దళారీ పాలకవర్గాలకు పెనుసవాలుగా నిలిచింది. దీంతో మన పార్టీని, విప్లవోద్యమాన్ని రూపుమాపడం వారికి అనివార్యమైపోయింది. ఇందుకోసం వారు దశాబ్దాలుగా పలు విప్లవ ప్రతిఘాతక, వ్యూహాత్మక దాడులు చేసి విఫలమయ్యారు. దీంతో గత అక్టోబర్ నెలలో ‘సూరజ్ కుండ్ చింతన్ శిబిర్’లో మరో విప్లవ ప్రతిఘాతక పథకాన్ని రూపొందించారు. దేశంలోని పీడిత వర్గాలపై, సెక్షన్లపై, జాతులపై పాశవికంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడులను ధైర్యసాహసాలతో ఎదుర్కొంటూ ఈ సంవత్సర కాలంలో 31 మంది మహిళా కామ్రేడ్స్ తో సహా 90 మంది కామ్రేడ్స్ అమరులైనారు. వీరిలో మన పార్టీ కేంద్రకమిటీ,
పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ కటకం సుదర్శన్ (ఆనంద్, దూల), రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్ ఎల్.ఎస్.ఎన్. మూర్తి (ఆంధ్రప్రదేశ్), చండీ సర్కార్ (పశ్చిమ బంగ్), బిహార్ – ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యులు కామ్రేడ్స్ గౌతమ్ పాశ్వాన్, చార్లీలు వున్నారు. దండకారణ్యంలో విప్లవ ప్రజా కళాకారుడు కామ్రేడ్ శంకర్ రావు, ఆయుధాల తయారీ రంగంలో నిపుణుడు కామ్రేడ్ వసంత్ అమరులయ్యారు. వీరితో పాటు మరో ముగ్గురు డీవీసీ సీవైపీసీ సభ్యులు, నలుగురు సబ్ జోనల్ కమిటీ సభ్యులు, 17 మంది ఏసీ/పీపీసీ సభ్యులు, పార్టీ / పీఎల్ జీఏ సభ్యులు 22 మంది, ప్రజా నిర్మాణాల కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు, ఇతరులు 32 మంది, వీరితో పాటు దేశవ్యాప్తంగా బహిరంగ ప్రజా ఉద్యమాలలో పని చేసే పలువురు విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామిక ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, మేధావులు, విప్లవ సానుభూతిపరులు, మిత్రులు విప్లవోద్యమాన్ని పురోగమింపజేసే లక్ష్యంతో కృషి చేస్తూ కన్నుమూసారు. పార్టీ 19వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజల విముక్తి కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరులందరికీ కేంద్రకమిటీ తలవంచి వినమ్రంగా విప్లవ జోహార్లర్పిస్తున్నది.
అంతర్జాతీయంగా, ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీ సంస్థాపక చైర్మన్ కామ్రేడ్ జోస్ మారియా సిసాన్ అనారోగ్యంతో అమరులయ్యారు. ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీ కేంద్రకమిటీ ఎగ్జిక్యుటివ్ కమిటీ చైర్మన్ కామ్రేడ్ లాన్ (బెనిటో టియాంజోన్), పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బగోంగ్- టావో (విల్మా ఆస్ట్రియా)లను శత్రువు పక్కా సమాచారంతో ఎనిమిది మంది సహయోధులతో పాటు పట్టుకొని హత్య చేసాడు. ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు ఎంపోగ్ (ఇమ్యాన్యువల్ ఫెర్నాండెజ్) అనారోగ్యంతో కన్నుమూసారు. శత్రు డ్రోన్ దాడిలో ఆ పార్టీ కేంద్రమిటీ సభ్యురాలు కామ్రేడ్ ఎలే (హెలినితా పర్దాలిస్)తో పాటు ఐదుగురు కామ్రేడ్స్ అమరులయ్యారు. వారి అమరత్వం ఫిలిప్పీన్స్ విప్లవోద్యమానికి, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి చాలా నష్టాన్ని కలిగించింది. గ్రీసు కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) ప్రధాన కార్యదర్శి ఆండ్రి ఒగియాజోలవ్, ఆఫ్ఘనిస్తాన్ (మావోయిస్టు) కమ్యూనిస్టు పార్టీ కేంద్రకమిటీలో ముఖ్యమైన సభ్యుడు కామ్రేడ్ సలీం, రీజనల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ ఫర్హద్ అనారోగ్యంతో కన్నుమూసారు. మార్క్సిస్టు-లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీ (టర్కీ/కుర్దిస్తాన్) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ అహ్మెట్ సోర్స్ (జెకీ గుర్బుజ్), కుర్దిస్తాన్ సాయుధ విప్లవ దళాల యువ కమాండర్ కామ్రేడ్ ఫిరాత్ నేవాల్ (జగుర్ నమోగ్లూ) శత్రు డ్రోన్ దాడిలో అమరులయ్యారు. ఈ గొప్ప కార్మికవర్గ నాయకులతో పాటు ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగంగా వివిధ దేశాలలో కొనసాగుతున్న నూతన ప్రజాస్వామిక, సోషలిస్టు విప్లవాలలో, వివిధ సామ్రాజ్యవాద వ్యతిరేక, జాతి విముక్తి పోరాటాలలో, ప్రజాతంత్ర, దేశభక్తి ఉద్యమాలలో ప్రాణాలను త్యాగం చేసిన యోధులందరికీ కేంద్రకమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంది. అమరులు నెలకొల్పిన కార్మికవర్గ ఆదర్శాల నుండి ప్రేరణ పొందుతూ, వారి నిస్వార్థ త్యాగాలను ఎత్తిపడుతూ, వారు నడచిన విప్లవ మార్గంలో దృఢంగా నిలబడి అంతిమ లక్ష్యం సాధించే వైపుగా ముందుకు సాగుతూ చివరి శ్వాస వరకు పోరాడుదామని శపథం చేద్దాం..
ఈ సంవత్సర కాలంలో విప్లవ ప్రతిఘాతక శత్రు దాడులను వీరోచితంగా ఎదుర్కొంటూ, వాడి పథకాలను వమ్ము చేస్తూ యుద్ధ రంగంలో గాయపడిన వీర యోధులందరి పట్ల కేంద్రకమిటీ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తోంది. వారు వీలైనంత తర్వగా కోలుకుని ప్రజాయుద్ధ మైదానంలోకి దుముకుతారని ప్రగాఢంగా విశ్వసిస్తోంది. పలువురు నాయకత్వ కామ్రేడ్స్ తో పాటు అనేక మంది కామ్రేడ్స్ శత్రు చేతికి చిక్కి చిత్రహింసలు అనుభవించి, తప్పుడు కేసులు మోపబడి జైళ్లలో బంధించబడినారు. వీరంతా కారాగారాలలో సైతం విప్లవ పతాకను సమున్నతంగా ఎత్తిపడుతున్నారు. ఆ కామ్రేడ్స్ అందరికీ విప్లవ జేజేలు చెబుతోంది. వారు త్వరగా జైళ్ల నుండి విడుదలయ్యేలా వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇస్తోంది.
కేంద్రకమిటీ గత యేడాది పార్టీ 18వ వార్షికోత్సాల సందర్భంగా వివిధ ప్రాంతాలలో నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవ ప్రతిఘాతక శత్రు దాడిని ఎదుర్కొంటూ విప్లవోద్యమాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాజకీయ నిర్మాణ సమీక్షలో చేపట్టిన కేంద్ర కర్తవ్య సాధన కోసం ఐదు కర్తవ్యాలను రూపొందించింది: సమాధాన్-ప్రహార్ దాడిని ఓడిస్తూ ఉద్యమాన్ని పురోగమింపజేసే లక్ష్యంతో పార్టీ సంఘటితీకరణ క్యాంపెయిన్ ను కొనసాగించడం; సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటాలను తీవ్రతరం చేయడం ; పీ.ఎల్.జీ.ఏ.ను బలోపేతం చేయడం; బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా, నూతన ప్రజాస్వామిక భారతదేశం కోసం పెద్దయెత్తున ప్రజా ఆందోళనలను నిర్మించడం; అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కృషిని కొనసాగించడం. ఈ కర్తవ్యాల సాధనలో గడచిన సంవత్సర కాలంగా విభిన్న రంగాలలో మన పార్టీ సాధించిన ప్రగతిని చూద్దాం.
పార్టీ: భారత నూతన ప్రజాస్వామిక విప్లవ కేంద్ర కర్తవ్య సాధన కోసం కేంద్రకమిటీ రూపొందించిన రాజకీయ తీర్మానాలలో, శత్రు విప్లవ ప్రతిఘాతక సమాధాన్ – ప్రహార్, సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడి పథకాలను ఓడించడంపై విడుదల చేసిన సర్క్యులర్లలో దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని పురోగమింపజేసేందుకు ఎత్తుగడలను అందించింది. శక్తిమేరకు ఈ ఎత్తుగడలను అమలు చేస్తూ పార్టీ, పీ.ఎల్.జీ.ఏ., ఐక్య సంఘటన – ఈ మూడు విప్లవ అద్భుత ఆయుధాలను పటిష్టపరుచుకోవడానికి అటవీ, మైదాన, పట్టణ ప్రాంతాలలో పార్టీ సంఘటితీకరణ క్యాంపెయిన్ కొనసాగింది. 2021లో సీసీ నూతనంగా ఆమోదించిన కేంద్ర రాజకీయ నిర్మాణ సమీక్ష (సీసీ పీఓఆర్), భారతదేశ ఉత్పత్తి సంబంధాలలో వచ్చిన మార్పులు-మన రాజకీయ కార్యక్రమం (ఎంఓపీ), జాతుల సమస్య డాక్యుమెంట్లతో పాటు ఆవశ్యకమైన వివిధ ఇతర అంశాలపై వివిధ స్థాయిల కేడర్లకు క్లాసులు జరిగాయి. వివిధ ప్రాంతాలలో నిర్దిష్టంగా ఎంచుకున్న అంశాలపై కూడా క్లాసులు, సమిష్టి అధ్యయనం నిర్వహిస్తూ కేడర్ల శక్తి సామర్థ్యాలను పెంపొందించే కృషి కొనసాగింది. నూతన డాక్యుమెంట్లలో పొందుపరచిన విషయాలను ఆచరణలో తీసుకెళ్లడం కోసం కొన్ని చోట్ల నిర్దిష్ట పథకాలను, కార్యక్రమాలను చేపట్టి అమలులోకి తీసుకెళ్లగలుతున్నారు.
