
వరదలొస్తే బంధు మిత్రుల్ని కోల్పోతాం. చెట్టుకొకరు పుట్టకొకరుగా గల్లంతవుతున్నారు. ఇపుడు తెలంగాణలోని వరదలకు ఆ పరిస్థితి చూస్తున్నాం. 15 రోజుల క్రితం ఉత్తర భారతంలోనూ ఇలాంటి వరద బీభత్సమే చోటుచేసుకున్న ఘటనలు చూశాం. పంజాబ్లో కూడా ఇలాగే వరదలు వస్తే గురుద్వారాలో ఆధ్యాత్మిక గాయకుడిగా పని చేస్తున్న జగ్జీత్ సింగ్ సహాయక చర్యల కోసం వెళ్లాడు. ఆ క్రమంలో ఆయన 35 ఏళ్ల క్రితం దూరమైన తన తల్లిని కలుసుకోగలిగాడు. అసలు కథ ఏమిటంటే.. జగ్జీత్కు రెండేళ్లున్నపుడే తండ్రి చనిపోయాడు. తల్లి రెండో పెళ్లి చేసుకుంది. జగ్జీత్ను నాన్మమ్మ, తాతయ్యలు తెచ్చిపెంచుకున్నారు. అమ్మా, నాన్నలు ఏమయ్యారని అడిగితే యాక్సిడెంట్లో చనిపోయారని జగ్జీత్కు చెప్పేవారు. కాలం అలా గడవగా.. వరద సహాయం అందించేందుకు పాటియాల వెళ్లిన జగ్జీత్కు అతడి అత్త ఫోన్ చేసి మీ అమ్మమ్మ కుటుంబం అక్కడే భోహర్పూర్లో ఉండేదని చెప్పింది. దాంతో జగ్జీత్ ఆ కుటుంబం కోసం వెదుకులాట ప్రారంభించి సక్సెస్ అయ్యాడు. అమ్మమ్మ తొలుత అనుమానించినా తర్వాత తన కూతురికి మొదటి పెళ్లి ద్వారా ఒక మగ సంతానం ఉందని గుర్తుకు తెచ్చుకుంది. తల్లితో 37 ఏళ్ల జగ్జీత్ను కలిపింది. భార్య, 14 ఏండ్ల కూతురు, ఎనిమిదేండ్ల కొడుకు ఉన్న జగ్జీత్ ఈ మొత్తం కథను తన ఫేస్బుక్లో షేర్ చేసి ఆప్తులతో సంబరం పంచుకుంటున్నాడు.