
ఇండియాను భారత్ అని మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ పార్లమెంట్ సెషన్లో పేరుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడతారా అనే అనుమానం కూడా ఉంది. జీ 20 దేశాల సమావేశాలకు వివిధ దేశాధినేతలకు పంపిన ఇన్విటేషన్ల ద్వారా ఈ విషయం అర్థమవుతోందని కాంగ్రెస్ అంటోంది. మోదీ ప్రభుత్వ ప్రతిపాదనను హిందూత్వ సంఘాలు ఆహ్వానిస్తుండగా, ఇండియా కూటమిలోని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు భారత్ లేదా ఇండియా గురించి రాజ్యాంగం ఏం చెబుతుందో చూద్దాం. అలాగే రాజ్యాంగ సవరణ ఎలా సాధ్యమో పరిశీలిద్దాం.

స్వాతంత్ర్యం వచ్చాక మన దేశాన్ని ఏ పేరుతో పిలవాలన్న అంశం రాజ్యంగ రూపకల్పన సమయంలో భారీగానే చర్చకు వచ్చింది. రకరకాల వాదనలు ముందుకు వచ్చాయి. భారత్ అనీ, ఇండియా అనీ, హిందుస్థాన్, భరతభూమి, భరత వర్ష్ అనీ ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానమైన చర్చ మాత్రం భారత్, ఇండియా అనే పేర్లపైనే సాగింది. దాంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 దీనిపై ఒక స్పష్టత ఇచ్చివిషయాన్ని తేల్చేసింది. మెజారిటీ ఇండియా అనే పేరు సూచించినందున ‘‘ఇండియా అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంద’’ని అర్టికల్ 1 (1) స్పష్టం చేసింది. మన దేశాన్ని ఏ పేరుతో పిలవాలన్న అంశానికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఏకైక వివరణ ఇది. దాంతో దేశాన్ని ఇండియా అనీ, భారత్ అనీ పిలవడం ఆనవాయితీగా వస్తోంది. రెండు పేర్లతో పిలిచినా ఇప్పటి వరకు పేచీ రాలేదు. తాజా రాజ్యంగ సవరణ అనుమానం కొత్త చర్చకు తెరలేపింది. ఐక్యరాజ్య సమితిలో మన దేశం పేరు ‘‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’’గా ఉంది. ఒకవేళ భారత్‌గా మారిస్తే ఐరాసాతోపాటు అన్ని దేశాలకు సమాచారం పంపాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

పేరు మార్పు చేయాలంటే..
రాజ్యాంగంలో భారత్, ఇండియా అనే రెండు పేర్లు ఉన్నందున ప్రస్తుతం ఏ పేరైనా వాడుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇండియా అనే పదం పూర్తిగా తొలగించి భారత్ అని మాత్రం పిలవాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి కేంద్రం ఆర్టికల్ 1కి సవరణ కోరాలి. రాజ్యాంగ సవరణ చేసేందుకు ఆర్టికల్ 368 ప్రకారం సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అనే రెండు విధానాలు ఉన్నాయి. రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు, ఇతర మార్పులకు సంబంధించి సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అంటే 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సవరణకు అనుకూలంగా రావాలి. కానీ ఆర్టికల్ 1లోని దేశం పేరు, ఇతర అంశాలను మార్చాలంటే మాత్రం స్పెషల్ మెజారిటీ అవసరం అవుతుంది. అంటే దీని కోసం పార్లమెంట్ ఉభయ సభల్లో ఓటింగ్ జరగాలి. మూడింట రెండు వంతుల ఓట్లు రావాలి. అంటే హాజరైన మొత్తం సభ్యుల్లో 66 శాతం ఓట్లు రావాలి.