చాలా రాష్ట్రాలలో వివిధ పార్టీ కమిటీల నుంచి మొదలుకుని ప్రాథమిక పార్టీ యూనిట్ల వరకు మీటింగులు రెగ్యులర్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కార్యాచరణ పథకాలను గా రూపొందించుకుంటూ, సమీక్షించుకుంటూ పని చేసారు. మహిళా ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, ఉద్యమంలో, పార్టీలో పితృస్వామ్య ధోరణుల వల్ల మహిళా కామ్రేడ్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై, వాటికి పరిష్కారాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవడం, పార్టీ కమిటీలు వాటిని అమలు చేయడం అనే ప్రక్రియ వారి, మొత్తం ఉద్యమ అభివృద్ధికి తోడ్పడుతున్నది. ఈ విధంగా విప్లవ మహిళా ఉద్యమంలో, ప్రజాయుద్ధంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేసారు. కార్పెట్ సెక్యూరిటీ మధ్య పని చేసేందుకు అనుగుణంగా తాత్కాలికంగా, శాశ్వత ప్రాతిపదికన మరి కొన్ని నిర్మాణాలను చేపట్టారు. ఈ నిర్మాణాలకు కొన్ని చోట్ల క్లాసులు నిర్వహించారు. విప్లవ ప్రతిఘాతక శత్రు దాడులను ప్రతిఘటిస్తూ ఉద్యమాన్ని నిలబెట్టుకునే కృషి జరిగింది. రాష్ట్ర ప్లీనాలు జరగని చోట జరిపి పీఓఆర్ లను ఆమోదించడం, ఉద్యమ పర్ స్పెక్టివ్ లను రూపొందించుకోవడం అనుకూలాంశం. ఈ మొత్తం క్రమంలో కొందరిని పై కమిటీలలోకి ప్రమోట్ చేస్తూ నూతన నాయకత్వాన్ని ముందుకు తెచ్చారు. నిష్క్రియమైన శక్తులను తొలగించి, ప్రజా ఉద్యమాలలో ముందుకు వస్తున్న నూతన శక్తులకు శిక్షణ గరిపి, పార్టీలో సంఘటితం చేసేందుకు కృషితో పాటు నూతన ఆక్టివిస్టు గ్రూపుల నిర్మాణం, నూతన సభ్యత్వాన్ని పెంచుకునే కృషి, నూతన పార్టీ సెల్స్ నిర్మాణం, దెబ్బతిన్న పార్టీ సెల్స్ పునర్నిర్మాణ కృషి, వారి నుండి పీఆర్ లను అభివృద్ధి చేసుకునే కృషి జరిగాయి. ఐక్య పార్టీ ఆవిర్భావం తర్వాత నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో అశువులు బాసిన మన పార్టీ 21 మంది కేంద్రకమిటీ సభ్యుల సంక్షిప్త జీవిత చరిత్రలను కేంద్రకమిటీ రెండు సంకలనాలుగా మూడు భాషల్లో ప్రచురించి విడుదల చేసింది.
ఈ సంవత్సర కాలంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ కర్తవ్యాలను ముందుకు తీసుకుపోవడంలో భాగంగా మన కేంద్రకమిటీ అంతర్జాతీయ రంగంలో వివిధ రూపాలలో కృషిని విస్తరించింది. ఇటీవల ఏర్పడిన ఇంటర్నేషనల్ కమ్యూనిస్టు లీగ్ (ఐసీఎల్) స్థాపన పై, నేపాల్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ స్థాపనపై మన పార్టీ వైఖరిని తెలియజేసింది. ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీ సంస్థాపక చైర్మన్ కామ్రేడ్ జోస్ మారియా సిసాన్, తదితర కామ్రేడ్స్ స్మృతిలో జనవరి 16న అంతర్జాతీయ సంస్మరణ దినం, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మేడే ప్రకటన, అమెరికా సైన్యం-ఫిలిప్పీన్స్ పాలకవర్గాల చేతిలో హత్యకు గురైన ఎగ్జిక్యుటివ్ చైర్మన్ కామ్రేడ్ లాన్, కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బగోంగ్-టావోలతో పాటు మరో ఎనిమిది మంది పార్టీ, ఎన్ పీ ఏ వీర యోధుల స్మృతిలో జూన్ 15-16లలో అంతర్జాతీయ సంస్మరణ దినాలు, ఇండియా, ఫిలిప్పీన్స్ విప్లవోద్యమాలలో అమరులైన కామ్రేడ్స్ స్మృతిలో జులై నెల అంతటా సంస్మరణ క్యాంపెయిన్, కామ్రేడ్ ఆనంద్ (కటకం సుదర్శన్) సంస్మరణ, భారతదేశ రాజకీయ ఖైదీల విడుదలను డిమాండ్ చేస్తూ ఐ.సీ.ఎస్.పీ.డబ్లు.ఐ. తో మన పార్టీ సమన్వయించుకుంటూ
పిలుపులు ఇవ్వడంలో, మన ఉద్యమ ప్రాంతాలలో వాటిని అమలు చేయడంలో చొరవగా కృషి చేసింది. ప్రపంచవ్యాప్తంగా 15 ఎంఎల్ఎం పార్టీలు ప్రపంచ యుద్ధ/అణు యుద్ధ ప్రమాద వ్యతిరేక అంతర్జాతీయ వేదికను నిర్మాణం చేయాలని నిర్ణయించడం, అందులో మన పార్టీ భాగస్వామ్యం కావడం, 2023 జనవరి మొదటివారంలో సంయుక్త ప్రకటన వెలువడడం ఒక మంచి పరిణామం. ఈ అంతర్జాతీయ కృషి అంతటిలో ఐ.సి.ఎస్.పీ.డబ్లు.ఐ. సంఘీభావ కృషి శ్లాఘనీయమైనది. ప్రపంచంలోని వివిధ ఎంఎల్ఎం పార్టీలు కూడా ఇందులో భాగస్వామ్యం వహించాయి. ఈ కృషి ప్రపంచ సోషలిస్టు విప్లవ శక్తుల పున:సమీకరణకూ, సంఘటితీకరణకూ, విప్లవోద్యమాల్ని పెంపొందించడానికి తప్పక తోడ్పడుతాయి.
పీ.ఎల్.జీ.ఏ.: ఈ సంవత్సర కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవ ప్రతిఘాతక సమాధాన్ – ప్రహార్, ఆ తదుపరి సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకాలను అమలు చేయడంలో భాగంగా దేశంలో విప్లవోద్యమానికి బలంగా వున్న కేంద్రాలపై కేంద్ర పారామిలిటరీ, రాష్ట్ర స్పెషల్ పోలీసు, కమాండో బలగాలు కేంద్రీకరించి దాడులు చేసాయి. శత్రుదాడిని ఓడించే లక్ష్యంతో మన ఉద్యమ ప్రాంతాలంతటా మన పార్టీ నాయకత్వంలో పీ.ఎల్.జీ.ఏ. బలగాలు శత్రు భీషణ దాడులను తిప్పికొడుతూ తరతమ స్థాయిల్లో గెరిల్లా యుద్ధం కొనసాగించాయి. తాత్కాలిక వెనకంజ స్థితిని అధిగమించి విప్లవోద్యమాన్ని పురోగమింపజేసేందుకు తోడ్పడేలా సాపేక్షికంగా ప్రజా కృషిని పెంపొందించాయి. ప్రజలను సామ్రాజ్యవాద వ్యతిరేక, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటాలలోకి సమీకరించి, సంఘటితం చేయడంలో, మిలిటెంట్ ప్రజా పోరాటాలను నిర్మించడంలో క్రియాశీలంగా భాగస్వామ్యం వహించాయి.
ఈ సంవత్సర కాలంలో వివిధ గెరిల్లాజోన్లు, ఎర్ర ప్రతిఘటనా ప్రాంతాలలో పీ.ఎల్.జీ.ఏ. బలగాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కిరాయి పారామిలిటరీ, కమాండో, స్పెషల్ పోలీసు బలగాలపై చేసిన గెరిల్లాయుద్ధ చర్యలలో 64 మంది పోలీసులను నిర్మూలించి 154 మందిని గాయపరిచాయి. ప్రజా వ్యతిరేకులైన 13 మంది రాజకీయ నాయకులను, 28 మంది పోలీసు ఇన్ ఫార్మర్లను, ఒక విప్లవ విద్రోహిని, ముగ్గురు ప్రజా శత్రువులను నిర్మూలించాయి. కార్పెట్ సెక్యూరిటీని విస్తరిస్తూ ఉద్యమ ప్రాంతాలలో డజన్ల కొలదీ పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాల క్యాంపులను ఏర్పాటు చేస్తూ మన పార్టీని, విప్లవోద్యమాన్ని తుదముట్టించడానికి శత్రువు చేస్తున్న దుష్ట ప్రయత్నాలను పీ.ఎల్.జీ.ఏ. తిప్పికొట్టింది.
శత్రువు ఝార్ఖండ్ లో ‘కొల్హన్ ప్రాంతాన్ని మావోయిస్టుల నుంచి విముక్తి చేసే లక్ష్యం’తో 2022 సెప్టెంబర్ నుంచి తీవ్రతరం చేసిన విప్లవ ప్రతిఘాతక యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ చిన్న ప్రాంతంలో 13 పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసారు. గ్రామాలపై దాడులు, అమాయక ప్రజలను చితకబాదడం, నిరుపేద ముండా ఆదివాసులు చిరు ఆస్తులను దోచుకోవడం, అరెస్టు చేసి జైలుకు పంపడం, ప్రజలను, విప్లవకారులను చంపడం, మహిళలపై అత్యాచారాలు చేయడం
ద్వారా భయోత్పాతాన్ని సృష్టించారు. పీ.ఎల్.జీ.ఏ బలగాలు ఈ క్రూరమైన దాడిని సాహసోపేతంగా తిప్పికొట్టాయి. లోవబేడా ఆంబుష్, తుంబహాకా ఆంబుష్, తుంబహాకా బూబీట్రాప్, హాథీ బురూ ఆంబుష్, తదితర పలు గెరిల్లా చర్యలలో సుమారు 15 మంది పోలీసులను నిర్మూలించి, 90 మంది పోలీసులను గాయపరిచాయి. దీంతో శత్రు బలగాలు దూకుడుతనానికి ఒక మేరకు అడ్డుకట్టపడింది. పీ.ఎల్.జీ.ఏ బలగాలు ప్రజా మిలీషియా, విప్లవ ప్రజల క్రియాశీల సహకారంతో నిర్వహించిన ప్రజాయుద్ధం, ప్రజా ప్రతిఘటనా పోరాటం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయ, విప్లవ ప్రతిఘాతక క్రూరమైన యుద్దాన్ని దీటుగా ప్రతిఘటిస్తూనే వున్నాయి.
ఈ సంవత్సరం టీసీఓసీలో భాగంగా శత్రు వైమానిక దాడులను ఎదుర్కొనేలా పీ.ఎల్.జీ.ఏ. నూతన అనుభవం సంపాదించుకుంది. 2023 జనవరిలో దండకారణ్యంలో శత్రువు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నిర్వహించిన పెద్ద వైమానిక దాడిని పీ.ఎల్.జీ.ఏ. బలగాలు వీరోచితంగా తిప్పికొట్టాయి. భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు ఎన్.ఎస్.జీ., గరుడ కమాండోలను నిర్మూలించి, ఆరుగురిని గాయపరిచాయి. గెరిల్లా ప్రతిఘటనలో ఒక హెలికాప్టర్ పూర్తిగా, మరొక హెలికాప్టర్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దాడిలో ఒక మహిళా కామ్రేడ్ అమరురాలైంది. దండకారణ్యంలో జేగుర్ గుండ- కుండేర్ ఆంబుష్, అరన్ పుర్ ఆంబుష్ తదితర చర్యలలో 26 మంది పోలీసులను నిర్మూలించి, 35 మందిని గాయపరిచారు. బిహార్-ఝార్ఖండ్, తూర్పు బిహార్- ఈశాన్య ఝార్ఖండ్ స్పెషల్ ఏరియాలలో, తదితర గెరిల్లా జోన్లలో మరి కొన్ని చిన్న, చిన్న గెరిల్లా చర్యలు జరిగాయి.
