
తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు అనుమతి నిరాకరణ
ఉత్తర్వులిచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్
తుక్కుగూడలో సెప్టెంబర్ 17న కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన విజయభేరి సభకు రాష్ట్ర సర్కారు అనుమతి నిరాకరించింది. గుడి పక్కనే ఉన్న గుడి స్థలంలో రాజకీయ సభ నిర్వహణకు అనుమతినివ్వలేమని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ నేతలు విజయభేరి సభకు అనువైన స్థలాలను పరిశీలించారు. తుక్కుగూడలోని శ్రీరామనగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఖాళీ స్థలాన్ని ఖరారు చేశారు. అక్కడ సభ నిర్వహించుకునేందుకు రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి దేవాదాయ శాఖకు పర్మిషన్ కోసం అప్లై చేశారు. అయితే, రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్ ~1988లోని సెక్షన్ 5, 6 ప్రకారం గుడులు, ప్రార్థనా మందిరాల పక్కన రాజకీయ సభలకు అనుమతిని ఇవ్వరాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సభకు పర్మిషన్ ఇవ్వలేమని తెలిపారు. ఆ కాపీని రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లాకు పంపించారు. కాగా, సోనియా గాంధీ సహా కాంగ్రెస్ జాతీయ నేతలు హాజరుకానున్న ఈ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తొలుత పరేడ్ గ్రౌండ్లో సభను నిర్వహించాలనుకున్నప్పటికీ.. అదే రోజు కేంద్రప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుండడంతో సభను తుక్కుగూడకు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ కూడా పర్మిషన్ నిరాకరించడంతో.. పార్టీ నాయకత్వం ఏ వేదికను ఖరారు చేస్తుందో వేచి చూడాలి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియాన్నీ పరిశీలించిన నేపథ్యంలో ఆ వేదికను పరిశీలించే అవకాశాలు లేకపోలేదు.