ఈ విధంగా 2023లో చేపట్టిన ఎత్తుగడల ఎదురుదాడి క్యాంపెయిన్ (టీసీఓసీ) కొన్ని ప్రాంతాలలో విజయవంతం కాగా, మరి కొన్ని చోట్ల పాక్షికంగా విజయవంతమైంది. శత్రు దాడుల మధ్యనే స్థానిక వనరులపై ఆధారపడి కొంత మేరకు ఇంప్రూవైజ్డ్ ఆయుధాలను, మందుగుండు తయారు చేసుకోవడం, శత్రువుపై ప్రయోగించడం ఇందులో చెప్పుకోదగినది. ఈ టీసీఓసీలో గెరిల్లా యుద్ధ నియమాలను అమలు చేస్తూ, పథకం ప్రకారం గెరిల్లా యుద్ధాన్ని సరిగా నిర్వహించి వుంటే మరింత ఎక్కువ సంఖ్యలో శత్రు నిర్మూలన, ఆయుధాల స్వాధీనం సాధ్యమై ఉండేది. ఏది ఏమైనా దేశంలో మన పార్టీ నాయకత్వంలో వివిధ ఎర్ర ప్రతిఘటనా ప్రాంతాలలో, గెరిల్లా జోన్లలో గెరిల్లా యుద్ధంలో సాధించిన ఈ విజయాలు మన విప్లవ క్యాంపులో నూతనోత్సాహాన్ని పెంపొందించడానికి, శత్రు దాడిని ఒక మేరకు నిలువరించడానికి తోడ్పడ్డాయి.
పీ.ఎల్.జీ.ఏ. బలగాలను బలోపేతం చేసేందుకు పార్టీ సాధ్యమైన చోట్ల పలు రాజకీయ తరగతులు, మిలిటరీ శిక్షణా క్యాంపులు, ప్రత్యేక మహిళా మిలిటరీ శిక్షణా క్యాంపులు నిర్వహించింది. వారికి పార్టీ మౌలిక డాక్యుమెంట్లపై ప్రాథమిక అవగాహనను కల్పించే కృషి జరిగింది. వివిధ రకాల కంబాట్ స్కిల్స్ పై, టెక్నికల్ స్కిల్స్ పై, ఇంప్రూవైజ్డ్ ఆయుధాలు వినియోగంపై, డ్రోన్ దాడుల నుండి రక్షణ డ్రిల్స్, కౌంటర్ డ్రిల్స్ ను వివిధ స్థాయిల్లో పీ.ఎల్.జీ.ఏ.లోని ప్రధాన, ద్వితీయ బలగాలకు, పునాది బలగాలైన మిలీషియాకు ట్రైనింగ్ అందిస్తున్నారు. ఇందులో వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలు, మిలిటరీ కమిషన్ల, కమాండ్లు, మిలిటరీ ఇన్ స్ట్రక్టర్ టీములు, వివిధ డిపార్టుమెంట్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. నుండి దిగజారిపోయిన ద్రోహులను, శత్రువు చేసే దుష్ప్రచారాన్ని (మానసిక యుద్ధాన్ని) ప్రజలలో ఎండగడుతూ పార్టీని, ప్రజలను, ఉద్యమాన్ని పరిరక్షించుకుంటున్నది. కొన్ని చోట్ల రిక్రూట్ మెంట్ క్యాంపెయిన్లు నిర్వహించి చెప్పుకోదగిన సంఖ్యలోనే నూతనంగా యువతీ యువకులను పీ.ఎల్.జీ.ఏ.లోకి రిక్రూట్ చేసుకోవడమైంది. వారికి రాజకీయ-సైనిక శిక్షణ కొనసాగుతున్నది.
ఐక్యసంఘటన: బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్.ఎస్.ఎస్.-బీజేపీ మోదీ ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవోద్యమంపై, పీడిత ప్రజలపై కొనసాగిస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా, వాటి ప్రజా వ్యతిరేక ప్రపంచీకరణ విధానాలను ఎండగడుతూ ఈ సంవత్సర కాలంలో ప్రజాసంఘాలు, వ్యూహాత్మక, ఎత్తుగడలపరమైన ఐక్యసంఘటనా నిర్మాణాలు నిరంతరం సాహసోపేతంగా పీడిత వర్గాల, పీడిత సెక్షన్ల ప్రజలను పెద్ద సంఖ్యలో పలు పోరాటాలలో కదిలించాయి, రాజకీయ ప్రచారం చేసాయి. శత్రువు విస్తరిస్తున్న కార్పెట్ సెక్యూరిటీ నడుమనే ప్రజాపునాదిని పెంచుకునేందుకు కృషి చేసాయి. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం, కార్పొరేటీకరణ, సైనికీకరణ, బలవంతపు విస్థాపన, విద్యార్థుల, రైతులు, మహిళల, కార్మికుల ముఖ్యమైన ప్రజా సమస్యలపై విశాల ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు, బలోపేతం విస్తృతం చేసేందుకు కృషి చేసాయి.
దేశవ్యాప్తంగానూ, వివిధ విప్లవోద్యమ ప్రాంతాలలోనూ జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాలు, టైగర్ రిజర్వులు, గనులు, డ్యాములు, కంపెనీలు, స్మార్ట్ సిటీలు, పర్యటన కేంద్రాల నిర్మాణాల కారణంగా జరిగే బలవంతపు విస్థాపనకు వ్యతిరేకంగా, విప్లవ ప్రతిఘాతక సమాధాన్ – ప్రహార్, సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడి పథకాలలో భాగంగా రోడ్లు, వంతెనల నిర్మాణానికి, పోలీసు క్యాంపుల ఏర్పాటుకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా, ఆదివాసీ, గైరాదివాసీ ప్రజలు పోరాడుతున్నారు. బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర చోట్ల సభలు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు పోలీసు క్యాంపుల ముందు బైఠాయించి మిలిటెంటు పోరాటాలు చేసారు. దండకారణ్యంలో 26 ప్రదేశాల్లో నిరవధికంగా ప్రజా పోరాటాలు కొనసాగుతున్నాయి. ఇందులో సిలింగేర్ ప్రజా పోరాటం ఆదివాసీ నిరసన-ప్రతిఘటనకు ప్రతీకగా నిలిచింది. దీనికి రెండేళ్లు దాటింది. వెచ్చాఘాట్, బుర్జీ-పూస్ నార్, వెచ్చాపాల్, సింగారం, పూసుగుప్ప ప్రజా పోరాటాలు ప్రారంభమై సంవత్సరం దాటిపోయింది. తోడ్ గట్ట ప్రజా పోరాటం అనేక నెలలుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఆదివాసులు అటవీ భూములను స్వాధీనం చేసుకుని పంచుకున్నారు.
ముఖ్యంగా జల్-జంగల్-జమీన్ పై ఆదివాసులు-మూలవాసులదే అధికారం అనే నినాదంతో ఆదివాసులు సంఘటితమవుతూ మిలిటెంటు ఆందోళనలకు దిగారు. అగస్టు 9 విశ్వ ఆదివాసీ దివస్, ఆయా రాష్ట్రాలలో స్థానికంగా నిర్వహించే హూల్ దివస్ (ఝార్ఖండ్), భూంకాల్ దివస్ (ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర) వంటి పలు పోరాటదినాల సందర్భంగా ఆదివాసులు పెద్ద సంఖ్యలో సమీకృతులై తమ దృఢసంకల్పాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. 2022 జులైలో మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల, దేశీయ దళారీ నిరంకుశ / క్రోనీ కాపిటలిస్టు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలను ఈడేర్చేందుకు జారీ చేసిన వన సంరక్షణ నియమావళి ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆదివాసీ సంఘాల, ఇతర సామాజిక సంస్థల నాయకత్వంలో పెద్దయెత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి.
మైదాన, పట్టణ ప్రాంతాలలో భీమా కోరేగాం వంటి కేసులలో అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా, రాజకీయ ఖైదీల విడుదలకై ప్రచార, ఆందోళనలు వివిధ స్థాయిల్లో కొనసాగించాయి. రైతుల సమస్యల పరిష్కారానికి, అధిక ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. కార్మికుల సమస్యలపై పలు పోరాటాలు నిర్వహించారు. జాతీయ విద్యావిధానం పేరుతో విద్య కాషాయీకరణ-కార్పొరేటీకరణ-ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా, పీజీ వరకు సార్వజనిక విద్యా హక్కు, శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలనే డిమాండుతో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించారు. మత మైనారిటీలపై, దళితులపై, మహిళలపై దాడులు, అత్యాచారాలకు, రాజకీయ నాయకుల ప్రభుత్వ, ప్రజల భూముల కబ్జాకు, వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు, మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. విశ్వవిద్యాలయాలలో హిందుత్వ ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రొఫెసర్లు, టీచర్లు, ఇతర సిబ్బంది ఐక్యంగా పలు పోరాటాలు నిర్వహించారు. అసంఘటిత కార్మిక రంగంలో కృషి కొనసాగింది. ఆశా వర్కర్ల పోరాటాలు, ఆంగన్ వాడీల, సహాయికల, మిథానిన్ల పోరాటాలు, వివిధ ఉపాధ్యాయుల, ఉద్యోగస్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై కదిలిస్తూ, వారిని సంఘటితం చేసే కృషి జరిగింది.
తెలంగాణలో హరితహారం పథకంలో భాగంగా ఆదివాసులను తమ పొలాల నుంచి బేదఖల్ చేయడం, జీఓ నంబర్ 3ను రద్దు చేయడానికి వ్యతిరేకంగా, పోడు భూముల పట్టాలకై సాయుధ పోలీసు బలగాలతో తలపడుతూ ఆదివాసులు పోరాటాలు చేసారు. పేద, మధ్యతరగతి రైతులు సాగు చేసుకుంటున్న పోరంబోకు భూములకు పట్టాలు డిమాండ్ చేసారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు వ్యతిరేకంగా, హైదరాబాద్ లో పేద ప్రజలు తలదాచుకునేందుకు గూడు కోసం మురికివాడలను రక్షించుకునే పోరాటాలలో కదిలారు. బీసీలను ఎస్.టీ. జాబితాలో చేర్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం డ్యాం నిర్వాసితులు నష్టపరిహారం కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు, ఆయా ప్రాంతాల వెనుకబాటుతనానికి కారణమైన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
మహిళా రెజ్లర్లపై అత్యాచారాలను, దండకారణ్యంలో మాడ్ అటవీ ప్రాంతంలో స్నానం చేసే ఆదివాసీ మహిళల నగ్న ఫోటోలను డ్రోన్లతో తీసి శత్రువు ఇంటర్ నెట్ లో పెట్టడాన్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు జరిపాయి. జనవరి, ఏప్రిల్ నెలల్లో దండకారణ్యంలో భారత వాయుసేన గరుడ కమాండో బలగాలు, కేంద్ర పారామిలిటరీ, కమాండో, ఎన్.ఎస్.జీ., రాష్ట్రాల స్పెషల్ పోలీసు బలగాలు సంయుక్తంగా ఆదివాసీ ప్రజలపై, పీ.ఎల్.జీ.ఏ. బలగాల పై చేసిన డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా దేశ, విదేశాలలో పలు విప్లవ, ప్రజాస్వామిక సంస్థలు ఖండించడమే కాకుండా, నిజనిర్ధారణ కమిటీల ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చాయి. దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడే సామాజిక కార్యకర్తలపై ఉపా చట్టాన్ని మోపడానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందుత్వ శక్తులు మత మైనారిటీలపై, ప్రత్యేకించి దళితులు, ముస్లిములు, క్రైస్తవులు, ఆదివాసులు, మహిళలపై విచ్చలవిడిగా .. కొనసాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా పలు పోరాటాలు జరిగాయి.
మణిపుర్ లోని అడవులు, కొండలలో విలువైన ప్రకృతి వనరులను, సహజ సంపదను దేశ విదేశీ కార్పొరేట్లకు అప్పగించే కుట్ర, ఓటు బ్యాంకును పెంచుకునే కుట్రలో భాగంగా మందబలంతో హిందుత్వ ఫాసిస్టులు సాగించే రాజ్య ప్రాయోజిత హత్యాకాండలు, మహిళలపై అమానవీయ అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసం, ప్రార్థనా స్థలాల విధ్వంసంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇందులో యావత్తు పీడిత వర్గాల, సెక్షన్ల, జాతుల ప్రజలు కదులుతున్నారు. మన ఉద్యమ ప్రాంతాలలో విప్లవ ప్రజలు కదిలి నిరసన ప్రదర్శనలు, బంద్ లు నిర్వహించారు.
సమాజంలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభం కారణంగా ఈ అన్ని ఉద్యమాల్లో ఆదివాసులు, దళితులు, రైతాంగం, కార్మికులు, మహిళలు, విద్యార్థి-యువత భాగస్వామ్యం సాపేక్షికంగా పెరిగింది. రాజకీయ చొరవను ప్రదర్శించి చేసిన వివిధ ప్రజా సమస్యలపై పలు విశాల ఐక్యసంఘటనా వేదికలను నిర్మించడంలో చేసిన కృషి అనుకూలమైన ఫలితాలను ఇచ్చింది. పార్టీ మరింత అనుభవం సంపాదించింది. ఆయా స్పెషల్ ఏరియా/స్పెషల్ జోన్/రాష్ట్రాలలో జరిగే ఉద్యమాల మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం ఒక మేరకు పెరిగింది. నూతన శక్తులు ముందుకొచ్చాయి. కొన్ని ప్రాంతాలలో వివిధ ప్రజాసంఘాల నిర్మాణాల సభ్యత్వం పెరిగింది. ఇలాంటి ఐక్యసంఘటనా వేదికల పని విధానం క్రమంగా మెరుగుపడుతోంది. అయితే ఉద్యమాల స్థాయికి అనుగుణంగా సంఘటితీకరణ చేయలేకపోవడం వల్ల కొంతమేరకు మాత్రమే సంఘటితీకరణ జరిగింది.
మన పార్టీ నాయకత్వంలో గెరిల్లాయుద్ధం కొనసాగుతున్న ప్రాంతాలలో గ్రామ స్థాయి నుంచి ఏరియా, జిల్లా స్థాయిల్లో నాలుగు విప్లవ వర్గాల ఐక్యసంఘటనా రూపంగా ఏర్పడిన విప్లవ ప్రజా ప్రభుత్వాలు శత్రు తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే నిలదొక్కుకుని పీడిత ప్రజల రాజ్యాధికారాన్ని నెరుపుతున్నాయి. ప్రజలను వర్గ పోరాటంలోకి సమీకరిస్తూ, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. బూటకపు పార్లమెంటరీ వ్యవస్థకు విప్లవ ప్రజా ప్రభుత్వాలను ప్రత్యామ్నాయ నమూనాగా ప్రజల ముందుంచుతున్నాయి. దీని చుట్టూ పీడిత ప్రజలను పార్టీ సంఘటితం చేస్తూ దీర్ఘకాల ప్రజాయుద్ధాన్ని పురోగమింపజేస్తోంది.
ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా!
సామ్రాజ్యవాదం ప్రపంచీకరణ విధానాల ద్వారా తన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు చేసిన ప్రతీ ప్రయత్నం మరిన్ని తీవ్ర సంక్షోభాలకే దారితీస్తోంది. మార్క్సిస్టు మహోపాధ్యాయుడు లెనిస్ ఈ విషయాన్ని సామ్రాజ్యవాదం ఆవిర్భవించినప్పుడే హెచ్చరించాడు, దాని పతనం అనివార్యమని ప్రకటించాడు. సామ్రాజ్యవాదం సృష్టించిన పలు సంక్షోభాలు దాని విధ్వంసకర అభివృద్ధి నమూనా ఫలితమే. ఇందులో భాగంగానే ప్రపంచ రుణం ప్రపంచ వినాశనాన్ని ఆపటం సాధ్యం కానంతగా మహా పర్వతంలా పెరిగిపోయింది. ప్రపంచ ద్రవ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభం ముంగిటకు చేరుకుంది. అత్యాధునిక టెక్నాలజీపై ఆధారపడి, తీవ్ర ఆర్థిక అసమానతల పునాదిపై జరుగుతున్న ఆర్థిక వృద్ధిని అదుపు చేయకుండా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కేంద్ర బ్యాంకులు చేసే ప్రయత్నాలు ఆర్థిక సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. ప్రపంచంలో బహుళ ధృవ ప్రపంచం ప్రబలం కావడంతో ప్రపంచ కరెన్సీగా అమెరికా డాలర్ కథ ముగింపుకు వస్తోంది. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తో పాటు, బయోటెక్, నానోటెక్, రోబోటిక్స్ ‘మానవహనన టెక్నాలజీలు’గా పరిణమించాయి. వీటి ద్వారా జరిగే పరిణామాలను అర్థం చేసుకునే లోపే మానవజాతి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం వెన్నాడుతోంది. ప్రపంచంలో యుద్ధాలు, ఘర్షణలు, వేధింపులు, మానవహక్కుల ఉల్లంఘనల కారణంగా బలవంతపు వలస జనాభా సంక్షోభం దాదాపు 11 కోట్ల మంది శరణార్థులతో వికటరూపం దాల్చడం, ఈ సంఖ్య వేగంగా పెరుగుతుండడంతో అది సామ్రాజ్యవాదం ఈ భూమిపై వున్నంత వరకు పరిష్కరించలేని సమస్యగా మారిపోయింది. ప్రపంచంలో వందల కోట్ల మంది ప్రజలు తమ మౌలిక జీవనావసరాలు తీరక అల్లాడిపోతున్నారు. పర్యావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023 జులైలో అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. ఎన్నడూ లేనంత భారీ వర్షాలు, వరదలతో భారీ విధ్వంసం జరుగుతోంది. అనేక జంతు, వృక్షజాలాలు నాశనమవుతున్నాయి. అయినప్పటికీ భూ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గాలన్న పారిస్ ఒప్పందం అమలు చేసే ప్రయత్నాలు ఏ దేశమూ చేయడం లేదు. ఇది భూగోళ వునికికే ప్రమాదంగా మారిపోయింది. ప్రపంచంలో తీవ్రమవుతున్న ఈ సంక్షోభాలన్నీ సామ్రాజ్యవాద మరణాన్ని త్వరితం చేస్తున్నాయి.
ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ యుద్ధంతో సామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అణుయుద్ధ ప్రమాదం ప్రపంచాన్ని వెన్నాడుతోంది. దాడి – ప్రతిదాడుల మధ్య రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. 100కు పైగా దేశాలు నిషేధించిన క్లస్టర్ బాంబులను అమెరికా యుక్రెయిన్ కు సరఫరా చేస్తున్నది. ఇది భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నది. రష్యాను క్రిమియాతో కలిపే వంతెనను యుక్రెయిన్ టార్గెట్ చేయడంతో రష్యా ఉక్రెయిన్ తో ఆహార గింజల డీల్ నుంచి ఉపసంహరించుకుంది. దీంతో ఆహార సంక్షోభం తిరిగి తీవ్రమవుతోంది. మరోవైపు అమెరికా-చైనాల మధ్య తైవాన్ విషయంలో ఉద్రిక్తతలు పెరుగుతుండగా అమెరికా తైవాన్ కు 345 మిలియన్ డాలర్ల సైనిక సహాయం ప్రకటించింది. ఇందులో భాగంగా అది తైవాన్ కు రక్షణ సామగ్రి, సైనిక బోధన, శిక్షణలను అందిస్తోంది. ప్రపంచ రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న చైనాలో ఎగుమతులు జూన్ లో 14.5 శాతం పడిపోయాయి. గడచిన 3 సంవత్సరాలలో ఇలా తీవ్రంగా తగ్గిపోవడం ఇది మూడోసారి. దీంతో అది మరిన్ని మార్కెట్ల కోసం పోటీకి దిగుతోంది. చైనాతో సత్సంబంధాలు ఉన్న ఉత్తర కొరియా ఇప్పుడు రష్యాతో కూడా సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ఒక ముఖ్యమైన మార్పు. సౌదీ అరేబియా-ఇరాన్ దేశాల మధ్య చైనా సయోధ్య కుదిర్చిన తర్వాత సౌదీ అరేబియా అరబ్బు ప్రపంచంలో మరింత కీలకమైన దేశంగా మారింది. వివిధ సామ్రాజ్యవాద దేశాల, వాటి మిత్ర దేశాల, తమ దళారీ ప్రభుత్వాలున్న వెనుకబడిన దేశాల సైన్యాలు వివిధ రక్షణ ఒప్పందాలలో భాగంగా సైనిక విన్యాసాలు చేయడం సాధారణంగా మారిపోయింది. జూన్ లో ఫ్రాన్స్, భారత్, యుఎఇ దేశాలు నావికా విన్యాసాలు నిర్వహించాయి. జులై-అగస్టులలో ఆస్ట్రేలియా-అమెరికాలు జర్మనీని, మరో 12 దేశాలను కలుపుకుని యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. చైనాతో ఈ ప్రాంతంలో అమెరికాకు పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ డ్రిల్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జులై చివరిలో రష్యాను బెదిరించేందుకు నాటో జర్మనీలో నాటో వైమానిక విన్యాసాలు నిర్వహించి బల ప్రదర్శనకు దిగింది. దక్షిణ కొరియా-అమెరికా కలిసి చేసిన లైవ్ ఫైర్ డ్రిల్స్ కు జవాబుగా ఉత్తర కొరియా జూన్ లో రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది.
మరోవైపు వెనుకబడిన దేశాలలో పీడిత జాతులు, పీడిత ప్రజలు ఎక్కడికక్కడ సామ్రాజ్యవాద దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పెట్టుబడిదారీ – సామ్రాజ్యవాద దేశాలలో అన్ని రంగాలలోని కార్మికవర్గం, మధ్యతరగతి ప్రజలు వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, ప్రజా సంక్షేమం మొదలైన డిమాండ్లతో దీర్ఘకాలిక మిలిటెంటు పోరాటాలకు దిగుతున్నారు. వీటి ఫలితంగా ప్రపంచంలోని మూడు మౌలిక వైరుధ్యాలు పదునెక్కుతున్నాయి. ఈ వైరుధ్యాల పరిష్కారానికి కార్మికవర్గ నాయకత్వంలో వెనుకబడిన దేశాలలో నూతన ప్రజాస్వామిక విప్లవాలను, జాతివిముక్తి పోరాటాలను, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశాలలో సోషలిస్టు విప్లవాలను విజయవంతం చేయడం ద్వారా సామ్రాజ్యవాదాన్ని నిర్మూలించి సోషలిజాన్ని స్థాపించడమే మార్గం.
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్.ఎస్.ఎస్.-బీజేపీ మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే కుట్రలో భాగంగా దేశం నలుమూలలా ఎన్నటికీ ఆరని మత విద్వేష మంటల్ని రాజేస్తోంది. దీంతో యావత్తు పీడిత వర్గాల, సామాజిక సెక్షన్ల, పీడిత జాతుల ప్రజలపై హిందుత్వ ఫాసిస్టు దాడి తీవ్ర స్థాయికి చేరుకుంది. సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ/క్రోనీ కాపిటలిస్టు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలను ఈడేర్చేందుకు అది ఎంతకైనా తెగిస్తోంది. ఇందుకోసం పార్లమెంటులో ప్రతిపక్షాలను పూర్తిగా పక్కకు నెట్టి నిరంకుశంగా అనేక చట్టాలు చేస్తోంది. ఇటీవల వర్షాకాల సమావేశంలో తీసుకొచ్చిన ఆదివాసుల – మూలవాసుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వన సంరక్షణ చట్టం-2023; ప్రజా జీవితంపై పూర్తి స్థాయి నిఘా పెట్టేందుకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం- 2023 తదితర 22 చట్టాలు ఇలాంటివే. అదానీ గ్రూపు లక్షల కోట్ల రూపాయల మదుపుదార్లను దివాలా తీయించినప్పటికీ అంబూజా సిమెంట్స్ కంపెనీ కోసం తీసుకున్న రుణం తీర్చేందుకు 3.8 బిలియన్ డాలర్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అదానీని అనుమతించింది. ఇలా అది బ్యాంకుల మొండి బకాయిల రద్దు ద్వారా, సంపద పన్ను మినహాయింపు, కార్పొరేట్ పన్ను రాయితీ తదితరమైన వాటి ద్వారా క్రోనీ కాపిటలిస్టులకు పదుల లక్షల కోట్ల రూపాయల దేశ ప్రజల సొమ్మును దోచిపెట్టింది.
సామ్రాజ్యవాద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు దేశాన్ని అమ్మివేయడం మోదీ ప్రభుత్వ దినచర్యగా మారిపోయింది. ఇందులో బేరసారాలాడడంలో, ఇక్కడ అంబానీ, అదానీ వంటి క్రోనీ కాపిటలిస్టులు ప్రయోజనాలను ఈడేర్చడంలోనే మోదీ ‘విశ్వగురు’ అయ్యాడు. మోదీ ప్రభుత్వం ఒకవైపు సామ్రాజ్యవాదులకు, క్రోనీ కాపిటలిస్టులకు యావత్తు దేశ సంపదను కట్టబెడుతూ దేశంలో తీవ్ర అసమానతలను సృష్టిస్తూ, మరోవైపు 13.5 కోట్ల పేదలను పేదరికం నుంచి బయటపడేశామని బూటకపు లెక్కలు చెబుతోంది. అదే నిజమైతే దేశంలో నిరుపేదలయిన 81.35 కోట్ల మందికి చౌక ధరలకు రేషన్ ప్రభుత్వం ఎందుకు ఇస్తోంది? నిజానికి ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పేదలు మన దేశంలోనే ఉన్నారు. ఇక్కడి ప్రజల ఆదాయం గ్రామాలలో నెలకు 1,059 రూ.లకు, పట్టణాలలో 1,286 రూ.లకు పడిపోయింది. వీటని దాచిపెట్టి అబద్దాలు చెప్పడం మోదీ ప్రభుత్వానికి మంచినీళ్ల ప్రాయంగా మారిపోయింది. 77వ స్వాతంత్ర దినం అగస్టు 15న మోదీ తన ప్రసంగం పూర్తి అబద్ధాలతో, అర్ధసత్యాలతో, ప్రగల్బాలతో, భారీ వాగ్దానాలతో 140 కోట్ల దేశ ప్రజల్ని మూర్ఖుల్ని చేసేందుకు విఫల ప్రయత్నం చేసాడు.
మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మాక్రాన్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం మన దేశ చిప్ తయారీ పరిశ్రమలో గొప్ప సాంకేతిక మార్పుగా, నూతన ఉషోదయంగా చెప్పడం వాస్తవానికి విరుద్ధం. నిజానికి ఈ ఒప్పందం భారతదేశం చిప్ లను పాకింగ్, అసెంబ్లింగ్, పరీక్షలు చేసేందుకు మాత్రమే పరిమితం. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఇది చాలా చిన్న పని. ఇందులో నూతన ఉషోదయం ఏమీ లేదు. కారు చౌక శ్రమతో అమెరికాకు ఔట్ సోర్సింగ్ చేయడం ద్వారా భారత కార్మికుల శ్రమను తీవ్రంగా దోపిడి చేయడం తప్ప ఇందులో మరొకటి లేదు. పదేళ్ల ముందు ప్రతి సంవత్సరం ప్రజల కోసం 10 లక్షల కోట్లు ఖర్చు అయ్యేదనీ, ప్రస్తుతం 100 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నాడు. అది చేసే ఖర్చు అంబానీ, అదానీ మొదలైన క్రోనీ కాపిటలిస్టులకు చేస్తున్నది తప్ప మరొకటి కాదు.
మోదీ ప్రభుత్వం ఒక వైపు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో చేసామని ఆడంబరంగా చెప్పుకుంటూ, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు నిప్పులా మండుతుంటే కంటితుడుపు చర్యలతో తన అసమర్థతను చాటుకుంది. ప్రపంచమంతటా ధరలు పెరిగిపోయాయనీ సమర్థించుకోజూస్తోంది. టమాటా కిలో 250 రూ., పెట్రోల్ లీటరు 97 రూ. (పెట్రోల్ కంటే టమాటాల ధరే ఎక్కువ!)లకు ధరలు పెరిగిపోయాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వామినాథన్ కమిషన్ సి2+50 శాతం విధానాన్ని అమలు చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం, ఆచరణలో దేశ విదేశీ అగ్రిబిజినెస్ కార్పొరేట్లు లాభపడే విధంగా ఎ2+50 శాతం విధానాన్ని అమలు చేస్తున్నది. 20 శాతం పైగా వ్యవసాయ ఖర్చులు పెరిగినా, పంటలకు మద్దతు ధర 2 శాతం మాత్రమే పెంచింది. ప్రభుత్వం నిజంగా రైతులకు యూరియాపై 10 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తే వ్యవసాయ పెట్టుబడులు ఎందుకు పెరిగిపోతున్నాయి? దేశంలో ప్రతి రైతుపై సగటున 74,121 రూపాయల రుణం ఎందుకు ఉంది? ప్రతి రోజూ 28 మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? నిజానికి జీరో టాక్స్ తో అగ్రిబిజినెస్ ఎం.ఎస్.సీ.ల వ్యవసాయ దిగుమతులు కుప్పలుతెప్పలుగా మన దేశానికి వచ్చిపడడంతో వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్రమైంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా రైతులకు బదులు కార్పొరేట్లకు ధీమాగా మారిపోయింది. ఫసల్ బీమా పేరుతో అవి సంవత్సరానికి 40 వేల కోట్ల రూ.లు దోపిడీ చేస్తున్నాయి. సంవత్సరానికి 1 లక్ష 80 వేల కోట్ల రూ.లతో ప్రారంభమైన గ్రామీణ ఉపాధి పథకం ఈ సంవత్సరం 60 వేల కోట్ల రూ. కుదించి గ్రామీణ వ్యవసాయ కూలీల పొట్టగొట్టింది.
మోదీ ప్రభుత్వం ముందుకు తెచ్చిన విశ్వకర్మ పథకం సంప్రదాయ వృత్తి వారిని అదే వృత్తిలో కునారిల్లే విధంగా చేసేందుకూ, దీనికి బడ్జెట్ కేటాయింపులను అధికారులు, రాజకీయ నాయకులు స్వాహా చేసేందుకు తప్ప మరెందుకూ ఉపయోగపడదు. అలాగే అది ఏర్పరుస్తానని చెబుతున్న 25 వేల జన్ ఔషధీ కేంద్రాలు ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఏ మూలకూ సరిపోవు. నిజానికి అవి చాలా వరకు కాగితాలకే పరిమితం కావడమో లేదా ఆ మందులు కార్పెరేట్ దుకాణాలకు అక్రమంగా తరలిపోవడమో జరుగుతుంది.
మోదీ పాలనలో మహిళా సాధికారత పెరుగుతోందనీ, విమానాలను మహిళలు నడుపుతున్నారనీ, చంద్రయాన్ మిషన్ కు ఒక మహిళ నాయకత్వం వహిస్తున్నారనీ అది చెప్పేది అర్ధ సత్యమే. నిజానికి మహిళలకు అపార శక్తి సామర్థ్యాలున్నాయనే దాంట్లో హిందుత్వ ఫాసిస్టులకు తప్ప ప్రజాస్వామికవాదులెవ్వరికీ సందేహం లేదు. కానీ అభివృద్ధి పేరుతో, ప్రత్యేకించి మహిళా స్వయంసహాయక బృందాల పేరుతో మోదీ ప్రభుత్వం చేస్తున్నది మహిళా శ్రమను కారుచౌకగా దోపిడీ చేయడానికి పెద్ద వనరుగా వాడుకోవడం. ఈ విషయాన్ని దాచిపెట్టి మహిళా సాధికారిత అంటూ అది వక్రీకరిస్తోంది. నిజానికి మోదీ పాలనలో మహిళా ఉపాధి చాలా తగ్గింది.
ప్రస్తుతం అగ్రిటెక్ రంగంలో డ్రోన్ల వినియోగంలో, రిపేరింగ్ లో మహిళలకు శిక్షణ ఇవ్వడం వ్యవసాయ రంగంలో ఉపాధిని మరింత దెబ్బతీస్తుందే తప్ప పెంచదనేది స్పష్టం. అంతేకాక మోదీ పాలనలో రోజు రోజుకూ మహిళలపై హింస మరింత క్రూర రూపాలు తీసుకుంటున్నది. మణిపుర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మే 3వ తేదీ సంఘటన ఇందుకు స్పష్టమైన నిదర్శనం.
మోదీ చెబుతున్నట్లు దేశంలో యువశక్తిలో, ప్రత్యేకించి మహిళల్లో అపారమైన శక్తి సామర్థ్యాలు నిక్షిప్తమై ఉన్నాయనేది, దేశంలో అపారమైన వనరులు, అవకాశాలు ఉన్నాయనేది నిస్సందేహమే. కానీ, దేశాన్ని సామ్రాజ్యవాద ప్రపంచీకరణ బంధనాలలోనే వుంచి అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థగా దోపిడీ, పీడన, అణచివేత, వివక్షలను కొనసాగించినంత కాలం స్వావలంబ విధానంపై ఆధారపడి స్వతంత్రమైన ఆర్థిక వ్యవస్థగా దేశం నిజమైన అభివృద్ధిని సాధించడం సాధ్యం కాదు. 2014లో 10వ స్థానంలో వున్న దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 5వ స్థానానికి చేరుకుందని మోదీ ప్రభుత్వం చెబుతోంది. తీవ్ర ఆర్థిక అసమానతల పునాదిపై జరుగుతున్న ఈ ఆర్థిక వృద్ధి దేశ విదేశీ కార్పొరేట్లకు, గ్రామీణ సంపన్న/పాత, కొత్త భూస్వామ్య వర్గాలకు, వారి ఏజెంట్లకు సిరులు పండించాయి తప్ప దేశంలో పీడిత వర్గాలకు, సామాజిక సెక్షన్లకు, పీడిత జాతులకు ఆవగింజంత ప్రయోజనం చేకూర్చలేదు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తిరిగి తామే గెలుస్తామనీ, భారతదేశాన్ని ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకువస్తామని అంటే, నిస్సందేహంగా దోపిడీ, పీడనలు, పేదరికం, నిరుద్యోగం మొదలైనవి మరింత పెరుగుతాయని అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ విచ్చలవిడి దోపిడీ ఇప్పటికే ఈ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం దేశాభివృద్ధిని ఎంతో వెనక్కు మళ్లించింది. ప్రస్తుతం దేశం నిర్ణయాత్మక మలుపులో వుందనీ, రానున్న ఐదు సంవత్సరాలు సువర్ణ అవకాశాన్ని కల్పిస్తాయనీ మోదీ చెబుతున్నాడు. దీని అర్థం రానున్న ఎన్నికల్లో తిరిగి మోదీని గెలిపిస్తే దేశంలో హిందుత్వ ఫాసిజాన్ని రెచ్చగొట్టి, ఎలాంటి ప్రశ్నించే గొంతునైనా కాలరాచి వేయడానికీ, మత ప్రాతిపదికన దేశ విభజనను పూర్తి చేసి సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య దోపిడీకి ఎలాంటి ఆటంకం లేకుండా చేయడానికీ గొప్ప అవకాశం తప్ప మరొకటి కాదు. దళారీ పాలకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే హిందుత్వ శక్తులు అధికారంలో కొనసాగినంత కాలం మన దేశం ప్రపంచానికి ఒక రూపం ఇవ్వడం కాదు కదా, స్వయంగా అదే తన రూపాన్ని కోల్పోతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం అనేక లక్ష్యాలను సమయానికంటే ఎంతో ముందే సాధించామనీ, ఉదాహరణకు, 5 జీ సేవలు అందించడం, 200 కోట్ల కోవిడ్ టీకాకరణ, 50,000 కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించామని చెబుతోంది. ఈ యావత్తు లక్ష్యాల సాధన వల్ల బహుళజాతి కంపెనీలకు, దేశంలోని క్రోనీ కాపిటలిస్టులకు అత్యధిక డివిడెండ్లు (సూపర్ లాభాలు) లభించాయనేది జగమెరిగిన సత్యం. దీని వల్ల దేశ పీడిత ప్రజలకు ప్రయోజనం శూన్యం.
మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద సంస్కరణలను అత్యంత వేగంగా ‘నిష్ట’గా అమలు చేస్తూ దేశ విదేశీ కార్పొరేట్లకు సూపర్ లాభాలను దోచబెడుతోందనేది వాస్తవం. అయితే అది చెప్పే ‘పారదర్శకత’ వట్టి బూటకం, ఎన్నడూ నిజాలు మాట్లాడడం ఎరుగని, లేదా అర్ధసత్యాలు చెప్పే మోదీ ప్రభుత్వానికి ‘పారదర్శకత’, ‘నిష్పాక్షికత’ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అది ‘పారదర్శకం’గా వుంటే తన 9 యేళ్లకు పైగా పాలనలో విదేశీ కంపెనీలతో, సామ్రాజ్యవాద దేశాలతో అది కుదుర్చుకున్న ఒప్పందాలను దేశ ప్రజల ముందుంచగలదా అని మేం సవాలు చేస్తున్నాం. అప్పుడు ప్రభుత్వ ‘నిష్పాక్షికత’ ఏమిటో, దాని ‘క్రోనీ కాపిటలిస్టులకు’ అది దోచుబెడుతున్న విధానమేమిటో దేశ ప్రజలే నిర్ధారించుకోగలుగుతారు. అవినీతి, బంధుప్రీతి, తుష్టీకరణ్ లకు మూలమంటూ ప్రతిపక్ష పార్టీలపై దాడి చేసే మోదీ ప్రభుత్వ నగ్న స్వరూపాన్ని వారు మరింత స్పష్టంగా చూడగలుగుతారు.
నిజానికి మన దేశంలో అభివృద్ధికి కీలకమైన ఉపాధి, విద్య, వైద్యం వంటి రంగాల అంతర్జాతీయ సూచీల్లో మోదీ పాలనలో మరింత అధమ స్థానానికి చేరుకుంది. ఆకలి సూచిలో 107వ స్థానం, ఆరోగ్యం సూచిలో 146వ స్థానం, మానవ స్వేచ్ఛ సూచిలో 150వ స్థానం, ప్రపంచ సంతోష సూచిలో 139వ స్థానం, పర్యావరణ సూచిలో 180వ స్థానం, ప్రపంచ లింగ సమానత్వ సూచిలో 135వ స్థానం, మానవాభివృద్ధి సూచిలో 132వ స్థానం, పత్రికా స్వేచ్ఛ సూచిలో 142వ స్థానం, దయనీయ సూచిలో 103వ స్థానం, బానిసత్వ సూచిలో నంబర్ 1 స్థానంలో ఉంది.
కానీ ఈ వాస్తవాలను వెలుగులోకి తెచ్చే, ప్రశ్నించే గొంతులపై, పోరాడే కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాస్వామిక మేధావులు, మహిళలు, లాయర్లు, మత మైనారిటీలు, సామాజిక కార్యకర్తలపై ఊపా తదితర క్రూరమైన చట్టాల కింద కేసులు మోపడం హిందుత్వ ఫాసిస్టు పాలనలో సాధారణమైపోయింది. ప్రతిపక్ష పార్టీల ఉనికి కూడా ప్రమాదంలో పడింది. హిందుత్వ శక్తులు దేశాన్ని మత, కుల ప్రాతిపదికన విభజించి మత మైనారిటీలపై దాడి చేస్తున్నాయి. మనుస్మృతిలో భాగంగా కులతత్వాన్ని, హిందుత్వ భావజాలాన్ని అమలు చేస్తున్నాయి. భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నాయి. బేటీ బచావో అంటూ లక్షలాది మహిళల, బాలికల హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యాపారానికి రాజస్థాన్ లో జైపుర్ ను కేంద్రంగా మార్చింది. హిందుత్వ మాఫియాలే. 2002 గుజరాత్ మారణకాండను మించి అత్యంత అమానవీయంగా క్రూరంగా ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకూ, ఆదివాసుల హత్యాకాండలకు, చిత్రహింసలకూ, ఆదివాసీ గూడాల దహనాలు, విధ్వంసాలు, చర్చీలను తగులబెట్టడం మొదలైన అకృత్యాలకూ పాల్పడడంతో మణిపుర్ రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైపోయింది. రాష్ట్రపతి గానీ, సుప్రీంకోర్టు గానీ ఏమీ చేయలేకపోయారు. ఈ నమూనాను దేశవ్యాప్తంగా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఎజెండాగా అమలు చేస్తున్నారనడానికి హరియాణాలో గురుగ్రాంలో, బిహార్ లో ఇటీవలి పరిణామాలు ఉదాహరణలుగా నిలిచాయి. ఇదే అదనుగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని చట్టంగా మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిని అడ్డం పెట్టుకుని అనేక కుట్రలు, కుతంత్రాలతో, పొంతన లేని మోసకారి చర్చలతో ప్రధానంగా మహిళా – పురుష సమానత్వాన్ని (జెండర్ ఈక్వాలిటీ) ముందుకు తెస్తూ మత మైనారిటీలపై హిందుత్వ శక్తులు దాడికి దిగుతున్నాయి.
మొత్తం మీద, “ఐదు కర్తవ్యాలను (పంచ్ – ప్రణ్) పరిపూర్తి చేయడం ద్వారా రాబోయే 25 యేళ్ల అమృత కాలంలో, అంటే 2047 నాటికి సాధిస్తాం” అని చెబుతున్న ‘అభివృద్ధి చెందిన ‘ భారతదేశం లేదా ‘న్యూ ఇండియా’ హిందూ రాజ్యం తప్ప మరొకటి కాదు. “ఈ అగస్టు 15తో అమృతకాలపు మొదటి సంవత్సరంలో అడుగుపెట్టాం” అంటే అర్థం తమ హిందుత్వ విధానాలను మరింత నగ్నంగా అమలు చేస్తారన్న మాట. అగస్టు 14 భారత్-పాకిస్తాన్ విభజన జరిగిన రోజున ‘భారతమాత రెండుగా విభజించబడిందనీ, భవిష్యత్తులో భారతమాతను ఒకటి చేసే బాధ్యత మనపై ఉంది’ అని చెప్పడం ద్వారా భారత పాలకవర్గాల విస్తరణవాదకాంక్షను మోదీ మరో విధంగా వ్యక్తం చేసాడు. కనుక బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం నుండి దేశాన్ని, ప్రజలను కాపాడడం నేడు | దేశంలోని పీడిత వర్గాల, సామాజిక సముదాయాల, పీడిత జాతుల ప్రజల, ప్రజాస్వామికవాదుల, దేశభక్తుల, లౌకికశక్తుల ముందున్న ప్రధాన కర్తవ్యం.
కర్తవ్యాలు:
1. పార్టీ సంఘటితీకరణ క్యాంపెయిన్ ను విజయవంతం చేద్దాం
పార్టీ సంఘటితీకరణ క్యాంపెయిన్ ను మరో రెండు సంవత్సరాలు కొనసాగించి విజయవంతం చేయాలి. ఆయా రాష్ట్రాల, జోన్ / డివిజన్ / జిల్లాల నిర్దిష్ట పరిస్థితి ఆధారంగా నిర్దిష్ట టార్గెట్లు నిర్ణయించుకుని వాటిని పూర్తి చేసే పథకాన్ని రూపొందించుకోవాలి. ముఖ్యంగా ఎంఓపీ, సీసీ పీఓఆర్ ల అధ్యయనం-క్లాసులు జరగని చోట జరపాలి. సీసీ పీఓఆర్ లో చేపట్టిన కేంద్రకర్తవ్య సాధనకు తోడ్పడేలా, ఎంఓపీ డాక్యుమెంటులోని వర్గ పోరాట కార్యక్రమం, ఎత్తుగడలను ఆధారం చేసుకుని అన్ని స్పెషల్ ఏరియా/స్పెషల్ జోన్/రాష్ట్రాలలో వ్యవసాయిక, పారిశ్రామిక, సేవా రంగాలలో జరిగిన మార్పులను గుర్తించేలా ఎంపిక చేసిన ప్రాంతాలలో సామాజిక పరిశోధన చేపట్టాలి. ఈ పరిశోధనపై ఆధారపడి సీసీ పీఓఆర్, ఎంఓపీ డాక్యుమెంట్లను నిర్దిష్ట పరిస్థితులకు అన్వయిస్తూ ఆయా స్పెషల్ ఏరియా/స్పెషల్ జోన్/రాష్ట్రాలలో నూతన పర్ స్పెక్టివ్ లను, కార్యాచరణ పథకాలను రూపొందించుకోవాలి. వీటిని దేశవ్యాప్తంగా అటవీ, మైదాన, పట్టణ ప్రాంతాలలో అమలు చేయడం ద్వారా విప్లవోద్యమంలో ఒక మార్పును తీసుకు వచ్చేందుకు దృఢసంకల్పంతో కృషి చేయాలి. చట్టబద్ధ – చట్ట వ్యతిరేక నిర్మాణ, పోరాట రూపాలను ఆయా స్పెషల్ ఏరియా/స్పెషల్ జోన్/రాష్ట్రాల నిర్దిష్టతల ఆధారంగా చేపట్టాలి. ప్రజాపునాదిని పెంచుకోవాలి. ఉద్యమ ఆచరణలో కొనసాగుతున్న లోపాలను సరిదిద్దుకుంటూ, బలహీనతలను అధిగమిస్తూ, అన్యవర్గ ధోరణులను వదిలించుకోవాలి. సంఘటితీకరణ క్యాంపెయిన్ ప్రక్రియ పూర్తయిన చోట క్యాంపెయిన్ లో సాధించిన అనుకూలాంశాలను సంఘటితం చేసుకోవాలి.
పోరాటాల్లో కదిలే శక్తులలో వీలైనంత ఎక్కువ మందికి మన పార్టీ పంథాపై రాజకీయ శిక్షణ అందించాలి. పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చి పార్టీ నిర్మాణాలలో సంఘటితం చేయాలి. వీరి నుంచి రిక్రూట్ మెంట్ ను పెంచుకోవాలి. పార్టీ, ప్రజాసైన్యం, ఐక్యసంఘటనలను బలోపేతం చేయాలి. ఈ మూడు
రంగాల్లో అన్ని స్థాయిల్లో రెండవ శ్రేణి నాయకత్వాన్ని ప్రణాళికబద్ధంగా తయారు చేయాలి.
అన్ని స్థాయిల పార్టీ కమిటీల సమావేశాలు రెగ్యులర్ గా జరపాలి. శత్రు దాడుల మధ్య సైతం టీములుగా పని చేసే పద్ధతిని అమలు చేయాలి. కమిటీల పని విధానాన్ని మెరుగుపరచాలి. ఇందులో కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని దృఢంగా అమలు చేయాలి. జవాబుదారీతనం పెంచాలి. ప్రజాపంథా-వర్గపంథాను అమలు చేయాలి. ఉదారవాదానికి తావీయరాదు. వాటికి అవసరమైన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ, సైనిక శిక్షణ అందించాలి. వాటి నైపుణ్యం పెంపొందించాలి. కమిటీ వర్క్ రిపోర్టులు రెగ్యులర్ గా తమ పై కమిటీలకు అందించాలి. పై నుంచి వచ్చిన రిపోర్టులు అవసరమైన మేరకు కింది కేడర్లకు చెప్పాలి. కమిటీలలో వస్తుగత, స్వీయాత్మక అవకాశాల గురించి చర్చించి రాజకీయ, నిర్మాణ, సైనిక, సాంస్కృతిక, టెక్నికల్ కృషిని పథకం ప్రకారం కొనసాగించాలి. అధ్యయనం-క్లాసులు-ఆచరణకు అన్వయింపు ద్వారా, పార్టీ సంఘటితీకరణను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా కమిటీల/ నాయకత్వ అభివృద్ధికి కృషి చేస్తూ వాటి/వారి రాజకీయ స్థాయిని పెంపొందించడానికి నిరంతరం కృషి చేయాలి. పనిలో పురోగతిని సాధించడం కోసం ఎంఎల్ఎంపై పట్టు సాధిస్తూ, పార్టీ పంథాను అర్థం చేసుకుని, పార్టీ పని అంతటా దానికి అంటిపెట్టుకుని పని చేయాలి. తద్వారానే ఉద్యమాన్ని అభివృద్ధి చేయగలుగుతాం.
అన్ని స్థాయిల నాయకత్వంతో పాటు మొత్తం పార్టీ కేంద్రీకరించి పని చేయడం ద్వారా బలహీనపడిన ప్రజాపునాదిని పటిష్టం చేస్తూ నష్టాలను నివారించాలి. టెక్నికల్ లోపాలు జరగకుండా, శత్రు జీపీఎస్ ట్రాకింగ్ లకు, విష ప్రయోగాలకు గురికాకుండా నాయకత్వం అన్ని జాగ్రతలు తీసుకోవాలి. నాయకత్వం తమ ఉనికి బహిర్గతం కాకుండా, తమ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతూనే, కేడర్ల వెంట వుంటూ ఆచరణలో వచ్చే సమస్యలను అర్థం చేసుకుంటూ, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తూ పనిలో ప్రగతిని సాధించగలమనే విశ్వాసాన్ని కేడర్లలో నింపాలి. పారుబోతుతనాన్ని నియంత్రించాలి. దండకారణ్యంలో నవంబర్-డిసెంబర్ 2022లో నిర్వహించిన ప్రత్యేక భర్తీ క్యాంపెయిన్ లో వచ్చిన పాజిటివ్ అనుభవాలను విప్లవోద్యమ ప్రాంతాలన్నింటికీ విస్తరింపజేయాలి. కన్సాలిడేషన్, భర్తీ నేపథ్యంలో పార్టీలో శత్రు చొరబాటుకు గల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పార్ట్ టైమర్లు ఫుల్ టైమర్లలో శత్రు చొరబాటు పై పరిశీలన ఉండాలి. సంఘాలలో, ప్రజా మిలీషియాలో శత్రు చొరబాట్లు లేకుండా చూసుకోవాలి.
ప్రజాయుద్ధాన్ని పురోగమింపజేయడానికి అటవీ, మైదాన, పట్టణ ప్రాంతాల ఉద్యమాల మధ్య పరస్పరాధారిత సంబంధాలు, ప్రత్యేకించి భారత నూతన ప్రజాస్వామిక విప్లవంలో మైదాన, పట్టణ ఉద్యమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకుని సరైన ఎత్తుగడలతో వివిధ స్పెషల్ ఏరియా/స్పెషల్ జోన్/రాష్ట్రాలలో వాటి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యూహాత్మక అటవీ ప్రాంత వుద్యమాలకు అండగా ఆ ప్రాంతాలలోని, సరిహద్దులలోని పట్టణాలు, మైదానాలలో ఉద్యమాలను నిర్మించి విస్తరించాలి. పట్టణ, మైదాన, అటవీ ఉద్యమాలలో రహస్య పని విధానానికి ప్రాధాన్యతనిస్తూ ఆ ఉద్యమాలలో మనకు లభించిన అనుకూల అనుభవాలపై ఆధారపడి వాటిని నడపాలి, ప్రతికూలతలను అధిగమించాలి. పట్టణ, మైదాన ప్రాంతాలలో భర్తీ పెంచే విధంగా కేంద్రీకరించాలి.
ఈ సంవత్సరం చివరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు, వచ్చే సంవత్సరం వేసవిలో పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ పార్లమెంటరీ ఎన్నికలలో “బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ ప్రమాదం నుండి దేశాన్ని, ప్రజలను కాపాడండి, బూటకపు ఎన్నికలను బహిష్కరించండి” అనే పిలుపును విశాల పీడిత వర్గాల, సామాజిక సెక్షన్ల, జాతుల ప్రజలలోకి విస్తృతంగా తీసుకునిపోవాలి. బూటకపు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి, నూతన ప్రజాస్వామ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ప్రజా పోరాటాలకూ, దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి ప్రజలను రాజకీయంగా సంసిద్ధం చేయాలి.
2. బహుముఖ ప్రతిదాడి పథకం ద్వారా సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకాన్ని ఓడిద్దాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవ ప్రతిఘాతక సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకంలో భాగంగా దండకారణ్యంలో మాడ్, బీజేలో కొల్హన్ తో పాటు విప్లవోద్యమం సాపేక్షికంగా బలంగా వున్న వ్యూహాత్మక ప్రాంతాలను ‘మావోయిస్టుల నుండి విముక్తి చేసే పథకాన్ని’ రూపొందించాయి. వివిధ రాష్ట్రాలలో యూనిఫైడ్ కమాండ్ల, వివిధ రాష్ట్రాల పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారుల సమావేశాలను నిర్వహిస్తూ దాడులను తీవ్రతరం చేసారు. ఈ తీవ్రమైన దాడిని ఓడించడం కోసం, మన వైపు నష్టాలను నివారిస్తూ, మన శక్తులను, ప్రజాపునాదిని కాపాడుకుంటూ, వాటిని పెంపొందించి బలోపేతం చేసుకోవడానికి రాజకీయ, నిర్మాణ, వర్గ పోరాట కృషిని, గెరిల్లాయుద్ధాన్ని సమర్థవంతంగా కొనసాగించడం కోసం మన కేంద్రకమిటీ రూపొందించిన బహుముఖ ప్రతిదాడి పథకాన్ని, ఎత్తుగడలను శ్రద్ధగా అధ్యయనం చేయాలి. వాటిని కింది వరకూ తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేయడమే కాకుండా రానున్న రెండు సంవత్సరాలలో శత్రు దాడిని ఓడించేందుకు నిర్దిష్ట పథకాలను రూపొందించుకుని అమలు చేయాలి. ప్రతిఘాతక వ్యూహత్మక దాడిని తిప్పికొడుతూ. విప్లవోద్యమాన్ని తాత్కాలిక సెట్ బ్యాక్ లో నుంచి అధిగమింపజేయడానికి కృషి చేయాలి.
2024 పార్లమెంటు ఎన్నికల నాటికి భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించే దుష్ట లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవ ప్రతిఘాతక సూరజ్ కుండ్ దాడి పథకం అమలుకై కేంద్రీకరిస్తున్నాయి. ప్రత్యేకించి, కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకత్వ కామ్రేడ్స్ ను నిర్మూలించేందుకు కార్పెట్ సెక్యూరిటీని – పోలీసు క్యాంపులను బలోపేతం చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్-ఇన్ఫార్మర్స్-కోవర్ట్స్ నెట్ వర్క్ లను విస్తృతం-బలోపేతం చేస్తున్నాయి. పారామిలిటరీ, కమాండో, ఎన్.ఎస్.జీ. బలగాలతో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఎయిర్ స్ట్రైక్స్ చేసి మనకు భారీ నష్టం కలుగజేయాలని చూస్తున్నాయి. ఈ స్థితిలో దీర్ఘకాల దృష్టితో రానున్న రెండు సంవత్సరాల పాటు మన పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. బలగాల, ప్రత్యేకించి నాయకత్వ శక్తుల రక్షణకు, నష్టాల నివారణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. శత్రు ఎత్తుగడలకు దీటుగా మన కౌంటర్ ఎత్తుగడలు రూపొందించుకోవడమే కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీటిని మార్చుకుంటూ నిర్ణయించుకున్న విధంగా మన పని పద్ధతుల్లో మార్పులు తీసుకరావాలి. శత్రు ఎయిర్ స్ట్రైక్స్ నుంచి కాపాడుకునేలా ఎయిర్ డిఫెన్స్ ఎత్తుగడలను అభివృద్ధి చేసుకోవాలి. శత్రు టెక్నికల్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ నుంచి రక్షించుకునేందుకు నిర్ణయించుకున్న గైడ్ లైన్స్ ను, పద్ధతులను అమలు చేయాలి. మన సప్లయి మార్గాలలో శత్రువు చొరబడకుండా నిరంతరం పరిశీలిస్తూ వుండాలి.
రానున్న కాలంలో విప్లవ ప్రతిఘాతక సూరజ్ కుండ్ పథకానికి అనుగుణంగా శత్రుదాడి మరింత తీవ్రతరమవుతుంది. కనుక పారేవా వంటి ఘటనలు పునరావృతం కాకుండా యావత్తు పార్టీకీ శిక్షణ గరపాలి. శత్రు దాడి తీవ్రతను సీరియస్ గా పరిగణనలోకి తీసుకుని రహస్య పని పద్ధతులు, ప్లానింగ్ రూపొందించుకుని అమలు చేయాలి. గెరిల్లాయుద్ధ నియమాలను కచ్చితంగా అమలు చేయాలి. శత్రువుకు బహిర్గతమయ్యే పద్ధతుల్ని కచ్చితంగా నివారించాలి. గెరిల్లా పోరాట శైలి, జీవన శైలిని అమలు చేయడంలో లోపాలను తక్షణం సరిదిద్దుకోవాలి. త్యాగనిరతిని పెంపొందించుకోవాలి. శత్రు చేతజిక్కినప్పుడు ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి పార్టీ రహస్యాలను కాపాడాలి. జైలుకు పోవడానికి సిద్ధపడాలి తప్ప శత్రువుకు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదు.
పీ.ఎల్.జీ.ఏ. కమాండ్లను, బలగాలను సంఘటితీకరించి, బలోపేతం చేయాలి. ప్రజలపై ఆధారపడి స్థానిక వనరులను సృష్టించుకోవడం, టెక్నికల్ రంగ నిపుణులను తయారు చేయడం ద్వారా ఇంప్రూవైజ్డ్ ఆయుధాలను, మందుగుండును సమకూర్చుకోవాలి. పీ.ఎల్.జీ.ఏ. ఫైర్ పవర్, కంబాట్ సామర్థ్యం పెంచాలి. శత్రుదాడిని ప్రతిఘటించి ఓడించే నిర్దిష్ట పథకాలతో ప్రజా ప్రతిఘటనా పోరాటాలను, గెరిల్లా యుద్ధాన్ని విస్తృతం-తీవ్రతరం చేయాలి.
3. వ్యూహాత్మక, ఎత్తుగడలపరమైన ఐక్యసంఘటనలను, ప్రత్యేకించి బ్రాహ్మణీయ
హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా విశాల ఐక్యసంఘటనను నిర్మిద్దాం. బలోపేతం చేద్దాం
సామ్రాజ్యవాదులు, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలు తమ ప్రయోజనాలను ఈడేర్చుకునేందుకు హిందుత్వ ఫాసిజాన్ని రెచ్చగొడుతున్నాయి. దీనిని ఓడించాలంటే, ప్రజలతో సజీవ సంబంధాలు కొనసాగిస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా మన పార్టీ కార్యాచరణ ఉండాలి. నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ప్రజల దైనందిన, మౌలిక సమస్యలపై సామ్రాజ్యవాద వ్యతిరేక, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటాన్ని, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని నిర్మించాలి. ఈ పోరాటాలను సమన్వయిస్తూ విస్తృతం-తీవ్రతరం చేయాలి. ఉక్రెయిన్ లో సామ్రాజ్యవాద దేశాల పరోక్ష యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేయాలి. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం; వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల, అడవుల-సహజ వనరుల, మౌలిక సదుపాయాల నిర్మాణాలలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ; విప్లవ ప్రతిఘాతక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడి పథకంలో భాగంగా సైనికీకరణ-కలంధారీ మావోయిస్టుల పేరుతో ఫాసిస్టు దాడి-విప్లవోద్యమ ప్రాంతాలలో డ్రోన్-హెలికాప్టర్లతో వైమానిక దాడులు; బలవంతపు విస్థాపన – కేంద్ర వన సంరక్షణ చట్టం- 2023 రద్దు; డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టం- 2023 రద్దు; జాతీయ విద్యా విధానం రద్దు మొదలైన తక్షణ సమస్యలపై కార్మిక, కర్షక, మధ్యతరగతి, చిన్న-మధ్యతరహా (జాతీయ పెట్టుబడిదారీ) వర్గం – ఈ నాలుగు పీడిత వర్గాలను, దళితులు, మహిళలు, ఆదివాసులు, మత మైనారిటీలు తదితర పీడిత సామాజిక సముదాయాలను, విద్యార్థి-యువత, మేధావులు కళాకారులను కదిలించాలి. ఏ ఐక్యసంఘటన అయినా కార్మిక- కర్షక మైత్రిపై ఆధారపడి నిర్మించాలి. ఆ రెండు పునాది వర్గాలతో సంఘీభావాన్ని కలిగి వుండాలి.
వివిధ ప్రజా ఉద్యమాలలో అగ్రగామిగా వున్న శక్తులను వివిధ రూపాలలో వివిధ వ్యూహాత్మక – ఎత్తుగడల ఐక్య సంఘటనలలో, ప్రజా సంఘాలలో, ప్రజా మిలీషియాలో సంఘటితం చేయాలి. ముఖ్యంగా వివిధ రూపాలలో ఆదివాసులు, దళితుల, రైతులు, మహిళల, సాహితీ, సాంస్కృతిక, విద్యార్థి-యువజనుల, కార్మికుల సంఘాలను ఏర్పాటు చేస్తూ ప్రజా ఉద్యమాల నిర్మాణానికి, సంఘటితీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. వాటిలో వివిధ దొంతరలలో పార్టీని నిర్మించి బలోపేతం చేయాలి. ప్రజా ఉద్యమాలు మిలిటెంటు రూపం తీసుకునేలా పార్టీ గైడ్ చేయాలి. అఖిల భారత స్థాయిలో ఐక్యసంఘటనలలో అన్ని రాష్ట్రాల నుంచి మన పార్టీ నుంచి ప్రాతినిధ్యం, నాయకత్వం వుండేలా తీవ్రంగా కృషి చేయాలి.
వీటన్నింటిని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి (బీహెచ్ఎఫ్) వ్యతిరేకంగా కేంద్రీకరించాలి. వివిధ రాష్ట్రాలలోనూ, దేశవ్యాప్తంగానూ నిర్మాణమై కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలలో, ఐక్యసంఘటనలలో భాగం చేయాలి. అవసరమైన నూతన వేదికలను చొరవగా కలిసివచ్చే శక్తులను కలుపుకుని నిర్మించాలి. ముఖ్యంగా హిందుత్వ శక్తులు దేశాన్ని ‘హిందూ రాష్ట్ర’గా మార్చేందుకు ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) చట్టాన్ని తీసుకొచ్చేందుకు పూనుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విశాల, దీర్ఘకాలిక ప్రజా ఆందోళనలను నిర్మించాలి. ఈ సమస్యకు గల విశాల ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకొని మనం శక్తులను కేటాయించుకోవాలి. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కదులుతున్న అనేక సంస్థలతో, శక్తులతో విశాల ఐక్యసంఘటన ఏర్పరచాలి. ముఖ్యంగా మేధావులను, హక్కుల కార్యకర్తలను, విద్యార్థులను సమీకరించి ఈ ఆందోళనలో ముందు పీఠిన నిలపాలి. దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులలో లేని సమానత్వాన్ని చట్టాల ద్వారా తీసుకురావడం అసంభవం అనీ, అది పాలకవర్గాల కుట్ర అని బహిర్గతం చేయాలి. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా రెండేళ్ల (2023-2025) పాటు వివిధ రూపాలలో దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ ను నడపాలి.
4. అంతర్జాతీయ కృషిని పెంపొందించాలి
అంతర్జాతీయంగా పెంపొందుతున్న విప్లవ పరిస్థితులలో అంతర్జాతీయ కృషికి ప్రాధాన్యత రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగంగా అర్ధవలస, అర్ధభూస్వామ్య దేశాలలో దీర్ఘకాల ప్రజాయుద్ధాలు నడుపుతున్న, అందుకోసం సన్నాహాలు చేస్తున్న విప్లవ పార్టీలతో, పెట్టుబడిదారీ-సామ్రాజ్యవాద దేశాలలో సోషలిస్టు విప్లవాల కోసం కృషి చేస్తున్న విప్లవ పార్టీలతో మన పార్టీ సజీవ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. అంతర్జాతీయ సంఘీభావాన్ని, సహాయ సహకారాల్ని పెంపొందించాలి. సామ్రాజ్యవాదానికి, సామ్రాజ్యవాద యుద్ధానికి వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకై తదితర సమస్యలపై వివిధ అంతర్జాతీయ ఐక్య వేదికలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి. మార్క్సిజం-లెనినిజం-మావోయిజం వెలుగులో ఈ భూమిపై సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించి, అంతిమంగా సోషలిజాన్ని-కమ్యూనిజాన్ని స్థాపించే లక్ష్యంతో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధికి అలుపెరగని కృషిని కొనసాగించాలి.
ఈ కర్తవ్యాల సాధన కోసం యావత్తు పార్టీ, పీ.ఎల్.జీ.ఏ., ఐక్యసంఘటన శక్తులు, ప్రజా నిర్మాణాలు సమైక్యంగా పనిచేయాలి. ఒకరు పది మందిలా పనిచేయాలి. ఒకరు వందలు వేలమంది ప్రజానీకాన్ని కూడగట్టాలి. మన శక్తులను కాపాడుకుంటూ, నష్టాలను తగ్గించుకుంటూ శత్రుశక్తిని దెబ్బతీయడం కోసం కష్టపడేతత్వాన్ని, రహస్య పని శైలిని అనుసరించాలి. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న బలహీనతలను, పరిమితులను, లోపాలను పునరావృతం కాకుండా, ఇందులో యథాలాపతకు గురికాకుండా దృఢసంకల్పంతో కృషి చేయాలి. తద్వారానే అనుకూల పరిస్థితులను వినియోగించుకుని విప్లవోద్యమాన్ని తాత్కాలిక వెనకంజ నుంచి బయటపడేయగలం, దానిని పురోగమింపజేయగలం.
ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా!
మన పార్టీనీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి భారత హిందుత్వ ఫాసిస్టు పాలకులు ఫాసిస్టు దాడులు చేస్తున్నప్పటికీ అది వారికి అసాధ్యం. దోపిడీ, పీడన, అసమానత, వివక్ష వున్నంత వరకూ అది వారి తరం కాదు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యను సాయుధంగా పరిష్కరించలేమని వారికి కూడా తెలుసు. అందువల్లనే ప్రజల మధ్య ఐక్యతను చీలదీసి, ఒక సల్వాజుడుం, ఒక సేంద్ర, ఒక నాగరిక్ సురక్షా సమితి లాగా ప్రజల మధ్యనే అంతర్యుద్ధం సృష్టించి విధ్వంసం సృష్టించే లక్ష్యంతో రోజు రోజుకూ హిందుత్వ ఫాసిజాన్ని రెచ్చగొడుతున్నారు. ప్రజలలోని సున్నితమైన మతపరమైన విశ్వాసాలను ఉపయోగించుకుని సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య దోపిడీని కొనసాగించేందుకు కులతత్వాన్ని పెంచి పోషించడం, దేశాన్ని మతపరంగా విభజించడం వారికి నిత్యకృత్యంగా మారిపోయింది. మిగతా పార్లమెంటరీ పార్టీలలో కూడా హిందుత్వ భావజాలమే ఆధిపత్యంలో వుంది. ఫలితంగా దానికి వ్యతిరేకంగా అవి దృఢంగా పోరాడలేవు. కనుక బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలం వలన కలుగుతున్న ప్రమాదాన్ని ప్రజలకు అర్థం చేయించాలి. నాలుగు పీడిత వర్గాల – కార్మికులు, రైతాంగం, మధ్యతరగతి, జాతీయ బూర్జువా వర్గం, పీడిత సామాజిక సెక్షన్ల, పీడిత జాతుల ప్రజలనందరినీ దానికి వ్యతిరేకంగా కూడగట్టాలి. విశాల ప్రాంతాలలో కార్మికవర్గ నాయకత్వంలో, జాతీయ, ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాల సాధన కోసం కార్మిక కర్షక మైత్రిపై ఆధారపడి విశాల ప్రజా ఆందోళనలను, ప్రజా ప్రతిఘటనా పోరాటాలను, దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని పెంపొందించి అభివృద్ధి చేయాలి. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి ప్రజల ప్రజాస్వామ్యానికి గ్యారంటీ కల్పించి నూతన ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించడం ద్వారా మాత్రమే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడించగలం.
* దండకారణ్యం, బిహార్ – ఝార్ఖండ్, తూర్పు బిహార్ – ఈశాన్య ఝార్ఖండ్ లను విముక్తి ప్రాంతాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు సాగుదాం! * ప్రజాపునాదిని, పార్టీ, పీ.ఎల్.జీ.ఏ., విప్లవ ప్రజా నిర్మాణాలను బలోపేతం చేద్దాం!
* వర్గ పోరాటాన్ని-గెరిల్లాయుద్ధాన్ని-దీర్ఘకాల ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం- విస్తృతం చేద్దాం!
* దీర్ఘకాల ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు మైదాన, పట్టణోద్యమాలను పెంపొందిద్దాం!
* ప్రతిఘాతక వ్యూహాత్మక ‘సూరజ్ కుండ్’ పథకాన్ని తిప్పికొడదాం!
* బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడిద్దాం, దాని నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడుదాం!
* బూటకపు ‘న్యూ ఇండియా కాదు’, నూతన ప్రజాస్వామిక ఇండియా కావాలి !
* సామ్రాజ్యవాద వ్యతిరేక, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక వర్గపోరాటాన్ని తీవ్రతరం-విస్తృతం చేద్దాం! * భారత నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి!
* ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి!
* భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) వర్ధిల్లాలి!
* మార్క్సిజం-లెనినిజం-మావోయిజం వర్ధిల్లాలి!
అగస్టు 16, 2023
కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)